మిథున్ రెడ్డికి అరెస్టు ముప్పు.. హైకోర్టులో నిరాశ, పుంగనూరు కేసులో బిగ్ ట్విస్ట్
ఫిర్యాదుదారులు మధుసూదన్ రాయల్, జంపల మోహన్ నాయుడు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర కూడా కోర్టులో వాదనలు వినిపించారు.
రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి అరెస్టు ముప్పు పొంచివుంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారించిన హైకోర్టు అరెస్టును ఆపలేమని తేల్చిచెప్పింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని అంటున్నారు. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం స్పష్టంగా నిరాకరించింది. అయితే, తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఎంపీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను డిసెంబరు 28వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఆదేశాలు జారీ చేశారు.
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడటం, ప్రైవేటు బౌన్సర్‌తో వాహనాన్ని కార్యకర్తలపైకి తోలించడం వంటి తీవ్రమైన ఆరోపణలపై పుంగనూరు టౌన్ పోలీసులు ఈ నెల 16న ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. మదనపల్లె డీఎస్పీతో పాటు మధుసూదన్ రాయల్, జంపల మోహన్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన మొత్తం నాలుగు కేసులను కొట్టివేయాలని కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఒకే ఘటనపై వేర్వేరుగా నాలుగు కేసులు నమోదు చేయడం చెల్లుబాటు కాదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు బనాయించారని పేర్కొన్నారు. హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు పిటిషనర్‌కు వర్తించవని, విచారణ పూర్తయ్యే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.
మరోవైపు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు. పిటిషనర్ పుంగనూరును తన అడ్డాగా భావించి, నామినేషన్ కేంద్రం వద్ద అలజడి సృష్టించే ముందస్తు పథకంతోనే భారీ కాన్వాయ్, అనుచరులతో వచ్చారని తెలిపారు. బౌన్సర్‌ను రెచ్చగొట్టి కారును అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలపైకి నడిపించారని, ఈ దాడుల్లో 30 మందికి పైగా గాయపడ్డారని వివరించారు. ఎంపీపై తీవ్రమైన హత్యాయత్నం కేసులు ఉన్నాయని, దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. క్వాష్ పిటిషన్లలో అరెస్టు రక్షణ కోరడానికి వీల్లేదని, రక్షణ కావాలనుకుంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ద్వారా చట్టపరమైన మార్గాలను చూసుకోవాలని పీపీ స్పష్టం చేశారు.
ఫిర్యాదుదారులు మధుసూదన్ రాయల్, జంపల మోహన్ నాయుడు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర కూడా కోర్టులో వాదనలు వినిపించారు. నామినేషన్ల కేంద్రం వద్దకు వెళ్లడానికి పిటిషనర్ పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు, లేదా కనీసం అభ్యర్థిని బలపరిచే వ్యక్తి కూడా కాదని, అలాంటప్పుడు అంత మందితో నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లడంలోనే ఆయన దురుద్దేశం స్పష్టమవుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిథున్‌రెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున క్వాష్ పిటిషన్లో అరెస్టుపై రక్షణ ఇవ్వకూడదని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎంపీకి ఎలాంటి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను డిసెంబరు 28కి వాయిదా వేసింది.
ఈ పరిణామంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. అయితే హైకోర్టు నిర్ణయాన్ని మిథున్ రెడ్డి సుప్రీంలో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో పోలీసులు అంతవరకు వేచిచూస్తారా? లేక వెంటనే అరెస్టుకు సిద్ధమవుతారా అనేది చూడాల్సివుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు పోలీసులు నిర్ణయం ఉండొచ్చని అంటున్నారు. స్థానిక ఎన్నికల వేళ ఈ పరిణామం విపక్షం వైసీపీని ఆందోళనకు గురిచేస్తోంది. పుంగనూరు మున్సిపాలిటీ ఏకగ్రీవం అయింది. అయితే 5వ తేదీన జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు ఉండటంతో ఎంపీ మిథున్ రెడ్డిను అరెస్టు చేసే అంశమై తర్జనభర్జన జరుగుతోందని అంటున్నారు.