'కూట‌మి'కి విఘాతం క‌లిగించొద్దు: తేల్చేసిన పార్టీలు

నాయ‌కుల క‌న్నా కూట‌మికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తామ‌ని.. ఈ విష‌యంలో నాయ‌కులు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేశాయి.

Update: 2026-08-10 16:27 GMT

నాయ‌కుల క‌న్నా కూట‌మికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తామ‌ని.. ఈ విష‌యంలో నాయ‌కులు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేశాయి. ముఖ్యంగా కూట‌మి ప్రాధాన్యాన్ని అంద‌రూ గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపాయి. కూట‌మిపై ప్ర‌భావం ప‌డేలా వ్య‌వ‌హ‌రించే ఏ ఒక్క‌రినీ ఉపేక్షించేది లేద‌ని పేర్కొన్నాయి. స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించుకునేందుకు స‌రైన వేదిక‌లను నాయ‌కులు వినియోగించుకోవాల‌ని తేల్చి చెప్పాయి. ఈ విష‌యంలో పార్టీల అధిష్టానాలు.. నియ‌మించిన స‌మ‌న్వ‌య క‌మిటీల‌కు ఫిర్యాదు చేయొచ్చ‌ని పేర్కొన్నాయి.

తాజాగా ఉమ్మ‌డి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రాజ‌కీయాలు దుమారం రేపాయి. జ‌న‌సేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌రెడ్డికి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌త్య‌ర్థులు సోష‌ల్ మీడియా ద్వారా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అదేవిధంగా కూట‌మిపైనా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారం స్థానికంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఈ విష‌యంపై తాజాగా టీడీపీ, జ‌న‌సేన‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. నాయ‌కుల వ్య‌వ‌హార శైలి కార‌ణంగా కూట‌మిపై ప్ర‌భావం ప‌డేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని పేర్కొన్నాయి.

టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీల‌తో ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన స‌మ‌న్వ‌య క‌మిటీకి ఒంగోలు దుమారం స‌రిదిద్దే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాయి. దీంతో సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌న‌సేన‌-టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ నాయ‌కులు విజ‌య‌వాడ‌లో భేటీ అయ్యారు. టీడీపీ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ ఏపీచీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావు, మ‌రో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, జ‌న‌సేన నుంచి మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ఎమ్మెల్సీ స‌హా మ‌రికొంద‌రు నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఒంగోలు ప‌రిణామాల‌పై ఆయా పార్టీల నాయ‌కుల‌తో జూమ్ స‌మావేశంలో నేరుగా తెలుసుకున్నారు.

ఎవ‌రైనా స‌రే.. పార్టీల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించరాద‌ని కూడా ఇరువురు నేత‌ల‌కు తేల్చి చెప్పారు. ఈ సంద‌ర్భంగా దామ‌చ‌ర్ల‌పై బాలినేని మ‌రోసారి ఆరోప‌ణ‌లు గుప్పించారు. అయితే.. ఏదైనా స‌మ‌స్య ఉంటే స‌మ‌న్వ‌య క‌మిటీతో చ‌ర్చించాల‌ని నాయ‌కులు సూచించారు. త‌మ దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించాల‌ని.. ప్ర‌త్య‌ర్థులకు రాజ‌కీయ అస్త్రాల‌ను అందించేలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని తేల్చి చెప్పారు. కూట‌మి ఐక్య‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News