మమత ఓడిన చోటుకు...బీజేపీ అతిధిగా బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9న కోల్‌కతాలో వెళ్తున్నారు. ఆయన ఆ రోజున జరిగే బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9న కోల్‌కతాలో వెళ్తున్నారు. ఆయన ఆ రోజున జరిగే బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్డీయేలో టీడీపీ కీలక మిత్ర పక్షం కావడంతో బాబుకు ఈ మేరకు ఆహ్వానం అందింది. దాంతో ఆయన ఈ నెల 9న ఉదయం 7:05కి ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరతారని, హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంది 7:40కి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక బాబు 9:20కి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికకు వెళతారని చెబుతున్నారు.
అత్యధిక సంఖ్యలో సీఎంలు :
తొలిసారి పశ్చిమ బెంగాల్ లో కాషాయం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో దేశంలోని ఎన్డీయేకు చెందిన 21 రాష్ట్రాల సీఎమలలో అత్యధిక శాతం ఈ చారిత్రాత్మక వేడుకకు హాజరవుతారని అంటున్నారు. దాంతో పాటుగా అనేక మంది జాతీయ స్థాయి నేతలు కూడా ఈ వేడుకకు అటెండ్ అవుతున్నారు. ఇక చంద్రబాబు ఈ కార్యక్రమానికి వెళ్లడం ఒక విధంగా రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన అంశంగా చెబుతున్నారు.
బెస్ట్ విషెస్ చెప్పేందుకే :
ఇక బీజేపీ దశాబ్దం కల నెరవేరుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు అంతా హాజరవుతున్న ఈ మహత్తర కార్యక్రమంలో బాబు పాల్గొని కొత్త ప్రభుత్వానికి బెస్ట్ విషెస్ చెబుతారని అంటున్నారు. బాబు వంటి సీనియర్ నేత జాతీయ స్థాయి నాయకుడు ఈ కార్యక్రమానికి వెళ్లడంతో దానికి జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఇక కొన్నేళ్ల క్రితం వెనక్కి వెళ్తే 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు పశ్చిమ బెంగాల్ వెళ్లారు. ఆయన అప్పటి బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలసి ప్రచారం నిర్వహించారు. ఇపుడు మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత బాబు బెంగాల్ వెళ్తూండడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.
ఎన్నికల ప్రచారం కోసం :
ఇక చంద్రబాబుని పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారనికి కూడా ఎ డీయే పెద్దలు ఆహ్వానించారు. అయితే ఆయనకు సమయాభావం కారణంగా తమిళనాడులో మాత్రమే ప్రచారం చేసి వచ్చారు. ఇపుడు బాబు బెంగాల్ వెళ్లడం ద్వారా ఎన్డీయేతో తన గట్టి బంధాన్ని మరోసారి లోకానికి స్పష్టం చేయనున్నారు. బాబు ఎన్డీయే మిత్రుడిగా ఉండడం ఆ కూటమికి ఎంతో బలం అయితే మమతా తదితరులు ఇండియా కూటమిలో ఉన్నా సరైన హైప్ ఆ కూటమికి రాకపోవడమూ రాజకీయ చర్చగానే ఉంది. మమత కోసం యూపీ నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్ కటా వచ్చి సంఘీభావం ప్రకటించిన సందర్భమూ ఇక్కడ గమనార్హం. దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ హవా పెద్ద ఎత్తున సాగుతున్న వేళ జాతీయ స్థాయిలో మంచి వ్యూహకర్తగా పేరున్న బాబు ఎన్డీయేలో కొనసాగడం విపక్షాలకు మరీ ముఖ్యంగా ఇండియా కూటమికి అతి పెద్ద లోటుగానే చూడాలని అంటున్నారు.