మున్సిపల్ చైర్మన్, మేయర్ : పవర్స్ లేని పదవులా..? కమిషనర్ అధికారాలే ఎక్కువంటే..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్, మేయర్ పదవులకు రాష్ట్రవ్యాప్తంగా గట్టి పోటీ నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్, మేయర్ పదవులకు రాష్ట్రవ్యాప్తంగా గట్టి పోటీ నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 17 పట్టణ సంస్థలకు చైర్మన్ సహా కౌన్సిల్ మొత్తం ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక 83 నగారాలు, పట్టణాల్లో మాత్రమే ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా పోటాపోటీగా కోట్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి గెలిచే నాయకులకు ఎలాంటి అధికారాలు ఉంటాయి? పట్టణ పాలనలో మేయర్ లేదా చైర్మన్ అధికారాలు ఏంటో తెలుసుకుంటే ఎవరికైనా మతిపోతుంది. ప్రజలు ఎన్నుకున్న ఈ నేతలకు పట్టణ పాలనలో పరిమితమైన పాత్రమే ఉంది. మేయర్ లేదా చైర్మన్ కన్నా సంబంధిత మున్సిపల్ కౌన్సిల్ లో పనిచేసే ప్రభుత్వ అధికారి అయిన కమిషనర్ పాత్రే ఎక్కువని చట్టం చెబుతోంది. మరి అలాంటప్పుడు ఈ పదవుల కోసం అంత ప్రెస్టేజి ఎందుకు తీసుకుంటున్నారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా చెబుతున్నారు.
కోట్లు ఖర్చు.. అలంకార పదవులు
స్థానిక సంస్థల ఎన్నికలంటేనే కోట్ల రూపాయల ఖర్చు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలవడానికి, మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి అభ్యర్థులు శక్తికి మించి ఖర్చు చేస్తుంటారు. కేవలం వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం స్థాయికి మించి అప్పులు చేసి మరీ డబ్బు ధారపోస్తారు. అయితే 74 రాజ్యాంగ సవరణ అమలు చేయకపోవడం వల్ల మేయర్, చైర్మన్ వంటి పదవులు అధిష్టించిన వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోతున్నారని అంటున్నారు. మేయర్ ఇన్ కౌన్సిల్ అధికారాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమే కాదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు.
మేయర్, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నవారికి సంబంధిత నగరంలో సర్వాధికారాలు ఉంటాయని ప్రజలు భావిస్తారు. కానీ, వాస్తవంలో అలా జరగడం లేదని అంటున్నారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 12వ షెడ్యూల్ లో మేయర్, చైర్మన్ పదవులకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టారు. అయితే ఈ చట్టాన్ని మన రాష్ట్రంలో యథాతథంగా అమలు చేయకపోవడంతో ఆయా పదవుల్లో ఉన్నవారు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదే చట్టాన్ని అమలు చేసిన కేరళ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో పట్టణ సంస్థలకు కమిషనర్ అనే పోస్టు ఉండదని చెబుతున్నారు. బదులుగా మున్సిపల్ మేయర్ లేదా చైర్మన్ కు సహాయంగా సెక్రటరీ మాత్రమే ఉంటారు. దీంతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల మాటే శాసనం అన్నట్లు పాలన సాగుతోందని చెబుతున్నారు.
మన రాష్ట్రంలో కూడా అదేవిధమైన అధికారాలు కల్పించమని చాలాకాలంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం చట్ట సవరణకు ముందుకు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయమై పార్టీలకు అతీతంగా పోరాడుతున్నా ప్రభుత్వం మాత్రం తన విధానాన్ని మార్చుకోకపోవడమే చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం అమలు అవుతున్న చట్టం ప్రకారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్ లకే సర్వాధికారాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో నిధుల ఖర్చు నుంచి పనుల పర్యవేక్షణ వరకు అంతా కమిషనర్ కనుసన్నల్లోనే జరుగుతోందని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీలో ఉన్న మేయర్లకు మాత్రమే గౌరవం దక్కుతుందని, అదే విపక్షంలో ఉన్న మేయర్లు, చైర్మన్లకు కనీస మర్యాద కూడా ఉండటం లేదని చెబుతున్నారు.