కరెన్సీ నోట్లకు ఉండే భద్రతా ఫీచర్లు.. పట్టాదారు పుస్తకాలపై సీఎం కీలక ప్రకటన!

2019-24 మధ్య కాలంలో గత పాలకులు చేసిన విధ్వంసం కారణంగా భూ రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Update: 2026-08-10 11:00 GMT

పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పాసుపుస్తకాలను ట్యాంపర్ చేయకుండా పటిష్టమైన భద్రతా ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో నిర్వహించిన 'మీ భూమి- మీ హక్కు' పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో గత ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఇష్టంలేని వ్యక్తుల భూములను నిషేధిత జాబితాలో చేర్చేలా 22ఏ కింద నమోదు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా 'మీ భూమి- మీ హక్కు' ఇతరులు పెత్తనం ఎందుకు? ప్రభుత్వాలు మారినప్పుడు పాస్ పుస్తకాలపై ఇతరుల ఫోటోలు వేసుకోవడం సరికాదు’’ అంటూ తేల్చిచెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ వేగంతో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తోందని సీఎం తెలిపారు.

2019-24 మధ్య కాలంలో గత పాలకులు చేసిన విధ్వంసం కారణంగా భూ రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టం లేని వ్యక్తుల భూములను, ఆస్తులను డిజిటల్‌గా 22ఏ జాబితాలో పెట్టేసి వివాదాస్పదం చేశారని విమర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఇచ్చిన భూమిని సౌతం 22ఏలో పెట్టగా, ప్రస్తుతం దానిని పరిష్కరించి పట్టాలు అందించామని వెల్లడించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి భారీ ఎత్తున భూ ఫిర్యాదులు అందాయని సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలోనే వీటన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించాలని నిశ్చయించుకున్నామని, అంశాల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా 151 సీట్లు వచ్చిన వ్యక్తులు ఏమయ్యారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత పాలకులు బటన్ నొక్కడం, పరదాల చాటున తిరగడం, సభలు పెట్టి చెట్లు నరికేయడం వంటి పనులు మాత్రమే చేశారని విమర్శించారు. కానీ తాము ప్రతీ నెలా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి సమావేశాల ద్వారా ప్రజలను కలుస్తున్నామని స్పష్టం చేశారు.

అధునాతన భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకాలు

కరెన్సీ నోట్లకు ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలు ఎవరూ ట్యాంపర్ చేయకుండా పకడ్బందీ భద్రత కల్పించామన్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక పరమైన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు అందించామని సీఎం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి మొత్తం 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటివరకు 41 వేల ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తప్పించి, 1.47 లక్షల మందికి పైగా రైతులకు పట్టాలు ఇచ్చామన్నారు.

ప్రత్యేకించి ఏలూరు జిల్లాలోనే 5,500 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పట్టాలు అందజేసినట్లు చెప్పారు. ప్రతీ రైతుకు, భూ యజమానికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందే వరకు విశ్రమించేది లేదన్నారు. భూమి తమదైనా వేర్వేరు ఇబ్బందులతో ఇప్పటివరకు రైతులు, భూ యజమానులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1986 నుంచి రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, లింక్ డాక్యుమెంట్లన్నీ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే 9 లక్షల మందికి ఆటో మ్యూటేషన్ సౌకర్యం కల్పించామన్నారు. వారసత్వ భూములకు సంబంధించి రూ.10 లక్షల లోపు విలువ ఉన్న వాటిని కేవలం రూ.100 నామమాత్రపు రుసుముతో బదిలీ చేసుకునేందుకు అద్భుతమైన అవకాశం కల్పించామని గుర్తుచేశారు.

రైతుల సమక్షంలోనే రీసర్వే ప్రక్రియ నిర్వహించి, ఈ-కేవైసీ తీసుకున్న తర్వాతే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ సభలు నిర్వహించి అత్యంత పారదర్శకంగా ఈ పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ఉద్దేశమని, దీనివల్ల వివాదాలు తగ్గి లావాదేవీలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సుపరిపాలన అందిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగవంతం చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానించి ప్రజలకు అత్యంత సులభంగా పౌరసేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు.

Tags:    

Similar News