భూతాపం పెరగడంలో ప్రతి AI యూజర్ భాగస్వామి!
సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల నాటి రెట్రో స్టైల్ సెల్ఫీలు- ఏఐ (AI) జనరేటెడ్ ఫోటోల ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల నాటి రెట్రో స్టైల్ సెల్ఫీలు- ఏఐ (AI) జనరేటెడ్ ఫోటోల ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది. సాధారణ ఫొటోలను ఏఐ టూల్స్ సహాయంతో పాత కాలపు కేశాలంకరణ.. వింటేజ్ దుస్తులు.. ఓల్డ్ స్టూడియో బ్యాక్‌డ్రాప్‌లతో రీల్స్- పోస్టులుగా మార్చుకుంటూ యూజర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ డిజిటల్ మ్యాజిక్ వెనుక ఒక పెద్ద భౌతిక పరమైన మౌళిక వసతుల వ్యవస్థ.. భారీ పర్యావరణ వ్యయం దాగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక ఏఐ ఇమేజ్‌ను సృష్టించడానికి పట్టే విద్యుత్ వినియోగంపై నిపుణుల అంచనాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏఐఎన్స్యూర్డ్ సీటీవో డాక్టర్ శ్రీనివాస్ పద్మనాభుని అంచనా ప్రకారం.. ఒక ఏఐ ఇమేజ్ తయారీకి దాదాపు 1.2 వాట్-అవర్ల విద్యుత్ ఖర్చవుతుంది. అలాగే `మాస్టెక్ గ్రూప్`కు చెందిన రిత్విక్ బాతాబ్యాల్ ... `ఏఐ అండ్ బియాండ్` సీఈవో జస్ ప్రీత్ బింద్రా తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్ & కంప్యూటింగ్ సెటప్‌ను బట్టి ఇది 0.1 నుంచి కొన్ని వాట్-అవర్ల వరకు మారుతుంటుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఏ) రిపోర్ట్ ప్రకారం టెక్ట్స్ ఆధారిత పనులతో పోలిస్తే ఇమేజ్ జనరేషన్‌కు దాదాపు 1450 రెట్లు ఎక్కువ శక్తి అవసరమవుతుంది.
వ్యక్తిగతంగా ఒక్కో ఇమేజ్ కోసం ఖర్చయ్యే శక్తి చాలా తక్కువనిపించినా కోట్లాది మంది యూజర్లు దీనిని వినియోగిస్తున్నప్పుడు సమస్య జటిలమవుతుంది. నచ్చిన అవుట్‌పుట్ వచ్చే వరకు ఒకే ఫోటోను పదే పదే జనరేట్ చేయడం వల్ల సర్వర్లపై తీవ్ర భారం పడుతుంది. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (యుఎన్‌యు) అంచనాల ప్రకారం 2023 నాటికే రోజుకు కోట్లాది ఏఐ ఇమేజ్‌లు తయారయ్యాయి. దీనివల్ల డేటా సెంటర్లు తీవ్రమైన ఉష్ణాన్ని వెదజల్లడంతో పాటు వాటి కూలింగ్ కోసం భారీగా విద్యుత్- నీటి వనరులు ఖర్చవుతున్నాయి.
డిజిటల్ సౌలభ్యం అంటే భౌతికంగా ఎలాంటి ఖర్చు లేదని అర్థం కాదని... టెక్నాలజీ స్టాక్‌లో సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదు కానీ.. భవిష్యత్‌లో తక్కువ కంప్యూటింగ్ శక్తి... తక్కువ శక్తి వనరులతో పనిచేసే మరింత బాధ్యతాయుతమైన AI విధానాలను అభివృద్ధి చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
ఒక రోజుకు ఎన్ని ఇమేజ్‌లు? ఎన్ని వీడియోలు?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో రోజువారీగా జనరేట్ అవుతున్న డిజిటల్ కంటెంట్ గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పలు పరిశ్రమల నివేదికల ప్రకారం.. మిడ్‌జర్నీ, డాల్-ఈ, స్టేబుల్ డిఫ్యూజన్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 3.4 కోట్లకు పైగా (34 మిలియన్ల) ఏఐ ఇమేజ్‌లు తయారవుతున్నాయి. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో గరిష్ట వినియోగ సమయంలో ఈ సంఖ్య రోజుకు కోట్లలో ఉంటుందని అంచనా. ఇక ఏఐ వీడియోల విషయానికి వస్తే.. రన్‌వే, పింకా, గూగుల్ వీయో, క్లింగ్ ఏఐ వంటి అత్యాధునిక టెక్ట్స్-టూ-వీడియో టూల్స్ అందుబాటులోకి రావడంతో వీడియో జనరేషన్ కూడా భారీగా పెరిగింది. ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా రోజువారీగా లక్షలాది క్లిప్‌లు తయారవుతుండగా.. సోషల్ మీడియాలో ఏఐ-లేబుల్డ్ లేదా పూర్తిగా ఏఐ సృష్టిస్తున్న వీడియోల సంఖ్య రోజువారీగా మిలియన్ల కొద్దీ రికార్డవుతోంది. సాంకేతిక పురోగతి కారణంగా ఈ కంటెంట్ సృష్టి ప్రతిరోజూ వేగంగా పెరుగుతోంది.
AI డేటా కేంద్రాలు ఓజోన్‌కి చిల్లు పెడుతున్నాయా?
ఏఐ (AI) డేటా కేంద్రాల నుండి విడుదలయ్యే వేడి - విద్యుత్ వినియోగం నేరుగా భూమిని రక్షించే ఓజోన్ పొరకు చిల్లు పెట్టవు. ఓజోన్ పొరను దెబ్బతీసే ప్రధాన కారకాలు క్లోరోఫ్లోరోకార్బన్లు (CFCs) వంటి రసాయన వాయువులు. అయితే ఏఐ సాంకేతికత పెరుగుదల పర్యావరణంపై పరోక్షంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. డేటా సెంటర్ల భారీ విద్యుత్ అవసరాల కోసం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)- వాతావరణ మార్పులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ కార్బన్ ఉద్గారాలతో పాటు సర్వర్ల శీతలీకరణ కోసం లక్షలాది లీటర్ల నీరు.. అపారమైన విద్యుత్ ఖర్చవుతుండటం ప్రకృతి వనరులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. డిజిటల్ సౌలభ్యం తాత్కాలికంగా ఆనందాన్నిచ్చినా... దాని వెనుక ఉన్న భౌతిక మౌలిక వసతులు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. అందుకే మునుముందు రోజుల్లో డేటా సెంటర్లు పునరుత్పాదక శక్తిని వాడటం.. మరింత సమర్థవంతమైన శీతలీకరణ విధానాలను అవలంబించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.