ఎన్డీయేలో జ్ఞానేష్ చిచ్చు.. మోడీ ఏం చేస్తారు?

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ చుట్టూ ముసురుకున్న వివాదం ప్రస్తుత కేంద్ర అధికార కూటమి ఎన్డీయేలో తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2026-09-26 09:48 GMT

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ చుట్టూ ముసురుకున్న వివాదం ప్రస్తుత కేంద్ర అధికార కూటమి ఎన్డీయేలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (స‌ర్‌) ప్రక్రియ, అలాగే ఎన్నికల సంఘం అంతర్గత విభేదాలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో పొలిటిక‌ల్‌గా జ్ఞానేష్ కుమార్ చుట్టూ వివాదం ముసురుకుంది. ఈ వివాదానికి సంబంధించిన అంశాల‌పై కేంద్రం మౌనంగా ఉండ‌గా.. విప‌క్షాల‌తో పాటు..కాక్రోచ్ జ‌నతా పార్టీ వంటి సంస్థ‌లు కూడా ఆందోళ‌న‌కు పిలుపునిచ్చాయి.

మ‌రోవైపు.. ఓ న్యాయ‌వాది సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసి.. అస‌లు జ్క్షానేష్‌ను అరెస్టు చేసి విచారించాల‌ని కోర‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఇదిలావుంటే.. దేశ‌వ్యాప్తంగా స‌మ్మెకు కాంగ్రెస్ ఇప్ప‌టికే దిగింది. శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టింది. అలానే.. సోమ‌వారం నుంచి నిర‌వ‌ధికంగా నిర‌స‌న‌లు కొన‌సాగించ‌నున్న‌ది. అదేస‌మ‌యంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు దిగి.. జ్ఞానేష్ రాజీనామాకు డిమాండ్ చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఇక‌, ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ప్ర‌ధాని మోడీ సార‌థ్యంలోని ఎన్డీయే కూట‌మిలోని కొన్ని పార్టీలు.. ఇప్పుడు ఈ విష‌యంపై కేంద్రాన్ని నిల‌దీస్తున్నాయి. సాధార‌ణంగా ఎప్పుడూ.. మోడీని స‌మ‌ర్థించే ఎన్డీయే ప‌క్షాలు.. ఈ విష‌యానికి వ‌చ్చే స‌రికి క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయాల‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రం స‌మాధానం చెప్పాలంటూ.. నిల‌దీసే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ వ్య‌వ‌హారాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొడుతున్నప్పటికీ, ఈసారి ఎన్డీయేలోని కీలక భాగస్వామ్య పక్షాలే ఈసీ పనితీరుపై నోరు విప్పడం విశేషం.

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచాయి. ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చిన క‌థ‌నంపై బహిరంగ వివరణ ఇవ్వాలని ప‌ట్టుబ‌డుతున్నాయి. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిపోకుండా ఉండాలంటే, సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రజల్లో ఉన్న అనుమానాలను, అపోహలను నివృత్తి చేయాలని ఎన్డీయే కూట‌మి పార్టీలు డిమాండ్ చేశాయి.

ఓటర్ల జాబితా సవరణ, కొన్ని కీలక ఫారంల‌ మార్పులపై మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వారిని ప‌ట్టించుకోకుండా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. ముఖ్యంగా స‌ర్ ప్ర‌క్రియపై క‌మిష‌న్‌లోనే ఏకాభిప్రాయం స‌న్న‌గిల్లింద‌ని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక‌, ఇప్పుడు ఎన్డీయే ప‌క్షాలు కూడా గ‌ళం ఎత్త‌డంతో జ్ఞానేష్ కుమార్ విష‌యంపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News