దేవుడా.. ఆ మైనర్ బాలికకు నరకంగా మారిన ఇన్ స్టా పరిచయం
సోషల్ పరిచయం హుషారులో తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సదరు మైనర్ బాలిక.. చివరకు తనకు దారుణమైన అనుభవాలతో విసిగిపోయి..
ఒక పరిచయం హైదరాబాద్ కు చెందిన మైనర్ బాలికకు నరకాన్ని చూసేలా చేసింది. సరదా పరిచయం కాస్తా అత్యంత ఘోరంగా మారటమే కాదు.. ఆమె జీవితాన్ని ఛిన్నాభిన్నం అయ్యేలా చేసింది. విన్నంతనే భయంతో గగుర్పాటుకు గురయ్యేలా ఉన్న ఈ ఉదంతం ఆదివారం వెలుగు చూసింది. సోషల్ పరిచయం హుషారులో తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సదరు మైనర్ బాలిక.. చివరకు తనకు దారుణమైన అనుభవాలతో విసిగిపోయి.. ఇంటికి చేరి తల్లిదండ్రుల ఎదుట భోరుమన్న వేళ.. ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలు విన్నంతనే షాక్ కు గురి కావటమే కాదు.. నోటి వెంట మాటలు రాని పరిస్థితి. పోలీసులకు బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఇంతకూ అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ మహానగర పరిధిలోని అల్వాల్ కు చెందిన మైనర్ బాలిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. పదో తరగతి చదివే వేళలో ఆమెకు ఇన్ స్టాలో జెర్నీ వరుణ్ అనే కుర్రాడు పరిచయమయ్యాడు. ఆ క్రమంలో అతడితో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో అతగాడు ఓ రోజు కారులో తీసుకెళ్లి మత్తుమందు కలిపిన చాక్లెట్ తినిపించి.. మత్తులోకి వెళ్లాక కారులోనే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వరుణ్ పరిచయం చేసిన మరో కుర్రాడు బాధితురాలితో స్నేహం నటిస్తూ.. ఆమెకు మద్యం.. సిగిరెట్లు.. గంజాయి అలవాటు చేశాడు. కొంతకాలానికి ఆమెను కొంపల్లిలోని ఒక ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తీరుపై అనుమానం వచ్చిన తండ్రి ఆమెను ప్రశ్నిస్తూ.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆ బాలిక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.
ఇంటి నుంచి నేరుగా బొల్లారం రైల్వేస్టేషన్ కు చేరుకున్న ఆమె.. తనకు పరిచయస్తుడైన నీరజ్ నే కుర్రాడ్ని పిలిచింది. అతను తన స్నేహితుడైన విక్కీని స్టేషన్ కు రమ్మన్నాడు. వీరిద్దరు కలిసి బాలికతో గంజాయి కలిపిన సిగిరెట్లు తాగించి.. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత అక్కడి దగ్గర్లోని మరో ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లిన విక్కీ.. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విక్కీ తన స్నేహితుడైన నిఖిల్ తో కలిసి బాధితురాలిని టూవీలర్ మీద దూలపల్లికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు మత్తు సిగిరెట్ ను బలవంతంగా తాగించారు.
ఆ తర్వాత దగ్గర్లోని ఓయో రూంకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం హోటల్ రూం నుంచి ఆమెను ఇంటికి తీసుకెళ్లిన విక్కీ.. ఆపై మరోసారి విక్కీ.. నిఖిల్ ఇద్దరు కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సెల్ ఫోన్ లాక్కొని.. ఆమెను అక్కడే బంధించారు. బాధితురాలి ఒకసారి నిందితుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆమెను వెంటాడి పట్టుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను ధూల్ పేట వైపు తీసుకెళ్తున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయటంతో మధ్యలోనే వదిలేసి వారు పరారయ్యారు. ఆపై మరో ఆటోలో ఇంటికి చేరుకున్న బాలిక.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పటంతో వారు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు (జెర్నీ వరుణ్, రోమల వరుణ్, నీరజ్, విక్కీ, నిఖిల్, గణేష్ ఇతరులు) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వారిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.