నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ దారుణ హత్య.. కేసును ఛేదించిన పోలీసులు, నిందితులు పదో తరగతి విద్యార్థులే..

కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి (45) దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2026-08-19 10:09 GMT

కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి (45) దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపల్‌ను హత్య చేసింది ఆమెకు విద్యార్థులుగా ఉన్న పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. డబ్బు కోసం పక్కా ప్రణాళికతోనే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

కొండమల్లేపల్లి పట్టణంలోని జేబీ కాలనీలో నివాసం ఉంటున్న రూపారెడ్డి ఈ నెల 11వ తేదీన హత్యకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పాఠశాల విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్న ఆమెను నిందితులు అప్పటికే గమనించినట్లు పోలీసులు గుర్తించారు.

గోడ దూకి ఇంట్లోకి ప్రవేశం

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నిందితులు ముందుగానే రూపారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆమె ఇంటి తాళం తీసుకుని లోపలికి వచ్చిన సమయంలో వంటగదిలో దాక్కున్నారు. రూపారెడ్డి ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో వెనుక నుంచి ఒక్కసారిగా దాడి చేశారు. కత్తితో ఆమెపై ఏకంగా 27 సార్లు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య అనంతరం ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న నగదును నిందితులు తీసుకెళ్లినట్లు సమాచారం. తొలుత సుమారు రూ.2 లక్షలు దోచుకెళ్లినట్లు సమాచారం ఉండగా మొత్తం రూ.4 లక్షల వరకు నగదు అపహరించి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయికి అలవాటు.. జల్సాల కోసం డబ్బు

నిందితులు గంజాయికి అలవాటు పడటంతో పాటు విచ్చలవిడిగా ఖర్చులు, జల్సాలకు అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డబ్బు అవసరం కావడంతో ప్రిన్సిపల్‌ను టార్గెట్ చేసినట్లు సమాచారం. హత్య అనంతరం దొంగిలించిన డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

అయితే పోలీసులు అనుమానం రాకుండా నిందితులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో తమ కదలికలు కనిపించకుండా వ్యవహరించడంతో పాటు.. హత్య జరిగిన తర్వాత కూడా సాధారణంగానే స్కూల్‌కు వచ్చి పరిణామాలను గమనించినట్లు తెలుస్తోంది.

80 మందిని విచారించిన పోలీసులు

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు 80 మందిని విచారించినట్లు సమాచారం. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులుగా గుర్తించినట్లు సమాచారం.

నిందితులను ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని విచారిస్తూ హత్యకు దారితీసిన పూర్తి కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం నగదు కోసమే ఈ హత్య జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రిన్సిపల్‌ను ఆమె విద్యార్థులే హత్య చేశారన్న విషయం వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

Tags:    

Similar News