విడదీయరాని బంధం: ఆధార్ బయోమెట్రిక్ వ్య‌వ‌స్థ‌కు కవలలు బిగ్ షాక్

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన కవల సోదరీమణులు ఖిజ్రా జుబైర్, తుబా జుబైర్ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Update: 2026-09-26 09:40 GMT

మానవ శరీర నిర్మాణం, అందునా జన్మతః ఒకే పోలికలతో జన్మించే కవలల మధ్య ఉండే పోలికలు కొన్నిసార్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికే స‌వాల్ విసురుతుంటాయి. సాధారణంగా వేలిముద్రలు, కంటిలోని ఐరిస్ (రేటినా) నమూనాలు మ‌నిషి మనిషికీ విభిన్నంగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో జన్యుపరమైన అతి దగ్గరి పోలికల కారణంగా ఈ బయోమెట్రిక్ లక్షణాలు కూడా ఒకేలా పునరావృతమవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన ఘటనే దేశంలోని డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ముందు ఒక పెద్ద సవాల్‌ను విసిరింది.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన కవల సోదరీమణులు ఖిజ్రా జుబైర్, తుబా జుబైర్ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్నతనంలో వీరికి సాధారణ పద్ధతిలో ఆధార్ కార్డులు జారీ అయినా పెద్దయ్యాక పదవ తరగతి బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ సమయంలో బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక సోదరి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ విజయవంతంగా నమోదు కాగా.. రెండో సోదరి వివరాలు నమోదు చేసే సమయానికి ఆధార్ సిస్టమ్ గందరగోళానికి గురైంది.

రెండో అమ్మాయి బయోమెట్రిక్ వివరాలు మొదటి వ్యక్తితో పూర్తిగా మ్యాచ్ కావడంతో ఆధార్ సాఫ్ట్‌వేర్ దీనిని డూప్లికేట్ ఎంట్రీగా లేదా ఒకే వ్యక్తి చేసిన ప్రయత్నంగా పరిగణించింది. దీనివల్ల రెండో సోదరికి వేర్వేరుగా ప్రత్యేక ఆధార్ కార్డు జారీ కాకుండా సిస్టమ్ ఆటోమేటిక్‌గా తిరస్కరించింది. వేలిముద్రలు , కంటి పొరలు ఒకేలా ఉండటంతో అధునాతన బయోమెట్రిక్ యంత్రాలు సైతం విఫలమయ్యాయి. విద్యా సంవత్సరం మారుతున్న తరుణంలో గుర్తింపు పత్రం అందకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

ఈ సాంకేతిక చిక్కుముడిని విప్పేందుకు స్థానిక జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితుల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు జిల్లా అధికారులు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉన్నతాధికారులను సంప్రదించారు. ఢిల్లీ, లక్నో హెడ్‌క్వార్టర్స్‌లోని నిపుణులతో ప్రత్యేకంగా సమన్వయం చేసుకుంటూ.. సాంకేతిక లోపాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.

అధికారుల సుదీర్ఘ శ్రమ , ప్రత్యేక మాన్యువ‌ల్ వెరిఫికేష‌న్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. బయోమెట్రిక్ గందరగోళాన్ని అధిగమించి, ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ కవల సోదరీమణులకు వేర్వేరుగా ఆధార్ కార్డులను జారీ చేశారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్నిసార్లు తలెత్తే ఇలాంటి అరుదైన సవాళ్లను ఎదుర్కోవడంలో సమర్థవంతమైన పాలనా యంత్రాంగం, ప్రత్యేక సాంకేతిక సవరణలు ఎంత అవసరమో ఈ ఘటన చాటిచెప్పింది.

ప్ర‌పంచ దేశాల‌లో క‌వ‌ల‌ల విష‌యంలో రిపీట్:

ఆధార్, బ‌యోమెట్రిక్ వ్య‌వ‌స్థ‌కు ఇబ్బందిక‌రంగా మారిన క‌వ‌ల‌లు ఇంకా ఎవ‌రైనా ప్ర‌పంచంలో ఉన్నారా? ఏఏ దేశాల‌లో ఇలాంటి స‌మ‌స్య రిపీటైందో ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి..

ప్రపంచవ్యాప్తంగా కవలల జన్యుపరమైన అతి దగ్గరి పోలికలు డిజిటల్ గుర్తింపు వ్యవస్థలకు, బయోమెట్రిక్ భద్రతా యంత్రాలకు పెద్ద సవాల్‌గా మారుతుంటాయి. అమెరికా, యూకే వంటి దేశాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉపయోగించే ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ స్కానింగ్ గేట్లు కవలల విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతుంటాయి. ఒకరి పాస్‌పోర్ట్‌తో మరొకరు బోర్డింగ్ గేట్లు దాటేందుకు ప్రయత్నించినప్పుడు సిస్టమ్ వారిని ఒకే వ్యక్తిగా గుర్తించి పొరపాటు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

అలాగే, చైనా వంటి దేశాల్లో నిఘా కెమెరాలు, స్మార్ట్ అటెండెన్స్ -నేషనల్ ఐడీ డేటాబేస్‌లలోనూ కవలల ముఖ కవళికలు, వేలిముద్రలు సరిపోలడంతో ఆధునిక ఏఐ అల్గారిథమ్‌లు విఫలమైన ఉదంతాలున్నాయి. గల్ఫ్ దేశాల్లో వీసా - బయోమెట్రిక్ తనిఖీల సమయంలోనూ ఇలాంటి సాంకేతిక లోపాలు వెలుగుచూశాయి. శాస్త్రీయంగా కవలల వేలిముద్రలు, ఐరిస్ నమూనాలలో సూక్ష్మమైన తేడాలు ఉన్నా.. సాధారణ కమర్షియల్ స్కానర్లు వాటిని గుర్తించలేక డూప్లికేట్ ఎంట్రీలుగా భావించి తిరస్కరిస్తాయి.

Tags:    

Similar News