త‌ప్పుకొన్న చోట త‌లెత్తుకుని.. పుంగ‌నూరు టీడీపీ ప‌వ‌ర్‌ఫుల్‌..?

2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు, కేడ‌ర్‌.. నామినేష‌న్ వేసేందుకు కూడా హ‌డ‌లిపోయిన నియోజ‌క‌వ‌ర్గం.. ఉమ్మ‌డి చిత్తూరులోని పుంగ‌నూరు.

Update: 2026-09-14 08:30 GMT

2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు, కేడ‌ర్‌.. నామినేష‌న్ వేసేందుకు కూడా హ‌డ‌లిపోయిన నియోజ‌క‌వ‌ర్గం.. ఉమ్మ‌డి చిత్తూరులోని పుంగ‌నూరు. అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భావం, ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇలాకా కావ‌డంతో టీడీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కూడా సాహ‌సించ లేనంతగా ఇక్క‌డ `రాజ‌కీయం` పెరిగిపోయింది. అయితే.. ప‌రిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు కదా..! గ‌త ఎన్నికల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం తర్వాత‌.. ఇక్క‌డ ప‌రిణామాలు కూడా మారాయి.

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టికీ.. టీడీపీ హ‌వా ఇప్పుడు పెద్ద ఎత్తున క‌నిపిస్తోం ది. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచే త‌ప్పుకొన్న నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా టీడీపీ శ‌క్తిమంత‌మైంది. ఇక‌, తాజా ఎన్నిక‌ల ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. పుంగనూరు మునిసిపల్ ఎన్నికల రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. గతంలో ఏకపక్షంగా సాగిన ఇక్కడి రాజకీయం, కూటమి ప్రభుత్వం వ‌చ్చాక‌ సమీకరణాలు మారడంతో ఈసారి టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉండ‌ద‌ని, ఏక‌ప‌క్షానికి దారితీయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

పెద్దిరెడ్డికి స‌వాలే..

టీడీపీలోకి వలసలు వైసీపీకి భారీ ఎదురుదెబ్బగా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి స‌వాల్ రువ్వుతున్నాయి. గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ 31 కి 31 వార్డులను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది కానీ, వాస్త‌వానికి గతంలో టీడీపీ ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ నుంచి తప్పుకుంది. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడి రాజకీయాలు పూర్తిగా మారాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ లో చేరడం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్‌గా మారింది. ఇప్పుడు ఆయ‌న ఎలాంటి వ్యూహాలు అనుస‌రిస్తారో చూడాలి.

చ‌ల్లాదే ఛాన్స్‌

పుంగ‌నూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆధ్వర్యంలో టీడీపీ మున్సిపాలిటీ పరిధిలో చాలా బలంగా తయారైంది. గతంలో నామినేషన్లు కూడా వేయని పరిస్థితి నుంచి, ఈసారి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీడీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. దీంతో ఇక్క‌డ వైసీపీకి గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్ప‌ద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ పోటీకి నిలుస్తుందా? చేతులు ఎత్తేస్తుందా? అనేది చూడాలి.

Tags:    

Similar News