ఇదెక్కడి మ్యాజిక్?.. కవల సోదరీమణుల జీవితంలో డబుల్ సర్ప్రైజ్!

కేరళలోని కొట్టాయంకు చెందిన ఆతిర, ఆర్య కవల సోదరీమణులు. 1997 నవంబర్ 17న జన్మించిన వీరు చిన్నప్పటి నుంచి ప్రతిదీ పంచుకుంటూ పెరిగారు.

Update: 2026-09-26 11:19 GMT

కేరళకు చెందిన కవల సోదరీమణులు ఆతిర, ఆర్య తమ జీవితంలో జరిగిన ఒక అరుదైన, అద్భుతమైన కాకతాళీయ సంఘటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. పుట్టినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఒకేలా అడుగులు వేసిన వీరు, ఏకంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా.. వేర్వేరు దేశాల్లో ఉంటూ కూడా సరిగ్గా ఒకే రోజున ఆడపిల్లలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అద్భుతమైన బంధం వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు చూస్తే ఎవరైనా వావ అనాల్సిందే..

ఒకే రోజు పుట్టుక.. ఒకే వృత్తి:

కేరళలోని కొట్టాయంకు చెందిన ఆతిర, ఆర్య కవల సోదరీమణులు. 1997 నవంబర్ 17న జన్మించిన వీరు చిన్నప్పటి నుంచి ప్రతిదీ పంచుకుంటూ పెరిగారు. చదువులోనూ పోటీపడి మరీ నర్సింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ అపోలో హాస్పిటల్‌లో కొన్నాళ్లపాటు కలిసి నర్సులుగా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించి మంచి అనుభవం సంపాదించుకున్నారు.

ఒకే వేదికపై పెళ్లి బంధం:

వృత్తిరీత్యా ఒక్కటే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ఈ ఇద్దరూ తమ అనుబంధాన్ని వీడలేదు. 2022 ఏప్రిల్ 17న ఒకే వేదికపై, ఒకే ముహూర్తాన ఈ కవలలు జంటగా వివాహం చేసుకున్నారు. ఆతిర అఖిలేష్‌ను వివాహం చేసుకోగా, ఆర్య చిరన్‌తో ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత భర్తలతో కలిసి విదేశాలకు వెళ్లిన వీరు.. ఆతిర ఖతార్‌లో, ఆర్య ఒమన్‌లో నర్సులుగా స్థిరపడి తమ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

వేర్వేరు దేశాలు.. ఒకే రోజు ప్రసవం :

ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నప్పటికీ, వీరి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన మానసిక అనుబంధం మళ్లీ రుజువైంది. విభిన్న దేశాలలో నివసిస్తున్నప్పటికీ, 2026 ఆగస్టు 9న కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరూ పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఒకే రోజు తల్లులుగా మారిన ఈ వార్త విని బంధువులు సైతం ఆశ్చర్యపోయారు. ఇటీవల తమ సొంతూరైన కేరళలోని కొట్టాయం చేరుకుని, తమ పిల్లలకు సాంప్రదాయబద్ధంగా ఒకే రోజు 'నూలుకెట్టు' (బారసాల) వేడుకను ఘనంగా నిర్వహించారు.

పుట్టినప్పటి నుంచి వివాహం, ఉద్యోగం, చివరకు పిల్లలను కనే వరకు ప్రతి మైలురాయిని ఒకేలా పంచుకున్న ఈ కవలల అరుదైన బంధం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సైన్స్‌కు కూడా అంతుచిక్కని ఈ మ్యాజికల్ బాండింగ్ చూస్తున్నవారికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుండగా, ఈ కవల సోదరీమణులకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News