మద్యంలో విషం.. కుక్కపై ట్రయల్స్.. 4 నెలల్లో 8 మందిని మట్టుబెట్టిన సైకోకిల్లర్.. ఒక్క ఫోన్ కాల్ తో దొరికాడిలా..
బాలోదాబజార్-భటాపారా జిల్లాలోని ఖర్వే గ్రామంలో జరిగిన ఈ వరుస హత్యల వివరాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరుగా ఏకంగా ఎనిమిది మందిని అత్యంత క్రూరంగా విషమిచ్చి హతమార్చాడు ఓ సైకో కిల్లర్. పైగా తానే హత్యలు చేసి.. ఏమీ తెలియనట్టు బాధితుల అంత్యక్రియలకు హాజరవుతూ సానుభూతి నటించాడు. బాలోదాబజార్-భటాపారా జిల్లాలోని ఖర్వే గ్రామంలో జరిగిన ఈ వరుస హత్యల వివరాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
హత్యలకు కారణాలు.. నిందితుడి నేపథ్యం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్వే గ్రామానికి చెందిన 46 ఏళ్ల రామ్ సహాయ్ జైస్వాల్ అనే దుకాణదారుడు ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. ఫిబ్రవరి నుంచి జూన్ 2026 మధ్య కాలంలో ఈ హత్యలు జరిగాయి. నిందితుడిని విచారించగా.. వ్యక్తిగత కక్షలు, చిన్నచిన్న గొడవలు, ఇతరులు తనను దూషించడం, తన క్యారెక్టర్‌ను అనుమానించడం.. కొందరు చేతబడి చేస్తున్నారనే మూఢనమ్మకాల వల్లే ఈ హత్యలు చేసినట్లు అంగీకరించాడు. మరణించిన వారంతా 38 ఏళ్లు పైబడిన పురుషులేనని జిల్లా ఎస్పీ ఓ.పీ. శర్మ వెల్లడించారు.
మొదటి హత్య ఎలా జరిగింది?
ఫిబ్రవరి 6న బద్రీ అనే వ్యక్తి రామ్ సహాయ్‌ను తరచూ దూషిస్తూ, మద్యం ఇవ్వాలని వేధించేవాడు. దీంతో పగ పెంచుకున్న నిందితుడు, మద్యంలో బోరాక్స్ పొడి విషం కలిపి అతనికి ఇచ్చాడు. అది తాగిన బద్రీ మరణించాడు. ఫిబ్రవరి 20న మొదటి హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకపోవడంతో నిందితుడికి ధైర్యం పెరిగింది. ఇదే పద్ధతిలో బుతాలు అనే మరో వ్యక్తికి విషం కలిపిన మద్యం ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత వరుసగా మరో ఆరుగురిని ఇదే తరహాలో టార్గెట్ చేసి మట్టుబెట్టాడు.
కుక్కపై ముందే ట్రయల్స్
నిందితుడు రామ్ సహాయ్ గ్రామంలోని ఒక వ్యక్తి వద్ద ఎలుకల మందు కావాలని చెప్పి బోరాక్స్ పొడిని సేకరించాడు. మనుషులకు ఇవ్వడానికి ముందే.. ఆ విషం ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షించడానికి ఒక కుక్కకు ఆహారంలో కలిపి ఇచ్చి చంపాడు. అది సక్సెస్ కావడంతో అదే ఫార్ములాను మనుషులపై ప్రయోగించాడు.
ఒకే ఒక్కడి ప్రాణం.. నిందితుడి గుట్టు రట్టు
ఎంత పకడ్బందీగా హత్యలు చేసినా ఒక చిన్న తప్పుతో నిందితుడి పాపం పండింది. ఏప్రిల్ 14న కార్తిక్ అనే వ్యక్తికి చివరగా కాల్ చేసి మరీ రామ్ సహాయ్ విషం కలిపిన మద్యం ఇచ్చాడు. అయితే కార్తిక్ అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తనకు రామ్ సహాయ్ ఇచ్చిన మద్యం తాగిన తర్వాతే తీవ్ర అస్వస్థతకు గురయ్యానని కార్తిక్ గ్రామస్థులకు చెప్పడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో అప్రమత్తమైన గ్రామస్థులు.. జూన్ 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి నుండి మే మధ్య జరిగిన 8 మంది అనుమానాస్పద మరణాల వెనుక రామ్ సహాయ్ హస్తం ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏడు మృతదేహాల వెలికితీత.. ఫోరెన్సిక్ పరీక్షలు
గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే పూడ్చిపెట్టిన ఏడుగురి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం రాయ్‌పూర్‌లోని మెడికో లీగల్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అనంతరం డీఎన్‌ఏ, విసెరా నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే మరో బాధితుడు బుధ్రామ్ జైస్వాల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పటికే దహనం చేయడంతో అతని నమూనాలు సేకరించడం సాధ్యపడలేదు.
రెండు వారాల వేట.. అంతం దొరికింది
కార్తిక్ ఇచ్చిన వాంగ్మూలం, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా పోలీసులు రెండు వారాల పాటు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలు లభించడంతో మంగళవారం రామ్ సహాయ్ జైస్వాల్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు ఎనిమిది మందిని హత్య చేసినట్లు, ఒకరిని చంపడానికి ప్రయత్నించినట్లు తలవంచాడు.
తానే హత్యలు చేస్తూ ఏమీ ఎరగనట్లు బాధితుల కుటుంబాలను పరామర్శించడం, వారి అంత్యక్రియల్లో పాల్గొనడం వంటి నిందితుడి నటనను చూసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.