సీజేపీ రాజకీయ పార్టీగా...హిట్ అవుతుందా ?
ఈ మొత్తం విషయంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నాయకత్వం వహించారు. ఆయన తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీద మాట్లాడుతూ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అన్నారు.
రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా పెట్టవచ్చు. కానీ అది నిలిచి గెలవడం అన్నది అతి ముఖ్యం. ఆ విధంగా తీసుకుంటే భావోద్వేగం నుంచి పుట్టుకుని వచ్చిన ఒక సంస్థ రాజకీయ పార్టీగా పరిణామ క్రమం చెందడం అంటే అది ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అన్నదే కీలకమైన చర్చ. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో ఇపుడు అదే డిస్కషన్ జరుగుతోంది. నీట్ పరీక్షా పత్రం లీకేజి జరిగింది అంటూ సీజేపీ వాట్సప్ లో ఏర్పాటు కావడం ఆ తరువాత అది గ్రౌండ్ లోకి దిగి నిరసనలు చేయడం చివరికి జంతర్ మంతర్ వద్ద అతి పెద్ద ఆందోళనంగా మారి పార్లమెంట్ మార్చ్ కి వెళ్ళడం అక్కడ పోలీసుల లాఠీలతో సీజేపీకి ఎక్కడ లేని సానుభూతి రావడం ఇలా దేశవ్యాప్తంగా చర్చ సాగి చివరికి ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని ముగించే క్రమంలో కేంద్ర మంత్రి చేత రాజీనామా ఇప్పించింది. అలాగే సీజేపీ డిమాండ్లకు తలొగ్గింది. అంతా బాగానే జరిగిపోయింది.
మొదటి స్టెప్ మాత్రమే :
ఈ మొత్తం విషయంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నాయకత్వం వహించారు. ఆయన తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీద మాట్లాడుతూ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అన్నారు. అంతే కాదు ఈ పోరాటం ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థి శక్తి సాధించిన తొలి విజయంగా అభివర్ణించారు. అందువల్ల ఇది ఇంకా ముగియలేదని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన చెప్పడం విశేషం. విద్యావ్యవస్థలో పూర్తి మార్పులు వచ్చేవరకు తమ పోరాటం ఆగదని అభిజిత్ దీప్కే తేల్చి చెప్పారు. దీని అర్థం సీజేపీ పేరుతో మరిన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పడమే అని అంటున్నారు. అంతే కాదు సీజేపీని ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నారా అన్న ప్రశ్నకు దాని నాయకులు కాదు అని గట్టిగా క్లారిటీ ఇవ్వడం లేదు. నో ఇపుడే చెప్పలేమని అంటూ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశంపై పెద్ద హింట్ ఇచ్చారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
ఆ దిశగా అడుగులు :
ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్‌ను సాధించుకున్న తర్వాత రాజకీయ ప్రత్యామ్నాయంగా మారే అంశాన్ని కొట్టిపారేయలేమని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. అయితే డిజిటల్ మాధ్యమాల ద్వారా వచ్చిన ఈ యువత బలమైన శక్తిగా మారుతుందా లేక ఉద్యమంతోనే ఆగిపోతుందా అనేది రాబోయే కాలం నిర్ణయిస్తుందన్నది ఒక విశ్లేషణ. ఎందుకంటే ఈ రోజున ఇరవై లక్షల మంది నీట్ రాశారు. వారి తల్లిదండ్రులతో పాటు అంతా ఈ అంశం మీదనే సీజేపీకి మద్దతు ఇచ్చారు. అలాగే విద్యార్థుల బాగు కోరుకునే వారు కూడా ఇదే విషయం మీద తమ సపోర్టు ఇచ్చారు. ఇక ఆ ఇష్యూ అయితే ముగిసింది. కానీ ఇపుడు సీజేపీ రాజకీయ పార్టీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తే మాత్రం మద్దతు ఇవ్వడానికి వీరంతా సిద్ధంగా ఉంటారా అంటే జవాబు చెప్పలేమనే వస్తుంది.
ఆ తానులో ముక్కగానే :
సీజేపీ ఎపుడైతే రాజకీయాలు మాట్లాడి పార్టీగా రూపాంతరం చెందుతుందో అపుడు అది కూడా మిగిలిన పార్టీల మాదిరిగానే ఆ తానులో ముక్కగా ఉంటుంది. అపుడు జనాల ఆలోచనలు కూడా మారుతాయి. పైగా రాజకీయ పార్టీగా నిలబడాలి అంటే సీజేపీకి ఈ బలం సరిపోదు, గట్టి సిద్ధాంత భూమిక ఉండాలి. అంతే కాదు దేశంలోని 150 కోట్ల మంది ప్రజల కోసం పాటు పడేలా ఆ పార్టీ విధానాలు ఉండాలి. ఇపుడు చూస్తే అభిజిత్ దీప్కే సహా కొందరు మాత్రమే సీజేపీకి కనిపిస్తున్నారు. జనాకర్షణ అన్నది రాజకీయాల్లో చాలా ముఖ్యం. నీట్ వంటి ఇష్యూలు భావోద్వేగ పూరితమైనవి కాబట్టి అవే జనాలను పోగు చేస్తాయి. కానీ రాజకీయ పార్టీగా ముందుకు వస్తే ఇమేజ్ గ్లామర్ అవసరం అవుతుంది. ఇలా ఎన్నో లెక్కలు ఉన్నాయి.
కలిసినా విడిగా ఉన్నా :
ఇక సీజేపీ రాజకీయ పార్టీ అవతారం ఎత్తి జనం ముందుకు వచ్చినా ఆశించిన స్పందన అయితే దక్కుతుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి. అదే సమయంలో విపక్ష పార్టీలతో చేతులు కలిపినా వారి జట్టు కట్టినా ఆ ఉన్న ఫ్రెష్ గ్లామర్ లుక్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇక సీజేపీ విడిగా పోటీ చేస్తే ఎంతో కొంత యువత ఓట్లు లాగేసుకుంటే ఆ కాడికి కేంద్రంలో బేజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. అలా కాకుండా ఇండియా కూటమి సరసన చేరి పోటీకి వచ్చినా కూడా ఇంపాక్ట్ అయితే పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్ధులు అంతా కలసి తమ సమస్య విషయంలో ఎలుగెత్తి చాటి ఒక పరిష్కారం సాధించుకున్నారు అన్నంతవరకే సీజేపీకి క్రెడిట్ ఇప్పటికి అయితే ఉంది. దీనికి మించి ఎక్కువగా అంచనాలు వేసుకుని రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయని ఎవరూ అనుకోవడం లేదు. అయినా సరే ముందు ముందు ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.