కూటమిలో ఒంగోలు యుద్ధం.. ఎమ్మెల్యే దామచర్ల Vs జనసేన నేత బాలినేని!

ప్రకాశం జిల్లాలో కూటమి రాజకీయాలు కాకరేపుతున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్దం హీట్ పుట్టిస్తోంది.

Update: 2026-08-10 10:09 GMT

ప్రకాశం జిల్లాలో కూటమి రాజకీయాలు కాకరేపుతున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్దం హీట్ పుట్టిస్తోంది. గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై సంచలనానికి తెరలేపారు. ఇక తనపై చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని జనసేనలో ఉంటూ వైసీపీకి పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇరువురు నేతలు కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి మాటలతో పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ధర్మం వల్ల తాను ఇంతకాలం మాట్లాడలేదని కానీ ఇప్పుడు తన అనుచరులపై కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఒంగోలులో భూకబ్జాలు తారాస్థాయికి చేరాయని ఆరోపించడమే కాకుండా, ఎమ్మెల్యేకు నెలనెలా మామూళ్లు అందుతున్నాయని మాజీ మంత్రి చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం జనసేనకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం తీవ్రచర్చనీయాంశం అవుతోంది.

ఇక తనపై బాలినేని చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్యే దామచర్ల అంతేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. జనసేనలో ఉంటూ ఆయన వైసీపీకి పనిచేస్తున్నారని ఎదురుదాడి చేశారు. అంతేకాకుండా బాలినేని, ఆయన కుమారుడుపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. బాలినేని అనుచరులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కరపత్రాలు వేశారని, విజయవాడ నుంచి పోస్టు చేయడం సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, అందుకే పోలీసులు కేసులు నమోదు చేశారని వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంలో బాలినేని చేసిన అవినీతి, అక్రమాలు రాసేందుకు పుస్తకాలు సరిపోవని వ్యాఖ్యానించారు.

ఇలా ఇరువురు నేతలు పరస్పరం మాటల దాడి చేసుకుంటూ రోడ్డెక్కడం కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో బాలినేనిపై సుమారు 35 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గెలిచారు. ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే బాలినేని జనసేనలో చేరారు. అప్పట్లోనే బాలినేని జనసేనలో చేరికను దామచర్ల వ్యతిరేకించినా ఇరుపార్టీల అధిష్టాన వర్గాలు జోక్యంతో వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి ఒంగోలు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలినేని ఇప్పుడు ఆకస్మికంగా ఎమ్మెల్యేపై ప్రత్యక్ష విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు కూటమి నేత బయటపెట్టినట్లైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోందని అంటున్నారు. కూటమి ఎమ్మెల్యేపై కూటమి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రతిపక్షానికి అస్త్రాలు అందించినట్లైందని అంటున్నారు. దీనిపై కూటమి పెద్దలు ఎలా స్పందిస్తారనే అంశం ఉత్కంఠకు గురిచేస్తోందని అంటున్నారు. నిజానికి కూటమిలో సమస్యలు ఏమైనా ఉంటే ఇరుపార్టీలు సంయమనంతో చర్చించుకుని పరిష్కరించుకుంటున్నట్లు చెబుతున్నాయి. కానీ, ఒంగోలులో మాత్రం నేతలు రోడ్డెక్కడం చూస్తే సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మాజీ మంత్రి బాలినేనికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనసేన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉందని, కానీ ఆయన ఆ పనిచేయకుండా ఎమ్మెల్యేను బజారుకీడ్చేలా మాట్లాడటమే అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. మొత్తానికి ఒంగోలులో మొదలైన ఈ తుఫాన్ ఎక్కడి వరకు దారితీస్తుందనేది ఉత్కంఠ రేపుతోందని చెబుతున్నారు.

Tags:    

Similar News