త్రిష సన్నిహితురాలికి ప్రభుత్వ పదవి.. దళపతి విజయ్ షాకింగ్ డెసిషన్
తమిళనాడు ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు నామినేటెడ్ పదవుల విషయంలో ముఖ్యమంత్రి దళపతి విజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమిళనాడు ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు నామినేటెడ్ పదవుల విషయంలో ముఖ్యమంత్రి దళపతి విజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వరుసగా భర్తీ చేస్తున్న ప్రభుత్వ పదవులలో సినీ ప్రముఖులకు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలను ఆయన ఏ మాత్రం లెక్క చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన పలువురికి విజయ్ తన ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టగా తాజాగా తన సినిమాలు బిగిల్, గోట్ నిర్మించిన ఏజీఎస్ మూవీస్ సీఈవో అర్చనా కల్పతికి దేవాదాయశాఖ పదవిని కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయం పెను సంచలనం సృష్టిస్తోంది.
ప్రముఖ సినీ నిర్మాత అర్చనా కల్పతిని హిందూ ధార్మిక దేవాదాయ శాఖ (HR&CE) కమిటీ సభ్యురాలిగా నియమిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు వంశపారంపర్యేతర ట్రస్టు బోర్డులో ఆమె సభ్యురాలుగా వ్యవహరించనున్నారు. కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓగా, ఏజీఎస్ సినిమాస్ అధినేత్రిగా ఉన్న అర్చన కల్పతి.. ప్రముఖ హీరోయిన్ త్రిషకు అత్యంత సన్నిహితురాలిగా చెబుతున్నారు. దీంతో ఆమె నియామకం హాట్ టాపిక్ అవుతోంది.
కాగా, టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి జరిగిన మరో కీలక నియామకం ఇది. సినీ రంగానికి చెందిన వ్యక్తులకు, ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితులైన వారికి వరుసగా అధికారిక పదవులు ఇస్తున్నారని ముఖ్యమంత్రి విజయ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ సీఎం విజయ్ ఏ మాత్రం చలించడం లేదని తాజా నియామకంతో నిరూపించారని అంటున్నారు. గతంలో విజయ్ నటించిన 'జననాయగన్' చిత్ర నిర్మాత కె. వెంకట నారాయణన్‌ను తొలుత తమిళనాడు ప్రభుత్వ తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. దేశరాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వంటి కీలక పదవిని సినిమా నిర్మాతకు అప్పగించడంపై అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇక తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిత్ వెట్రివెల్ ను ఓఎస్డీగా నియమించిన ముఖ్యమంత్రి విజయ్ విమర్శలకు గురయ్యారు. ఈ విషయంలో ఒత్తిడి ఎక్కువ కావడంతో వెనక్కి తగ్గారు రికీ రాధన్ పండిత్ వెట్రివెల్ నియామకాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్‌కి మేనేజర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన జగదీష్ పళనిసామిని సీఎం ప్రైవేట్ కార్యదర్శిగా (పొలిటికల్) నియమించారు. అలాగే, నన్‌బన్, బీస్ట్, లియో వంటి సినిమాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను తారామణిలోని ఎంజీఆర్ ప్రభుత్వ సినిమా, టెలివిజన్ శిక్షణ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి విజయ్ గతంలో కథానాయకుడిగా నటించిన చిత్రాలే కావడం గమనార్హం.
దీనికి కొనసాగింపుగా ఇప్పుడు దేవాదాయశాఖలో వంశపారపర్యేతర ఆలయాలకు ధర్మకర్తల మండలిని నియమించిన తమిళనాడు ప్రభుత్వం అందులో సినీ నిర్మాత అర్చన కల్పతిని సభ్యురాలుగా బాధ్యతలు అప్పగించడమే చర్చనీయాంశం అవుతోంది. గత కమిటీ పదవీకాలం ముగియడంతో, వంశపారంపర్యేతర ధర్మకర్తల నియామక కమిటీని జూలై 24 నుండి అమలయ్యే విధంగా రెండేళ్ల కాలపరిమితితో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మైలామ్ బొమ్మపురం ఆధీనానికి చెందిన తవతిరు శివజ్ఞాన బాలయ స్వామిగల్ అధ్యక్షత వహించనున్నారు. రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ కె. రామనాథన్ ను డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. అర్చన కల్పతితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.ఆర్. సంపత్, సుమతి శ్రీ, డాక్టర్ టి. వేలుమురుగన్ సభ్యులుగా ఉంటారు.