రోజుకు రూ.8,337 కోట్లా? ఎలాన్ మావా.. మాకు కాస్త 'చిల్లర' ఇవ్వొచ్చుగా!
సరే ఇప్పుడు మన "గ్రహాంతరవాసి" ఎలాన్ మస్క్ మావ రోజువారీ సంపాదన వింటే మీకు మైండ్ బ్లాంక్ అవ్వడమే కాదు... మీ ఉద్యోగానికి, ఆ జీతానికి దండం పెట్టేయాలనిపిస్తుంది!
మీరు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని.. ఒక కప్పు టీ తాగి ఆ టీ గ్లాసు కింద పెట్టేలోపు మీరు ఎంత సంపాదిస్తారు? పోనీ నెలంతా ఆఫీస్‌లో ఒళ్లు హూనం చేసుకుంటే వచ్చే జీతం ఎంత? రూ.30 వేలా? రూ.50 వేలా? లక్ష మహాప్రభో అనుకుంటే ఒక లక్ష రూపాయలా? సరే ఇప్పుడు మన "గ్రహాంతరవాసి" ఎలాన్ మస్క్ మావ రోజువారీ సంపాదన వింటే మీకు మైండ్ బ్లాంక్ అవ్వడమే కాదు... మీ ఉద్యోగానికి, ఆ జీతానికి దండం పెట్టేయాలనిపిస్తుంది!
బెస్ట్ బ్రోకర్స్ వాళ్లు తీసిన తాజా లెక్కల ప్రకారం.. మన మస్క్ భయ్యా 2025 జులై నుంచి 2026 జులై మధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఎంతో తెలుసా? ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు.. అంటే రోజుకు సగటున ఆయన ఖాతాలో సారీ, ఆయన ఆస్తి విలువలో చేరింది అక్షరాలా 875 మిలియన్ డాలర్లు.. మన భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే... రోజుకు సుమారు రూ.8,337 కోట్లు.
ఒక్క రోజులో రూ.8,337 కోట్లా? అరెరే... మనం బ్యాంక్ యాప్‌లో కరెంట్ బ్యాలెన్స్ చూసుకుని 'ఈ నెల గడిస్తే చాలు రా దేవుడా' అని దండం పెట్టుకుంటుంటే మస్క్ మావా మాత్రం ప్రతిరోజూ ఒక చిన్న సైజు దేశపు బడ్జెట్ అంత మొత్తాన్ని తన ఆస్తి ఖాతాలో వేసేసుకుంటున్నాడు.
ఆగండాగండి... అంత ఆవేశపడకండి
"అంత డబ్బు చేతికొస్తే ఏం కొనుక్కోవాలి రా సామీ?" అని మీరు కంగారుపడిపోకండి. ఇది ఆయనకు నెల నెలా ఇచ్చే 'కవర్ జీతం' కాదు సుమా.. టెస్లా, స్పేస్‌ఎక్స్, 'ఎక్స్' కంపెనీల షేర్ల విలువ రాకెట్ కంటే వేగంగా పైకి లేవడం వల్ల పెరిగిన నికర సంపద లెక్క ఇది. అంటే కాగితాల మీద సంపద అన్నమాట. అలాగని ఆయన దగ్గర డబ్బుల్లేవని జాలిపడిపోకండి... ఆయన అనుకుంటే ఒక చిన్న దేశాన్ని కొని దానికి ' ఎక్స్ ల్యాండ్' అని పేరు పెట్టేయగలడు!
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న డెల్ టెక్నాలజీస్ మైఖెల్ డెల్ పాపం రోజుకు కేవలం 295 మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించగలిగారు. "అయ్యో పాపం డెల్ గారూ.. మస్క్ మావాతో పోలిస్తే మీదేం సంపాదన అండీ?" అని మనం జాలిపడదాం అనుకుంటే... అది కూడా రోజుకు వేల కోట్ల రూపాయల కిందకే వస్తుంది.
మనం మాత్రం పొద్దున్నే లేచి ట్రాఫిక్‌లో నలిగిపోతూ బాస్ తిట్లు తింటూ.. జీతం పడగానే ఇఎంఐలు కట్టేసి... "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మా ఉద్యోగాలు పోతాయా బాస్?" అని గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటున్నాం. అక్కడ మస్క్ ఏమో ఏఐ, రాకెట్లు, ఎలక్ట్రిక్ కార్లు అంటూ రోజూ వేల కోట్లు వెనకేస్తున్నాడు.
ఏదేమైనా మస్క్ మావా... నువ్వు మార్స్ మీదికి మనుషుల్ని తీసుకెళ్తావో లేదో తర్వాత సంగతి కానీ ముందు ఈ భూమి మీద ఉన్న మా లాంటి మధ్యతరగతి జనాలు నీ ఆస్తి లెక్కలు చూసి హార్ట్ ఎటాక్‌తో పోకుండా కాస్త చూడు తండ్రీ..