దేశం దాటిన రావణ్ కేసు.. పోలీస్ కస్టడీలో కీలక ఆధారాలు!
దీంతో ఈ కేసు మరింత మందికి చుట్టుకునే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా విదేశాల నుంచి ఫండింగు చేసిందెవరు అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉపా చట్టం కింద అరెస్టు అయిన రావణ్ ను గన్నవరం పోలీసులు వారం రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రశ్న రావణ్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా రావణ్ యూట్యూబ్ చానల్ నిర్వహణకు విదేశాల నుంచి ఫండ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. దీంతో ఈ కేసు మరింత మందికి చుట్టుకునే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా విదేశాల నుంచి ఫండింగు చేసిందెవరు అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ప్రశ్న చానల్ నిర్వహిస్తూ సమాజంలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయడంతోపాటు నక్సలిజాన్ని ప్రోత్సహించేలా వీడియోలు చేస్తున్నారని పోలీసులు రావణ్ ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత జులైలో రావణ్ ను ఉపా చట్టం కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేసినట్లు చెబుతున్నారు. రావణ్ తో సంబంధాలు ఉన్నాయని అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేతను విచారించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వాటిని నిర్ధారించుకునేందుకు వారం రోజుల కస్టడీకి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ వారం రోజుల్లో రావణ్ కు సంబంధించి అనే అంశాలపై పోలీసులు ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు. ప్రధానంగా అతడి బ్యాంకు అకౌంట్లు పరిశీలించగా, విదేశీ లావాదేవీలు ఉండటాన్ని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.
కేవలం యూట్యూబ్ వీడియోలు చేసే రావణ్ బ్యాంకు ఖాతాకు విదేశీ అకౌంట్ల నుంచి నగదు జమ చేయడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలతో ఆయన చేతులు కలిపాడా? లేక రాజకీయంగా ఒక వర్గంపై బురద జల్లేందుకు మరో వర్గం వారు విదేశీ ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేశారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. విదేశీ ఖాతాల నుంచి వచ్చిన డబ్బుతో రావణ్ ఏం చేశాడన్నది తెలియడం లేదని అంటున్నారు. ఈ విషయంలో అతడు మౌనంగా ఉండిపోయినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం రావణ్ విదేశీ నగదును సొంతంగా డ్రా చేశాడా? లేక ఇంకొకరికి బదిలీ చేశాడా? అన్నది తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక విదేశాల నుంచి వచ్చిక అకౌంట్ల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఏ ఉద్దేశంతో రావణ్ అకౌంటుకు డబ్బు జమ చేసింది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ విషయంలో దర్యాప్తు సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రపోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసు ఇక ముందుకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక విద్రోహ కోణంగా తేలితే రావణ్ మరిన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం విదేశీ ఖాతాల నుంచి లావాదేవీలను గుర్తించిన పోలీసులు, ఆ డబ్బు పంపినది ఎవరు అని తెలుసుకున్న తర్వాతే ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.