మాయా లోకం 'ఒరెగాన్ వోర్టెక్స్'… ఎత్తు కూడా మారిపోతుందా?

ఇక్కడి మరో విశేషం ఏమిటంటే బంతిని నేలపై ఉంచితే అది కిందికి కాకుండా పైవైపు దొర్లుతున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నీరు కూడా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది.;

Update: 2026-03-08 00:30 GMT

ప్రపంచంలో ఎన్నో వింతలు మనిషి అర్థానికి అందకుండా ఇంకా రహస్యంగానే మిగిలిపోయాయి. అలాంటి ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో అమెరికాలోని ఒరెగాన్ వోర్టెక్స్ ఒకటి. ప్రకృతి నియమాలనే సవాలు చేస్తూ కనిపించే ఈ ప్రాంతం శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ పూర్తిగా అర్థంకాని మర్మంగా నిలిచింది.

అమెరికా దేశంలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న ఈ వింత ప్రదేశం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతంలో అడుగుపెడితే సాధారణంగా మనం తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలు పనిచేయడం లేదన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ కనిపించే దృశ్యాలు మన కళ్లను, మెదడును గందరగోళానికి గురిచేస్తాయి.

ఈ వోర్టెక్స్ ప్రాంతంలో ఒక చిన్న గుడిసె ఆకారంలోని ఇల్లు ఉంది. ఈ ఇంటి లోపలికి వెళ్తే ఆశ్చర్యకరమైన ఘటనలు కనిపిస్తాయి. ఇద్దరు వ్యక్తులు ఒకే ఎత్తు ఉన్నా, ఒకరు మరోకరితో పోలిస్తే చాలా పొడవుగా లేదా చాలా పొట్టిగా కనిపిస్తారు. ఒకే వ్యక్తి రెండు స్థానాల్లో నిల్చుంటే ఎత్తు మారిపోయినట్టుగా కనిపించడం కూడా ఇక్కడ సాధారణమే.

ఇక్కడి మరో విశేషం ఏమిటంటే బంతిని నేలపై ఉంచితే అది కిందికి కాకుండా పైవైపు దొర్లుతున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నీరు కూడా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు చూసిన వారు నిజంగానే ఇది మాయలోకం అనిపిస్తుందని చెబుతుంటారు.

ఈ వింతల వెనుక అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం కంటి భ్రమ మాత్రమే. భూమి ఒరుసు, చెట్ల పెరుగుదల కోణం, భవనం నిర్మాణం అన్ని కలిసి మన కళ్లకు వాస్తవం కాకుండా వేరేలా కనిపించేలా చేస్తాయని వారు చెబుతున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఇక్కడ భూమి అయస్కాంత క్షేత్రంలో ఏదో ప్రత్యేకమైన మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ అయస్కాంత ప్రభావం వల్లే మన శరీర సమతుల్యత, దృష్టి భ్రమలు కలుగుతాయని వారు అనుమానిస్తున్నారు.

ఏది నిజమో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఒరెగాన్ వోర్టెక్స్ ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ వింతను ప్రత్యక్షంగా చూడటానికి అక్కడికి వెళ్తుంటారు.

శాస్త్రానికి సవాలు విసురుతున్న ఈ రహస్య ప్రదేశం మనకు ఒక విషయాన్ని మాత్రం గుర్తు చేస్తుంది. ప్రకృతి ముందు మనిషి జ్ఞానం ఇంకా చాలా చిన్నదే. ఇంకా ఎన్నో వింతలు, రహస్యాలు ఈ భూమిలో దాగి ఉన్నాయనే విషయాన్ని ఈ వోర్టెక్స్ మళ్లీ మనకు తెలియజేస్తోంది.

Tags:    

Similar News