జనసేన కార్యకర్తలకు పవన్ బంపర్ ఆఫర్.. 2014 నుంచి ఉన్నవారి దశ తిరిగినట్లే..

జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యంతో అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం రచించారు.

Update: 2026-06-24 17:30 GMT

జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యంతో అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం రచించారు. కొద్దికాలంగా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేనాని ముందుగా సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళిక రెడీ చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కార్యకర్తలను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేలా ‘‘జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" ఏర్పాటు చేస్తున్నట్లు ‘ఎక్స్’లో ప్రకటించారు. జనసేనాని నిర్ణయం పట్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కనిపిస్తోంది. 2014లో పార్టీ ఏర్పడిన నుంచి పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే అజెండాతోనే ఈ కమిటీలు పనిచేయనున్నాయని చెబుతున్నారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల సమగ్రమైన సమాచారం సేకరించాలని జనసేనాని పవన్ స్పష్టం చేశారు. ఒక సీనియర్ పరిశీలకుడు, పార్టీ పట్ల నిబద్ధతతో పాటు స్థానిక రాజకీయాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి ఏటా సభ్యత్వ నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న ముగ్గురు నిబద్ధత గల సాధక్స్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు చొప్పున సాధక్స్ ఉంటారు. వీరికి తోడుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఐదుగురు సహాయక సిబ్బందిని కేటాయించారు. మొత్తంగా ఒక్కో పార్లమెంటు పరిధిలో 28 మందితో ఒక బలమైన బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కమిటీలు తన స్వీయ పర్యవేక్షణలో సమాచారం సేకరిస్తాయని పవన్ వెల్లడించారు.

ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం, 2014 నుండి పార్టీ ప్రస్థానంలో భాగస్వాములైన వారిని గుర్తించి గౌరవించడం. జనసేన జెండాను మోస్తూ, ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన ప్రతి జనసైనికుడి సేవలను పార్టీ గుర్తించడమే అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో, ఎంతో కాలంగా పార్టీ కోసం అంకితభావంతో కష్టపడుతున్న నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారాన్ని ఈ కమిటీలు సేకరిస్తాయి. కేవలం సభ్యుల వివరాలే కాకుండా, వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, పనితీరుపై కమిటీలు నివేదికలు సిద్ధం చేస్తాయి.

సేకరించిన ఈ సమాచారం ఆధారంగా పార్టీ బాధ్యతల కేటాయింపుపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. పార్లమెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ పార్టీ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారికి వారి నైపుణ్యానికి తగిన బాధ్యతలు అప్పగించనున్నారు. నాయకత్వాన్ని పైనుంచి రుద్దకుండా, క్షేత్రస్థాయి నుంచి ఎదిగేలా పార్టీని ప్రజాస్వామిక విలువలతో నిర్మించాలనేదే ఈ కార్యక్రమ లక్ష్యంగా చెబుతున్నారు. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న ఎవరికైనా నాయకత్వ అవకాశాలు కల్పించి, వారిని భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంలో భాగస్వాములను చేయడమే ఈ ప్రక్రియ అంతిమ ధ్యేయమని అధినేత పవన్ వెల్లడించారు.

మొత్తంగా చూస్తే, ఈ "సమాచార సేకరణ కమిటీలు" కేవలం డేటా సేకరణకే పరిమితం కాకుండా, జనసేన పార్టీని ఒక వ్యవస్థీకృత శక్తిగా మార్చే వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేశారని అంటున్నారు. పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్క జనసైనికుడిని భాగస్వాములను చేయడం ద్వారా, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పోరాడేలా పార్టీని తీర్చిదిద్దడమే జనసేనాని పవన్ ఆలోచనగా చెబుతున్నారు. నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం దక్కుతుందనే భరోసాను ఈ కమిటీలు కల్పించాలని పవన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా, పార్లమెంటు నియోజవర్గం చొప్పున ఈ కమిటీలు వేయడం కొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాలుగైదు జిల్లాల కమిటీలను పవన్ అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలు అన్నీ జనసేన అధికారిక ‘ఎక్స్’ అకౌంటులో వెల్లడించారు.

Tags:    

Similar News