ఆంక్షలు పెట్టిన మామ.. స్వేచ్ఛను కోరిన కోడలు.. చివరకు నెత్తుటి మరక
ఇంటి హాల్‌తో సహా ప్రధాన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి, కుటుంబ సభ్యుల ప్రతి కదలికనూ నిరంతరం పర్యవేక్షించేవాడు. ముఖ్యంగా కోడలు లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం..
కాన్పూర్ పట్టణంలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన కుటుంబ సంబంధాల్లో కొరవడుతున్న ఓర్పుకు.. క్షణికావేశంలో రూపుదిద్దుకుంటున్న క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఇంటి సభ్యుల కదలికలపై నిఘా ఉంచడం, వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం వంటి ఆంక్షల నడుమ నలిగిపోయిన ఒక కోడలు, తన మామనే అంతమొందించే స్థాయికి దిగజారింది. ఆలుమగల నడుమ లేదా కుటుంబంలో తలెత్తే మనస్పర్థలను చర్చలతో పరిష్కరించుకోవాల్సింది పోయి, సుపారీ ముఠాతో చేతులు కలిపి దారుణ హత్యకు ఒడిగట్టింది.
కాన్పూర్‌కు చెందిన ఒక ప్రముఖ ఫార్మా వ్యాపారవేత్త తన ఇంట్లో ఆంక్షల పర్వాన్ని అమలుచేసేవాడు. ఇంటి హాల్‌తో సహా ప్రధాన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి, కుటుంబ సభ్యుల ప్రతి కదలికనూ నిరంతరం పర్యవేక్షించేవాడు. ముఖ్యంగా కోడలు లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం.. ఆలస్యంగా రావడంపై ఆంక్షలు విధించడమే కాక.. ఆర్థిక స్వేచ్ఛ లేకుండా కట్టడి చేసేవాడు. మామ పెడుతున్న ఈ మానసిక నరకం క్రమంగా ఆమెలో తీవ్ర ద్వేషంగా రగిలింది. ఆ ద్వేషమే మామను తమ జీవితాల నుంచి శాశ్వతంగా తొలిగించాలనే నెత్తుటి పథకానికి బీజం వేసింది.
తన కుట్రను అమలు చేయడానికి ఆమె పూర్వపు ఇంటి పనిమనిషినే ఎంచుకుంది. ఆరు లక్షల రూపాయల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. హంతకులు సులభంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు వీలుగా ఇంటి అసలు తాళాన్ని ఇచ్చి డూప్లికేట్ కీ తయారు చేయించింది. ప్రణాళిక ప్రకారం శనివారం రాత్రి భర్తతో కలిసి ఆమె పార్టీకి వెళ్లగా అదే సమయానికి అద్దె హంతకులు నకిలీ తాళంతో ఇంట్లో అడుగుపెట్టారు. మొదట దిండుతో ఊపిరి ఆడకుండా చేసి గుండెపోటుగా చిత్రీకరించాలని భావించినప్పటికీ బాధితుడు మేల్కోవడంతో దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. శరీరంపై ఏకంగా 26 సార్లు విచక్షణారహితంగా పొడిచి అతడి ప్రాణాలు తీశారు.
హత్య అనంతరం ఇంట్లోని నగదు, నగలు ఏమీ మాయం కాకపోవడంతో పోలీసుల అనుమానం కుటుంబ సభ్యులపైకి మళ్లింది. కాగా ఇంటి సభ్యులపై నిఘా పెట్టేందుకు వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలే చివరికి ఈ ముఠా గుట్టును రట్టు చేశాయి. కుమారుడు, కోడలు ఇంట్లో లేని సమయంలో పాత పనిమనిషి మరొకరితో కలిసి లోపలికి వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కోడలే ఈ హత్యకు మాస్టర్‌మైండ్ అని తేలింది. నిఘా నీడ నుంచి తప్పించుకోవడానికి వేసిన ఈ నెత్తుటి ప్లాన్ చివరికి కోడలితో పాటు హంతకులను కూడా జైలు పాలు చేసింది.