బీజేపీ తగ్గినట్లే ..అయినా తగ్గమంటూ రాహుల్ !

మొత్తానికి చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దాదాపుగా పూర్తి కావచ్చిన దశలో కేంద్ర ప్రభుత్వం చర్చకు రెడీ అంటోంది. ప్రతిపక్షాలు ఏ విషయం అడిగినా దాని మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Update: 2026-08-10 18:17 GMT

మొత్తానికి చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దాదాపుగా పూర్తి కావచ్చిన దశలో కేంద్ర ప్రభుత్వం చర్చకు రెడీ అంటోంది. ప్రతిపక్షాలు ఏ విషయం అడిగినా దాని మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీని మీద ఏకంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

అమిత్ షా రెడీ అంటూ :

అంతే కాదు పార్లమెంట్ లో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి స్పందించేందుకు హోం మంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని కూడ ఆయన చెప్పారు. దయచేసి ప్రతిపక్షాలు సభకు రావాలని ఆయన కోరారు. అంతే కాదు విపక్షం సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ఆయన గట్టిగా కోరారు. సభ సజావుగా సాగకుండా గందరగోళంతో వాయిదాలు పడుతున్న నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం కిరణ్ రిజిజు ఈ విషయం చెప్పడం విశేషం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అందువల్ల్ సభా కార్యక్రమాలు సాఫీగా జరిగేందుకు వీలుగా బిజినెస్ అంతా సజావుగా పనిచేసేందుకు అనుమతించాలని కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడలేదని కేంద్ర మంత్రి చెప్పడం విశేషం.

కీలక బిల్లులు పెండింగ్ :

దాదాపుగా ప్రతీ రోజూ పార్లమెంట్ ఉభయ సభలూ వాయిదా పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సభలో చర్చించాల్సిన అనేక అంశాలు అలాగే ఉన్నాయి. అంతే కాదు అనేక కీలక బిల్లులు కూడా సభలో చర్చకు కానీ ప్రవేశానికి కానీ నోచుకోవడం లేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా సభను ఎలాగైనా సాఫీగా నడపాలని ఆలోచిస్తోంది. దాని కోసం విపక్షాల డిమాండ్లకు అంగీకరిస్తూ కేంద్ర మంత్రి ముందుకు రావడం గమనార్హం.

అమిత్ షా ఒప్పుకోవాలి :

ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ప్రకటన చేస్తారు అన్న కిరణ్ రిజిజు వ్యాఖ్యల మీద రాహుల్ ఫైర్ అయ్యారు. తాము కోరుతోంది వేరు అన్నారు. తాము ముఖ్యంగా మూడు అంశాలపై చర్చ జరగాలని పట్టుబడుతున్నట్లుగా రాహుల్ గాంధీ అంటున్నారు. సభకు అమిత్ షా వచ్చి చేసే మామూలు ప్రసంగాల మీద తమకు ఆసక్తి లేదని అన్నారు. అందుకే తాము కోరుతున్నట్లుగా అమిత్ షా మాట్లాడాలని ఆయన కోరారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్‌గన్స్ ప్రయోగానికి ఎవరు ఆదేశించారన్నదానిపై అమిత్ షా స్పష్టమైన ప్రకటన చేసేందుకు ముందుకు రావాలని రాహుల్ కోరారు. అలాగే విద్యార్థులపై కాల్పులకు హోంమంత్రిగా అదేశించింది అమిత్ లేక వేరే వ్యక్తా అన్నది కూడా తేలాలని అన్నారు. హోం మంత్రి అయితే బాధ్యత వహించాలని మరో వ్యక్తి అయితే అసమర్ధత అంగీకరించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఆ ఇద్దరూ ఎక్కడ అంటూ :

ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలై పదిహేను రోజులు గడుస్తూంటే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రి అమిత్ షాలు సభకు ఎందుకు రావడం లేదని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. సభకు వచ్చే ధైర్యం వారికి లేదా అని ప్రశ్నించారు. మరో వైపు అయోధ్యలో రామాలయం నిధుల అవకతవకలపై కూడా సభలో చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. విపక్షంగా పేపర్ లీక్ అంశంతో పాటు అయోధ్యలో దోపిడీపై ప్రశ్నించడం తప్పెలా అవుతుందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఇవన్నీ చూస్తూంటే ఈ సమావేశాలు సజావుగా మిగిలిన రోజులలో అయినా జరుగుతాయా అన్నది మాత్రం తెలియడం లేదని అంటున్నారు.

Tags:    

Similar News