ఉన్నదే తెల్లజుట్టు.. దాని మేకప్ కు రూ. 4.49 కోట్లా? ప్రధాని, ఆయన భార్య మేకప్ ఖర్చులపై దుమారం

నెతన్యాహు మళ్లీ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ వ్యయం మునుపెన్నడూ లేని రీతిలో పెరిగింది. 2023 వార్షిక ఖర్చు చూస్తే హెయిర్ అండ్ మేకప్ కోసం సుమారు రూ. 98 లక్షలు.

Update: 2026-09-14 07:05 GMT

ప్రజాధనాన్ని నాయకులు ఎలా ఖర్చు చేస్తున్నారనే అంశంపై ఇజ్రాయెల్‌లో ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఏకంగా హెయిర్ స్టైలింగ్, మేకప్, వ్యక్తిగత గ్రూమింగ్ కోసమే ప్రభుత్వం రూ. 4.49 కోట్ల నిధులను నీళ్లలా ఖర్చు చేసినట్లు వెల్లడైన అధికారిక గణాంకాలు ఆ దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 'ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్' కింద దాఖలైన పిటిషన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన సమాధానంతో ఈ అపరిమిత వ్యయం వెలుగులోకి వచ్చింది.

ఖర్చుల్లో సింహభాగం నెతన్యాహు దంపతులదే..

2019 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు నమోదైన రికార్డుల ప్రకారం ప్రధానులు, వారి అధికారిక ప్రతినిధుల రూపురేఖల దిద్దుబాటుకు ప్రభుత్వం రూ. 4.49 కోట్లు వెచ్చించింది. ఇందులో ఏకంగా 90 శాతం ఖర్చు ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు కోసమే కావడం విశేషం. ఈ కాల వ్యవధిలో అత్యధిక కాలం నెతన్యాహూనే అధికారంలో ఉండటంతో ఈ స్థాయి వ్యయం నమోదైంది.

ఏటికేడూ పెరుగుతున్న అందాల బిల్లు

నెతన్యాహు మళ్లీ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ వ్యయం మునుపెన్నడూ లేని రీతిలో పెరిగింది. 2023 వార్షిక ఖర్చు చూస్తే హెయిర్ అండ్ మేకప్ కోసం సుమారు రూ. 98 లక్షలు. 2025లో రికార్డు వ్యయం నమోదైంది. చరిత్రలోనే అత్యధికంగా ఒకే ఏడాదిలో రూ. 1.06 కోట్లను కేవలం మేకప్‌కే కేటాయించారు. వాషింగ్టన్ పర్యటన ఫిబ్రవరి 2025 కోసం కేవలం 4 రోజుల అమెరికా పర్యటనలోనే మేకప్, హెయిర్ స్టైలింగ్ కోసం వెచ్చించిన మొత్తం రూ. 12.9 లక్షలు కావడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

యుద్ధ ప్రాంగణంలోనూ ఆగని 'మేకప్' ప్రియత్వం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతున్న వేళ దేశం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనూ ఈ ఖర్చులకు విరామం లభించకపోవడం గమనార్హం. 2023 సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కేవలం మూడు నెలల కాలంలోనే ప్రధాని రూపకల్పన కోసం ప్రభుత్వం రూ. 2.48 లక్షలు చెల్లించింది.

ప్రజాధనమా.. వ్యక్తిగత విలాసమా?

అంతర్జాతీయ వేదికలు, మీడియా సమావేశాలలో ఒక దేశ ప్రధాని ఆహార్యం, ప్రొఫెషనల్ లుక్ చాలా ముఖ్యమని ఒక వర్గం సమర్థిస్తుండగా సామాన్యుల పన్నుల డబ్బును ఇలా సొంత అందచందాల కోసం కోట్లాది రూపాయలు తగలేయడం ఎంతవరకు సమంజసమని ఇజ్రాయెల్ పౌరులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు దేశం రక్షణ సవాళ్లను ఎదుర్కొంటుంటే, మరోవైపు ప్రభుత్వ నిధుల పారదర్శకతపై ఈ రూ. 4.49 కోట్ల మేకప్ బిల్లు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

Tags:    

Similar News