మోడీ క్లాస్ మేట్ కు కబ్జా కష్టం.. ప్రధానిని కలిసి విన్నపం

ముంబయి సెంట్రల్ నుంచి సుమారు 41 కి.మీ., ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు 44 కి.మీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి 25-30 కి.మీ. దూరంలో ఉంది మిరా - భయాందర్ ప్రాంతం.

Update: 2026-09-14 04:32 GMT

అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి తెలిసినప్పుడు భూకబ్జాకు ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేదన్న విషయం స్పష్టం కావటమే కాదు.. అలాంటి సమస్యల్లో చిక్కుకున్నప్పుడు న్యాయం కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాలన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్కూల్ మేట్ ఒకరి స్థలాన్ని బడా రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేయటం.. దీనికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సపోర్టు చేయటంతో.. మరో మార్గం లేక తనకు పరిచయస్తుడైన తన చిన్ననాటి స్కూల్ మేట్ ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసి.. తన సమస్య గురించి ఏకరువు పెట్టుకున్నారు. తనకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని 81 ఏళ్ల ఆ వ్యక్తి (అన్గరాలీ వోహ్రా) నమ్ముతున్నారు. ఇంతకూ అసలు సమస్య ఏంటి? ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు కలిశారు? ఆ సందర్భంగా ఏం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

ముంబయి సెంట్రల్ నుంచి సుమారు 41 కి.మీ., ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు 44 కి.మీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి 25-30 కి.మీ. దూరంలో ఉంది మిరా - భయాందర్ ప్రాంతం. ఈ వివరాలు చాలు.. ఆ ప్రాంతం ఎంత ఖరీదైనదో. ఆ ప్రాంతంలోని నవ్ ఘర్ రోడ్డులో అస్గరాలీ వోహ్రా అనే 81 ఏళ్ల పెద్దాయనకు 2810 చదరపు మీటర్లు (అంటే 3361 గజాలు) భూమి ఉంది.ఆయన దానిని 1989 ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఇప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం అక్కడ గజం రూ.1.50లక్షలుగా చెబుతున్నారు. మరింత ఎక్కువగా ఉండొచ్చు కూడా. కాస్త తగ్గించి చెబితేనే ఈ ధరగా చెప్పొచ్చు.

అప్పట్లో ఆయన ఆ భూమిని కొనుగోలు చేసుకొని రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆ భూమిని ఎవరికి అమ్మలేదు.. బదిలీ చేయలేదు. అయితే.. ఇంత ఖరీదైన స్థలాన్ని చూస్తూ ఊరుకోరు కదా? అలానే.. ఈ స్థలం మీద కొందరి కన్నుపడింది. తప్పుడు పత్రాలను క్రియేట్ చేసిన కొందరు 2011లో ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. స్వయం బిల్డర్స్.. సెవెన్ ఎలెవెన్ కన్ స్ట్రక్షన్స్ సంస్థలు ఈ భూమిని చెరి సగం ఆక్రమించుకున్నాయి. ఇందులో సెవెన్ ఎలెవెన్ కన్ స్ట్రక్షన్ సంస్థకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నరేంద్రకు సంబంధాలు ఉన్నాయి.

తన భూమిని కబ్జా చేసిన ఉదంతంపై అస్గరాలీ వోహ్రా మిరా - భయాందర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు విన్నవించారు. ఎన్నోసార్లు వారికి ఫిర్యాదు చేశారు. 2015లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. కేసు నమోదైన 11 ఏళ్లకు సీఐడీ రిపోర్టు ఇచ్చింది. కట్ చేస్తే.. 2025లో బిల్డర్ సంస్థలు వోహ్రాపైన ఎదురు కేసు పెట్టారు. దీంతో.. తన సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఉన్న ఒకే ఒక్క దారి.. తన చిన్ననాటి స్కూల్ మేట్, ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గుర్తుకు వచ్చారు. ఆయన్ను కలిసేందుకు అధికారులను సమయం కోరగా.. వారు ఇవ్వటం.. ప్రధాని మోడీని కలిసి తన సమస్యను విన్నవించుకున్నారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయాలని తాను మోడీని కోరినట్లుగా పేర్కొన్నారు. ప్రధాని మోడీని కలిసిన నేపథ్యంలో తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. విషయం ప్రధానమంత్రి వరకు వెళ్లిందన్న సమాచారంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలెర్టు అయ్యారు. ఈ నెల 16న తమ ఎదుట హాజరై ఈ మొత్తం ఉదంతంపై వివరణ ఇవ్వాలని రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఎక్స్ లో తెలపటంతో.. ఈ విషయం వెలుగు చూసింది. ఈ అంశంపై సదరు మంత్రి స్పందిస్తూ.. అస్గరాలీ వోహ్రాకు ప్రధాని మోడీ న్యాయం చేస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు.

Tags:    

Similar News