రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం?! హర్మూజ్ కి ప్రత్యామ్నాయం ఇదే..

ఈ నేపథ్యంలోనే రష్యా - భారత్ మధ్య రైలు మార్గం నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యా ఉప ప్రధాని మరట్ ఖుస్నులిన్ తాజాగా చేసిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

Update: 2026-08-10 09:49 GMT

పశ్చిమాసియా యుద్ధం అంతర్జాతీయ రవాణా విప్లవానికి దారులు తీస్తోందనే విశ్లేషిస్తున్నారు ఇటు ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఒకవైపు, అటు ఉక్రెయిన్ తో రష్యా వార్ వల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ యుద్దాలు అంతర్జాతీయ వర్తక, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు సరుకు రవాణా కోసం ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా - భారత్ మధ్య రైలు మార్గం నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యా ఉప ప్రధాని మరట్ ఖుస్నులిన్ తాజాగా చేసిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా, రష్యా నుంచి నేరుగా హిందూ మహాసముద్రం మీదుగా భారత్‌కు ఒక ప్రత్యేక భూమార్గ రైలు మార్గాన్ని నిర్మించాలనే ఈ ప్రతిపాదన అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఈ ఆలోచన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందన అంటున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి భారత్‌తో పాటు ఇతర దేశాలకు జరిగే వాణిజ్యంలో ఎక్కువ భాగం సముద్ర మార్గం మీదుగానే జరుగుతోంది. ముఖ్యంగా టర్కీ నియంత్రణలో ఉన్న బాస్ఫరస్ జలసంధితోపాటు ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదో వంతుకు పైగా రవాణా అయ్యే పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా నల్ల సముద్రంలోనూ, అలాగే పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య చెలరేగిన ఘర్షణల వల్ల హోర్ముజ్ జలసంధి మార్గంలోనూ వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చమురు, సహజ వాయువు రవాణా కష్టతరంగా మారింది. సముద్ర మార్గాలలోని ఈ అనిశ్చితిని తట్టుకునేందుకు ఎటువంటి ముప్పు లేని పటిష్టమైన ప్రత్యామ్నాయ భూమార్గం అవసరమని రష్యా భావిస్తోందని చెబుతున్నారు.

రష్యా ఉపాధ్యక్షుడు మరట్ ఖుస్నులిన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రైల్వే కారిడార్ రష్యా నుంచి ప్రారంభమై మధ్య, దక్షిణ ఆసియా దేశాల గుండా హిందూ మహాసముద్రానికి చేరుకోవాలి. దీనికోసం మధ్య ఆసియాలోని టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, దక్షిణ ఆసియాలోని ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల గుండా సాగేలా రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని రష్యా భావిస్తోందని చెబుతున్నారు. దీనివల్ల రష్యా నుంచి నేరుగా భారత ఉపఖండానికి భూమార్గ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చనని మాస్కో అంచనా వేస్తోంది.

సాధ్యసాధ్యాలు - సవాళ్లు ఏమిటి?

అయితే ఈ ప్రతిపాదన ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం, రాజకీయంగా తీవ్ర అస్థిరత ఉండే దేశాల గుండా ఈ ప్రాజెక్ట్ వెళ్లాల్సి ఉండటం వల్ల ఇది అంత తేలికైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. రష్యా సరిహద్దుల నుంచి మధ్య ఆసియా మీదుగా భారత్ చేరుకోవాలంటే వేల కిలోమీటర్ల మేర పర్వత ప్రాంతాలు, ఎడారులు దాటాల్సివుంటుందని చెబుతున్నారు. అదేవిధంగా లక్షల కోట్ల పెట్టుబడులు, దశాబ్దాల శ్రమ అవసరమని చెబుతున్నారు.

ఇక అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్ ప్రాంతాల గుండా రైల్వే లైన్ వేయాలన్నా, భద్రత కల్పించాలన్నా తీవ్రమైన రాజకీయ, ఉగ్రవాద సవాళ్లు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపాదిత మార్గంలో పాకిస్థాన్ భాగస్వామ్యం ఉండటం వల్ల, భౌగోళిక రాజకీయాల దృష్ట్యా భారత్ నేరుగా ఈ మార్గాన్ని అంగీకరించడం అనేక దౌత్యపరమైన చర్చలకు దారితీస్తుందనిఅంటున్నారు. పశ్చిమాసియా సంక్షోభాలతో సంబంధం లేకుండా తన ఇంధన వనరులను, సరుకులను ఆసియా మార్కెట్లకు ఎగుమతి చేయడానికి రష్యాకు నమ్మకమైన ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుందని కానీ, భారత్‌కు రష్యా నుంచి మునుపెన్నడూ లేని విధంగా చమురు కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో రవాణా భద్రత మరింత బలపడుతుందని అంటున్నారు.

కాగా, రష్యా ప్రతిపాదనపై ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి స్పందనా వెలువడలేదు. ఇది పూర్తిగా ప్రాథమిక అన్వేషణ దశలో మాత్రమే ఉందని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఎప్పుడూ ప్రాంతీయ అనుసంధానతను స్వాగతిస్తుంది గానీ, భౌగోళిక భద్రత, పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, అంతర్జాతీయ ఆంక్షల వంటి సున్నితమైన అంశాలను బేరీజు వేసుకునే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. పాశ్చాత్య దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, రష్యా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా లేదా పశ్చిమ దేశాల ఆంక్షలకు తలవంచకుండా స్వతంత్ర వాణిజ్య మార్గాలను అన్వేషించడంలో ఇది ఒక పెద్ద ముందడుగుగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే భారత్-రష్యా మధ్య ఇరాన్ మీదుగా 'ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్' అమలులో ఉంది. దీనికి ఈ రైలు మార్గ ప్రతిపాదన మరింత విస్తృత రూపం ఇస్తుందని భావిస్తున్నారు. మొత్తంమీద, ఈ రైలు మార్గ నిర్మాణం సాంకేతికంగా భౌగోళికంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్నప్పటికీ, రష్యా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇలాంటి సాహసోపేతమైన ప్రతిపాదనలను తెరపైకి తెస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News