దటీజ్ ఎన్టీఅర్ : సొంత నిర్మాణంలో ఒకేసారి మూడు చిత్రాలు

ఈ మూడు సినిమాలలో రెండు పౌరాణికాలు కావడం విశేషం. మధ్యలో మాస్ ఆడియన్స్ కోసం ఒక పక్కా కమర్షియల్ మూవీ ఉండాలనుకుని సోషల్ జానర్ లో ప్లాన్ చేశారు.;

Update: 2026-03-07 17:48 GMT

సీనియర్ ఎన్టీఆర్ ని పని రాక్షసుడు అంటారు. ఆయన పట్టుదల గొప్పది. కఠోర పరిశ్రమ కు మారు పేరు, నిబద్ధతకు అంకిత భావానికి పెట్టింది పేరు. ఆయన మనసులో ఆలోచన తట్టాలే కానీ అమలు చేసి తీరుతారు. దాని కోసం ఆయన రాత్రీ పగలూ తిండీ నిద్ర కూడా మరచి పనిచేస్తారు. అందుకే కేవలం మూడు దశాబ్దాల కాలంలో మూడువందల యాభై దాకా చిత్రాలలో నటించారు. ఈ లెక్కన నెలకు ఒక సినిమాని రిలీజ్ చేసేవారు అన్న మాట.

ఒకే నెలలో మూడు :

ఇదిలా ఉంటే అడవిరాముడు, యమగోల వంటి సూపర్ డూపర్ హిట్స్ తో పాటు దానవీర శూర కర్ణ వంటి భారీ పౌరాణిక చిత్రాన్ని కేవలం 40 రోజుల వ్యవధిలో నిర్మించి అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ సమయంలో మంచి ఊపు మీద ఉన్నారు. దాంతో ఆయన నూతనోత్సాహంతో ఒకేసారి మూడు కొత్త చిత్రాలని నిర్మించి తాను హీరోగా అందులో నటించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఈ చిత్ర నిర్మాళాలకు కసరత్తు మొదలెట్టేశారు.

రెండు పౌరాణికాలు :

ఈ మూడు సినిమాలలో రెండు పౌరాణికాలు కావడం విశేషం. మధ్యలో మాస్ ఆడియన్స్ కోసం ఒక పక్కా కమర్షియల్ మూవీ ఉండాలనుకుని సోషల్ జానర్ లో ప్లాన్ చేశారు. అలా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, శ్రీ మద్విరాటపర్వం వరసగా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రెండు సినిమాల కోసం ఆయన ఏకంగా ఆరు నెలల పాటు ఏపీలో హైదారాబాద్ లో ఉండిపోయారు. ఇక తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో కలియుగ దైవం వెంకటేశ్వరుడిగా నటించారు. శ్రీ మద్విరాటపర్వంలో అయిదు పాత్రలను పోషించారు. ఈ రెండు సినిమాలకు ఆయనే దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం.

రాఘవేంద్రుడు దర్శకత్వంలో :

ఈ నేపధ్యంలోనే ఒక కమర్షియల్ మూవీని తీయాలని కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో డ్రైవర్ రాముడు మూవీని ప్లాన్ చేశారు. ఇలా ఎన్టీఆర్ ఒకే ఏడాది మూడు సినిమాల షూటింగ్ చకచకా పూర్తి చేసి వరసగా రిలీజ్ చేశారు. 1979 ఫిబ్రవరి 2న డ్రైవర్ రాముడు రిలీజ్ చేస్తే బంపర్ హిట్ అయింది. అదే ఏడాది మే 28న ఎన్టీఅర్ బర్త్ డేకి శ్రీమద్విరాటపర్వం రిలీజ్ చేశారు. అది ఒక మాదిరిగా ఆడింది. ఆ ఏడాది సెప్టెంబర్ లో తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం మూవీని రిలీజ్ చేస్తే ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూడు సినిమాల కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ ఆయకకు పాత్రల పట్ల ఉన్న నిబద్ధత ఇవన్నీ ఈ రోజుకీ అంతా చర్చించుకుంటారు.

పౌరాణికాలకు స్వస్తి :

ఇక తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం మూవీ రిజల్ట్ ని చూసిన తరువాత ఎన్టీఅర్ ఒకింత అవేదన చెందారని చెబుతారు. అంతకు ముందు వెంకటేశ్వర కళ్యాణం బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ఆ మూవీలో హీరోగా ఎన్టీఅరే నటిస్తే సూపర్ హిట్ అయింది. మారిన కాలానికి తగినట్లుగా కలర్ తో మంచి టెక్నాలజీతో మూవీని తీస్తే జనాలు పెద్దగా ఆదరించలేదని భావించిన ఎన్టీఆర్ ఇక పౌరాణీకాలు నటించను అని చెప్పేశారు అని ప్రచారంలో ఉంది. మొత్తానికి చూస్తే ఆ తరువాత ఆయన పౌరాణిక సినిమాలు నటించలేదు, అయితే బ్రహ్మార్షి విశ్వామిత్ర మూవీ చేసినా అందులో దేవుడి పాత్రలను వేరే వారితో నటింపచేశారు అన్నది గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News