ఏం జరిగినా... ఏఐ రేసులో వెనక్కి తగ్గొద్దు.. ట్రంప్ సంచలన ఆదేశాలు.. కారణమిదే..

కృత్రిమ మేధ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో ఏఐ భద్రత, దానిపై విధించాల్సిన నియంత్రణల గురించి అంతర్జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.

Update: 2026-09-14 05:49 GMT

కృత్రిమ మేధ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో ఏఐ భద్రత, దానిపై విధించాల్సిన నియంత్రణల గురించి అంతర్జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టెక్ దిగ్గజాలు, పరిశోధకులు ఏఐ వల్ల భవిష్యత్తులో మానవాళికి కలిగే ముప్పుల పట్ల నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఏఐ పరిశోధనలను లేదా వాటి అభివృద్ధి వేగాన్ని తగ్గించాలనే వాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఏఐ రంగాన్ని నియంత్రించడం లేదా నెమ్మదించడం అంటే ప్రత్యర్థి దేశమైన చైనాకు నేరుగా అమెరికా ఆధిపత్యాన్ని అప్పగించడమేనని ఆయన చాలా స్పష్టంగా హెచ్చరించారు.

ప్రస్తుతం గ్లోబల్ పొలిటికల్, టెక్నాలజీ పరిణామాలను పరిశీలిస్తే అమెరికా, చైనాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. చైనా పగలు, రాత్రి తేడా లేకుండా టెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తోందని ట్రంప్ గుర్తుచేశారు. భద్రతా కారణాలు చూపి అమెరికా ఏఐ అభివృద్ధిని నిలిపివేసినా లేదా మందగించినా చైనా మాత్రం తన పరిశోధనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా తన సూపర్‌పవర్ హోదాను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఆధిపత్యాన్ని కాపాడుకోవాలంటే ఈ కృత్రిమ మేధ పోటీలో చైనా కంటే ఎల్లప్పుడూ ముందంజలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ వేగాన్ని తగ్గించాలని కోరుకునే వారిని అమెరికా ప్రగతిని నిరోధించే ప్రతికూల శక్తులుగా వ్యాఖ్యానించారు.

మరోవైపు సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనివ్వడమే తన ప్రభుత్వ ప్రాధాన్యత అని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. వినూత్నమైన, అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లను రూపొందించే క్రమంలో ప్రభుత్వ నియమాలు, నిబంధనలు ఆటంకంగా మారకూడదని భావిస్తున్నారు. ఆంత్రోపిక్ సిఈఓ డారియో అమోడెయ్, ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్, , ఎలోన్ మస్క్ వంటి పలువురు ప్రముఖులు ఏఐ సామర్థ్యాలు.. దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ కొంతకాలం పరిశోధనలపై తాత్కాలిక విరామం లేదా కఠిన నిబంధనలు విధించాలని కోరుతున్నారు. అయితే భద్రత పేరుతో వేగాన్ని తగ్గిస్తే వెనుకబడిపోతామనేదే ట్రంప్ ప్రధాన ఆందోళన.

ఈ పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వివాదానికి తెరతీశాయి. ఏఐ సాంకేతికతతో ప్రమాదాలు రాకుండా ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడం ముఖ్యమా లేక అంతర్జాతీయ వేదికపై చైనా వంటి దేశాల పైచేయి సాధించకుండా వేగంగా దూసుకుపోవడం ముఖ్యమా అనే అంశంపై టెక్ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ స్వేచ్ఛా విధానం అమెరికా కంపెనీలకు మరింత ఊతాన్నిస్తుందని కొందరు అంటుంటే ఎలాంటి ఆంక్షలు లేని ఏఐ మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News