‘రాయచోటి’ ఏం చేసింది.. జిల్లా కేంద్రంగా ఎందుకు తప్పించారు?
కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ‘రాయచోటి’ అంశమే ఎక్కువగా చర్చనీయాంశం అవుతోంది.;
కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ‘రాయచోటి’ అంశమే ఎక్కువగా చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో ఏ ఇద్దరు జిల్లాల విభజన కోసం మాట్లాడుకున్నా, రాయచోటి కోసం ప్రధానంగా చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డితో కన్నీరు పెట్టించిన ‘రాయచోటి’పై ఎందుకింత చర్చ జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జిల్లాల విభజనలో ఎక్కువగా ‘రాయచోటి’ని ప్రస్తావించడం, ఆ పట్టణాభివృద్ధికి పూచీ ఉంటానని హామీ ఇవ్వడం కూడా రాయచోటి ప్రాధాన్యాన్ని పెంచిందని అంటున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా, ఏ జిల్లాలో చేయని విధంగా అన్నమయ్య జిల్లాలో మార్పులు చేయడం, అందులోనూ జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చివేసి మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడమే సర్వత్రా ఆసక్తి కలిగించింది. జిల్లా కేంద్రం మార్పునకు దారి తీసిన పరిణామాలపై ఉత్కంఠ ఎక్కువగా కనిపిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల విభజనలో రాయచోటి కేంద్రంగా కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయగా, పార్లమెంటు నియోజకర్గ కేంద్రాలే జిల్లా కేంద్రాలుగా నిర్ణయించారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం అరకు పార్లమెంటును రెండుగా విభజించడంతోపాటు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఎంపిక చేశారు. ఇదే విధంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా చేసి రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. దీనిపై అప్పట్లోనే పెద్ద వివాదం రేగిందని గుర్తు చేస్తున్నారు.
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని అక్కడి వారు, పెద్ద పట్టణం, రవాణా సౌకర్యాలు వంటి కారణంతో మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని అక్కడి వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే అప్పటి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు అవడంతో రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయగలిగారు. ఈ విషయంలో జిల్లా పరిధిలోని మిగిలిన నేతల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తాజాగా కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను మూడుగా విభజించి మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసి దానికి అన్నమయ్య జిల్లాగా పేరు కొనసాగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాను మూడుగా విభజించి కొన్ని నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయగా, ఇప్పుడు అన్నమయ్య జిల్లాను కూడా మూడుగా విభజించడం కూడా గమనార్హం. అయితే జిల్లా కేంద్రాన్ని మార్చడమే ఎక్కువ వివాదానికి దారితీసిందని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజాభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. వాస్తవానికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి బదులు మదనపల్లె ఉండటమే ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనికి మదనపల్లె నుంచి ఇతర నియోజకవర్గాలకు ఉన్న దూరం, రవాణా సౌకర్యాలను చూపుతోంది.
అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు జిల్లా కేంద్రం రాయచోటికి చాలా దూరంగా ఉన్నాయని చెబుతున్నారు. రాయచోటి నుంచి రాజంపేట 56 కి.మీ. ఉండగా, పీలేరు 55 కి.మీ., తంబళ్లపల్లె 63 కి.మీ, పుంగనూరు 97 కి.మీ., మదనపల్లె 72 కి.మీ. దూరం ఉంటుంది. అదే మదనపల్లె నుంచి ఆయా నియోజకవర్గాలు చాలా దగ్గరగా ఉంటాయని అంటున్నారు. మదనపల్లెకి తంబళ్లపల్లె 30 నుంచి 35 కి.మీ. దూరం ఉండగా, పుంగనూరు కూడా 20-25 కి.మీ మధ్యలోనే ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా పీలేరు సైతం 30 కి.మీ. దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో జిల్లాలోని ఇతర ప్రాంతాలకు మదనపల్లె దగ్గరగా ఉండటం వల్ల ప్రభుత్వం జిల్లా కేంద్రంగా ఆ పట్టణాన్ని ఖరారు చేసిందని అంటున్నారు.
రాయచోటిలో ప్రస్తుతం టీడీపీ శాసనసభ్యుడు, మంత్రి రామప్రసాదరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సౌకర్యం కోసం జిల్లా కేంద్రాన్ని మార్చాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ పరిణామం రాయచోటిలో టీడీపీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశాలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాయచోటిలో టీడీపీ గెలిస్తే, ఆ సీటును త్యాగం చేసేలా తీసుకున్న నిర్ణయమంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాయచోటిలో రాజకీయంగా నష్టం జరగకుండా చూసుకోడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసిందని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు చూసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి రామప్రసాదరెడ్డికి కూడా ఇదే విషయంపై సీఎం భరోసా ఇచ్చారని అంటున్నారు.