రక్షణ రంగంలో అద్భుతం - స్మార్ట్ వెపన్స్‌గా సాధారణ బాంబులు.. ‘తారా’ స్పెషల్ ఇదే..

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) దేశీయ రక్షణ రంగంలో మరో మైలురాయిని చేరుకుంది.;

Update: 2026-05-08 06:58 GMT

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) దేశీయ రక్షణ రంగంలో మరో మైలురాయిని చేరుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో రూపొందించిన మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ వెపన్ సిస్టమ్ ‘తారా’ (టెక్నికల్ అడ్వాన్సడ్ రేంజ్ ఆగ్మోంటేషన్)ను ఆవిష్కరించింది. ఒడిశా తీరంలోని తొలి గగనతల పరీక్షను విజయవంతంగా చేపట్టింది.

డీఆర్డీవో, భారత వైమానిక దళం సంయుక్తంగా ‘తారా’ పనితీరును గురువారం పరీక్షించాయి. ‘తారా’ అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్‌టెన్షన్ కిట్. దీని ప్రధాన ఉద్దేశ్యం సాధారణ బాంబులను లేదా యుద్ధనౌకల నుంచి ప్రయోగించే అన్‌గైడెడ్ వార్‌హెడ్‌లను (సాధారణ మందుగుండు సామాగ్రిని) అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే 'ప్రిసిషన్ గైడెడ్ వెపన్స్'గా మార్చడం. తక్కువ ఖర్చు, ఎక్కువ సామర్థ్యంతో ‘తారా’ను అభివృద్ధి చేశారు.

భూమిపై ఉన్న శత్రువులను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసేలా ‘తారా’ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. దీనికి చాలా తక్కువ ఖర్చుతో కూడిన అత్యాధునిక సాంకేతికతను వాడినట్లు చెబుతున్నారు. తారా సాంకేతికత కోసం హైదరాబాద్ లోని డీఆర్డీవో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)తోపాటు ఇతర డీఆర్డీవో ప్రయోగశాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు సహకరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అదేవిధంగా పారిశ్రామిక భాగస్వామ్యం కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. తారాను ప్రయోగాత్మకంగా గురువారం పరీక్షించినా, ఈ ఆయుధాలను ఇప్పటికే ఉత్పత్తి చేసేలా రక్షణ మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుందని అంటున్నారు. కాగా, తారా తొలిప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, వైమానిక దళంతోపాటు పారిశ్రామిక సహకారం అందజేసిన సంస్థలను రక్షణ మంత్రి అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఇదొక కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు.

Tags:    

Similar News