పెళ్లి కావాలంటే అమ్మాయి పేరుపై ఆస్తులు రాయాల్సిందే.. పోస్ట్ వైరల్
సాధారణంగా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు వధూవరుల కుటుంబాల మధ్య నడిచే చర్చలు ఒక్కోసారి ఆసక్తికరంగా.. మరికొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటాయి.
సాధారణంగా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు వధూవరుల కుటుంబాల మధ్య నడిచే చర్చలు ఒక్కోసారి ఆసక్తికరంగా.. మరికొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటాయి. కట్నకానుకలు, ఉద్యోగం, జీతం, ఆర్థిక స్థోమత వంటి అంశాలు వివాహ నిశ్చయాల్లో ఎప్పుడూ కీలక భూమిక పోషిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా అరేంజ్డ్ మ్యారేజ్ మార్కెట్‌లో ఓ వధువు కుటుంబం నుంచి వచ్చిన వింత.. భారీ డిమాండ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెడిట్ పోస్ట్‌లో ఏముంది?
ఓ యువకుడు తన పెళ్లి సంబంధానికి సంబంధించిన అనుభవాన్ని ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'రెడిట్' లో పంచుకున్నాడు. తనకు పెళ్లి సంబంధం చూసే సమయంలో వధువు కుటుంబ సభ్యులు పెళ్లి జరగాలంటే ఏకంగా రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను అమ్మాయి పేరుపై రాయాలని షరతు విధించినట్లు సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లికి ముందే ఈ ఆస్తుల బదిలీపై స్పష్టమైన హామీ ఇస్తేనే ముందుకు వెళ్తామని వారు స్పష్టం చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఈ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్న వివరాలు సదరు వ్యక్తి చెప్పిన వ్యక్తిగత అనుభవం మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి స్వతంత్ర ధృవీకరణ లేదా అధికారిక ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నెటిజన్ల మధ్య వేడివేడిగా చర్చ
ఈ పోస్ట్ నెట్టింట ప్రత్యక్షమవ్వగానే నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల మధ్య బంధమని, దాన్ని ఆస్తులు-పాస్తుల లావాదేవీగా మార్చడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. సమాజంలో సాధారణంగా వరకట్నం డిమాండ్ల గురించి ఎక్కువగా వింటుంటామని.. అయితే ఈ మధ్యకాలంలో వధువు వైపు నుంచి కూడా ఇలాంటి విపరీతమైన షరతులు రావడం గమనార్హమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకరిద్దరు చేసే పనులను బట్టి మొత్తం సమాజానికి లేదా వివాహ వ్యవస్థకే వర్తింపజేయడం సరికాదని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.
సంబంధాలలో స్పష్టత.. గౌరవం ముఖ్యం
ఆధునిక కాలంలో సమాజం ఎంతగా పురోగమిస్తున్నప్పటికీ.. వివాహ వ్యవస్థలో డబ్బు, ఆస్తుల ప్రస్తావన ఈ స్థాయిలో రావడం ఆందోళన కలిగించే విషయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లి బంధం నిలబడాలంటే పరస్పర నమ్మకం, గౌరవం, అవగాహన ముఖ్యం కానీ బలవంతపు డిమాండ్లు కావు. ఇరు కుటుంబాలు ఒకరి ఆర్థిక పరిస్థితిని మరొకరు గౌరవిస్తూ.. ఎలాంటి ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ వివాహ బంధం సంతోషకరంగా సాగుతుంది.