జీవిత ఖైదీ పెళ్లి కోసం 12 గంటల పెరోల్.. సినిమాను మించిన రియల్ స్టోరీ
వెండి తెరపై మనం చూసే సినిమాలు, కొన్ని సీన్స్ నేచురాలిటీకి చాలా దూరంగా ఉంటాయి.
వెండి తెరపై మనం చూసే సినిమాలు, కొన్ని సీన్స్ నేచురాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. అసలు నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అనుకునే విధంగా చాలా సీన్స్, కథలు ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు పూర్తిగా నిజ జీవితంలోంచి తీసుకున్న కథలతో రూపొందుతాయి. అయితే కొన్ని సార్లు నిజ జీవితంలో ఎదురు అయ్యే సంఘటలు చూస్తే నిజంగా ఇది జరిగిందా లేదంటే సినిమా స్టోరీనా అనిపించక మానదు. తాజాగా హర్యానాలో జరిగిన ఒక పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా ఇలాంటి సంఘటలు జరుగుతాయా అంటూ చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. అంతే కాకుండా ఇది సినిమాను మించిన రియల్ స్టోరీ అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన పెళ్లికి సంబంధించిన వివరాలు మనమూ తెలుసుకుందాం రండీ.
యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ...
హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బద్లీక అనే ప్రాంతానికి చెందిన మైన్‌పాల్ ఢీల్లా పలు హత్యలు, నేరాలు చేసి సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నాడు. అతడిని పోలీసులు ఇటీవల 12 గంటలు పెరోల్ పై బయటకు తీసుకు వచ్చి, పెళ్లి చేసి వారే జైలుకు తీసుకు వెళ్లారు. సాధారణంగా పెరోల్ పై జైల్లో ఉన్న ఖైదీలు బయటకు వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. పెరోల్ పై ఉన్న ఖైదీలు చిన్న నేరం చేసినా కూడా ఆ పెరోల్ ను రద్దు చేసి వెంటనే జైల్లో వేయడం జరుగుతుంది. అయితే ఢీల్లా కు పెరోల్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతడు కోర్ట్ కు వెళ్లి పెళ్లి చేసుకోవడం కోసం, తన నలుగురు పిల్లల జీవితం కోసం అంటూ విజ్ఞప్తి చేయడంతో పెరోల్ లభించింది. అయితే రోజుల కొద్ది కాకుండా కేవలం 12 గంటలు మాత్రమే పెరోల్ ఇవ్వాలని కోర్ట్ కి పోలీసు శాఖ విజ్ఞప్తి చేయడంతో అతడు బయటకు వచ్చాడు.
కోర్ట్‌లో దోషిగా తేలడంతో శిక్ష...
ఢీల్లా పై గతంలో 22 కేసులు నమోదు అయ్యాయి. 2010లోనే అతడు దోషిగా తేలడంతో కోర్ట్ అతడికి జీవిత ఖైదు విధించడం జరిగింది. జీవిత ఖైదుగా ఉన్న ఢీల్లా 2018లో పెరోల్ పై బయటకు వచ్చాడు. పోలీసులకు ప్రతి రోజు కనిపించే కండీషన్ తో బయటకు వచ్చాడు. మెల్ల మెల్లగా తన ఐడీని మార్చుకుని ఏకంగా కంబోడియాకు వెళ్లి పోయాడు. పోలీసులు అతడి ఆచూకి కోసం చాలా ప్రయత్నించారు. దాదాపు ఏడాది పాటు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ పోలీసులు ఢీల్లా ను వెతికారు. అయినా కూడా అతడి ఆచూకి లభించలేదు. ఈ సమయంలో అతడు కంబోడియాలో వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు. అంతే కాకుండా అక్కడే ఒక మహిళతో సహజీవనం సాగించాడు. ఏడాదికి ఒకరు చొప్పున ఏకంగా నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడు. సహజీవనంలోనే నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన ఢీల్లా గతం గురించి కంబోడియా పోలీసులకు తెలిసింది.
పోలీసుల అనుమతితో పెళ్లికి బయటకు...
కంబోడియా పోలీసులు నుంచి హర్యానా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే హర్యానా పోలీసులకు కంబోడియా పోలీసులు ఢీల్లా ను అప్పగించడం జరిగింది. ఇటీవలే ఢీల్లా ను జైల్లో వేశారు. అయితే తన వల్ల నలుగురు పిల్లలకు తల్లి అయిన మహిళకు అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో, తన ఆస్తుల్లో వాటా వచ్చే విధంగా ఆమెకు చట్టబద్దమైన అర్హత కల్పించే ఉద్దేశంతో ఢీల్లా ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఆమె పిల్లలను తన పిల్లలుగా మార్చుకోవాలి అంటే ఆమెను వివాహం చేసుకోవాల్సి ఉంది. దాంతో ఆమెతో వివాహంకు జైల్లో ఉండే కోర్ట్‌లో అభ్యర్థన పెట్టుకున్నాడు.
ఢీల్లా తరపు న్యాయవాదులు కాస్త గట్టిగా వాదించడంతో పెరోల్‌కి అనుమతి లభించింది. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేవలం 12 గంటలు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో అతడు జైలుకు సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్‌లో వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఢీల్లా జైలుకు వెళ్లాడు. జీవిత ఖైదుగా ఉన్న ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆ మహిళ ఎవరో అంటూ చాలా మంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నలుగురు పిల్లలు ఉన్న కారణంగా అతడు జైల్లో ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకుందని స్థానికులు మాట్లాడుతున్నారు.