మోడీ - జిన్ పింగ్ భేటీ.. అధికారిక ప్రకటనల్లో ఏముంది?

రెండు దేశాల అధికారిక ప్రకటనలు సానుకూలతను వ్యక్తం చేసినా.. ఇరువురు ప్రస్తావించిన అంశాల ప్రాధాన్యతలే ఇప్పుడు ఆసక్తికరమని చెప్పాలి.

Update: 2026-09-14 04:33 GMT

బ్రిక్స్ సదస్సు వేళ.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది భారత ప్రధాని నరేంద్ర మోడీ - చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ. మొత్తానికి ఇరువురు అధినేతల మధ్య భేటీ దాదాపు 50 నిమిషాలకు పైగా సాగింది. అనంతరం రెండు దేశాలు అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి. ప్రధాని మోడీ తరఫున భారత ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేస్తే.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తరఫు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తికర అంశం ఏమంటే.. ఈ రెండు అధికారిక ప్రకటనల్లో పేర్కొన్న అంశాలు.. వాటికి ఇచ్చిన ప్రాధాన్యత వేర్వురుగా ఉండటం.

సాధారణంగా ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యాక.. తాము చర్చించిన అంశాలకు సంబంధించిన వివరాల్ని అధికారిక ప్రకటన రూపంలో విడుదల చేయటం మామూలే. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ భాగం ఒకేలాంటి అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. కానీ.. తాజాగా అందుకు కాస్త భిన్నంగా సాగిందని చెప్పాలి. రెండు దేశాల అధికారిక ప్రకటనలు సానుకూలతను వ్యక్తం చేసినా.. ఇరువురు ప్రస్తావించిన అంశాల ప్రాధాన్యతలే ఇప్పుడు ఆసక్తికరమని చెప్పాలి.

భారతదేశం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఎక్కువగా సరిహద్దు శాంతి.. గత ఒప్పందాల అమలు.. వాణిజ్యం.. మార్కెట్.. వ్యాపార సంబంధాల మీద ఫోకస్ చేస్తే..చైనా ప్రకటనలో ఇరు దేశాలు ప్రత్యర్థులు కాదు.. భాగస్వాములు అన్న అంశాన్ని ప్రస్తావించటంతో పాటు..ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలు మరింత మెరుగుపడేలా చర్యలు.. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు.. ఆర్థిక సహకారం.. సరిహద్దు సమస్య పరిష్కారం అంశాల్ని ప్రస్తావించటం కనిపిస్తుంది. అంటే.. భారత్ సరిహద్దు భద్రత అంశానికి ప్రాధాన్యత ఇస్తే.. చైనా మాత్రం ఇరు దేశాల సంబంధాల్ని మరింత మెరుగుపర్చే అంశానికి.. ఆర్థిక.. వాణిజ్య అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వటం కనిపిస్తుంది.

మోడీ - జిన్ పింగ్ మధ్య సాగిన సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాల్ని సాధారణ స్థితికి తీసుకెళ్లే తదుపరి దశగా మారిందని చెప్పొచ్చు. ఇరువురు నేతల భేటీలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాల ప్రస్తావన వచ్చినప్పటికి.. వాటి ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల్ని దెబ్బ తీసుకోకూడదన్న మాటకు ఏకాభిప్రాయాన్ని సాధించినట్లుగా చెప్పొచ్చు. అదే సమయంలో భారత్ మాత్రం సరిహద్దుల్లో శాంతి లేకుండా సంబంధాలు పూర్తిస్థాయిలో డెవలప్ కావన్న విషయాన్ని స్పష్టం చేసింది.

చైనా మాత్రం సరిహద్దు సమస్యపై ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తూనే.. వాణిజ్యం.. విమాన సర్వీసులు.. ప్రజల రాకపోకలు.. వ్యాపార సంబంధాల్ని ముందుకు తీసుకెళ్లే అంశానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఇరు దేశాలు తమ వాదనల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే స్థితికి అయితే చేరుకున్నారని చెప్పొచ్చు. అదే సమయంలో మరింత ముందుకు వెళ్లి.. ఒప్పందాలు చేసుకునే స్థాయికి మాత్రం వెళ్లలేదని మాత్రం చెప్పక తప్పదు. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి.

ప్రధాని మోడీతో సాగిన 50 నిమిషాల సమావేశం అనంతరం చైనా అధినేత గాలా విందుకు హాజరు కాకుండా తన హోటల్ గదికి వెళ్లిపోయారు. అయితే..దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నా.. చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనల్లో నెగిటివ్ టోన్ కనిపించకపోవటం చూసినప్పుడు.. బయటకు రాని విషయం ఏదో ఉంది. అది త్వరలోనే వస్తుందని చెప్పటం ఇప్పటివరకు సరైన మాటగా చెప్పొచ్చు. సింఫుల్ గా చెప్పాలంటే ‘అబీ పిక్చర్ బాకీ హై’ అనే సినిమా డైలాగ్ ను చెప్పేసుకొని.. తర్వాతి పరిణామాల కోసం వెయిట్ చేయటం సరైన పద్దతిగా చెప్పొచ్చు.

Tags:    

Similar News