ఒకే మాటతో నాలుగున్నర నిముషాల నిడివి గల సాంగ్ !

కవులకు ముందు ట్యూన్లు ఇచ్చి వారి నుంచి సాహిత్యం రాబట్టుకోవడం ఎమ్మెస్వీ స్పెషాలిటీ. ఆయన ట్యూన్లలో అందమైన పదాలు పొదిగి అద్భుత గీతాలు రాయడంతో దిట్టలుగా తెలుగులో ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు.

Update: 2026-06-24 18:02 GMT

ఎమ్మెస్ విశ్వనాథన్ అద్భుతమైన సంగీత దర్శకుడు. తెలుగు తమిళం, మళయాళం తదితర భాషలలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన సంగీత దిగ్గజం. మొత్తం 12 వందల సినిమాలకు మ్యూజిక్ అందించడం మామూలు విషయం కాదు. అంతే కాదు 1945 నుంచి 2015లో మరణించేంటంతవరకూ ఆయన సంగీత ప్రయాణం సాగింది. అంటే 70 ఏళ్ల పాటు అన్న మాట. మొత్తం 87 ఏళ్ళు జీవించిన ఎమ్మెస్ విశ్వనాధన్ అక్కినేని దేవదాస్ సినిమాకు కీలకమైన పాటలన్నీ కంపోజ్ చేసిన సంగతి చాలా మందికి తెలియదు. ఆ సినిమాకు సుబ్బరామన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు అసిస్టెంట్ గా ఉన్న ఎమ్మెస్వీ మధ్యలో సుబ్బరామన్ చనిపోతే మిగిలిన పాటలకు అన్నింటికీ కంపోజ్ చేశారు. అందులో అతి ముఖ్యమైనది జగమే మాయ అన్నది. అద్భుతమైన స్వర రచన చేసి ఈ రోజుకీ పాటను చిరంజీవిగా చేసిన మహనీయుడు ఎమ్మెస్వీ.

యూత్ లో కేక :

ఎమ్మెస్వీ 70 దశకం వరకూ చేసిన పాటలు ఒక ఎత్తు అయితే ఆ తరువాత ఆయన చేసిన మ్యూజిక్ మరో ఎత్తు. అపుడే ఎదిగి వస్తున్న రజనీకాంత్ కమల్ హాసన్ చిత్రాలకు ఆయన సంగీతం అందించి యూత్ నాడి అలా పట్టేశారు. కుర్రాళ్ళోయ్ గుర్రాలు అంటూ అందమైన అనుభవం మూవీలో ఆయన చేసిన మ్యూజిక్ అయితే యూత్ కి ఒక కేక. ఈ రోజుకీ ఆ పాట వింటే చాలు ఏ పాప్ సాంగ్ కీ లేని మత్తు గమ్మతూ అలా ఆవహిస్తుంది. ఏ వయసు వారు అయినా శరీరం అంతా ప్రకంపితం అవుతుంది. దటీజ్ ఎమ్మెస్వీ అన్న మాట.

ఈ కాంబో ఎవర్ గ్రీన్ హిట్ :

ఎమ్మెస్వీ పాటలు విలక్షణంగా ఉంటాయి. అవి వినడానికి ఈజీగా అనిపించినా గాయనీ గాయకులు పాడేటపుడు చాలా కష్టపడాల్సిందే. ఆయన ట్యూన్స్ అలాంటివి మరి. ఇక బాలు ఎల్ ఆర్ ఈశ్వరీ ఎమ్మెస్వీ కాంబో పాటలు అయితే భలేగా ఉంటాయి. భలే భలే మొగాడివోయ్ అని హస్కీ వాయిస్ తో ఎల్ ఆర్ ఈశ్వరి పాడుతూంటే వెనక అల్లరిగా ఇంగ్లీష్ లో బాలు మాటలతో జత కూరూస్తూంటే ఆ సాంగ్ అలా హంట్ చేయాల్సిందే. అరే ఏమిటీ లోకం అంటూ అంతులేని కధలో ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన పాట ఎమ్మెస్వీ మ్యూజిక్ లో మోడర్స్ థాట్స్ ఉన్న అమ్మాయి తెగింపు ఏంటో జస్ట్ సాంగ్ లోనే అలా వినిపించి కనిపిస్తుంది, కవ్విస్తుంది కూడా.

ట్యూన్స్ ఇచ్చిన తరువాతే :

కవులకు ముందు ట్యూన్లు ఇచ్చి వారి నుంచి సాహిత్యం రాబట్టుకోవడం ఎమ్మెస్వీ స్పెషాలిటీ. ఆయన ట్యూన్లలో అందమైన పదాలు పొదిగి అద్భుత గీతాలు రాయడంతో దిట్టలుగా తెలుగులో ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు. వారిలో ఒకరు డాక్టర్ సి నారాయణరెడ్డి. రెండవ వారు మనసు కవి ఆచార్య ఆత్రేయ. ఈ ఇద్దరితో ఎమ్మెస్వీ కాబోలో అధ్బుతమైన పాటలే వచ్చాయి. ఇక వేటూరి సుందరరామ మూర్తి కూడా సన్న జాజులోయ్ కన్నెమోజులోయ్ అని ఏ మాత్రం ప్రాస తగ్గకుండా అద్భుతమైన భావ వ్యక్తీకరణతో ఎన్టీఆర్ సింహబలుడు మూవీలో రొమాంటిక్ సాంగ్ రాసి శగ్భాష్ అనిపించుకున్నారు. అయితే ఆత్రేయ ఎమ్మెస్వీ కాంబో మాత్రం ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది. ఈ ఇద్దరూ కలసి కుర్రకారుకి జోరు పెంచారు, మనసు పిండే పాటలతో గుండె బరువెక్కించారు. అల్లారి చిల్లరి పాటలే కాదు వేదాంతాలు రాద్ధాంతాలు ఒకటేమిటి ఎన్ని చేయాలో అన్నీ చేశారు.

అది ఒక ప్రయోగం :

ఇక కమల్ మూవీ అందమైన అనుభవంలో ఒకే మాటతో నాలుగున్నర నిముషాల నిడివి గల సాంగ్ చేసి గ్రేటెస్ట్ అనిపించారు ఎమ్మెస్ విశ్వనాధన్. అందమైన అనుభవం అన్న టైటిల్ తీసుకుని బాలూ జానకిల హమ్మింగ్ తోనే మొత్తం పాటను నడిపించేశారు. మరి ఈ తరహా ప్రయోగం ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ ముందు కానీ తరువాత కానీ చేసి ఉండలేదంటే ఎమ్మెస్వీ ప్రతిభకి జై కొట్టాల్సిందే.

బాలచందర్ తో బంధం :

ఎమ్మెస్ విశ్వనాధన్ దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ లది సూపర్ డూపర్ కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా కూడా బ్లాక్ బస్టర్స్ అని చెప్పాలి. అంతులేని కధ, ఇది కధ కాదు, అందమైన అనుభవం. గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, తొలి కోడి కూసింది, 47 రోజులు, మరో చరిత్ర, కోకిలమ్మ ఇలా అనేక సినిమాలు ఉన్నాయి. ఎమ్మెస్వీ సంగీత సృష్టి అనితర సాధ్యం అనే చెప్పాలి. 87 ఏళ్ళ సంపూర్ణ జీవితం గడిపిన ఆయన 2015 జూలై 14న ఈ లోకాన్ని వీడారు. ఇక ఆయన 1928 జూన్ 24న జన్మించారు. ఆయన జయంతి వేళ సంగీత ప్రేమికులు అంతా ఆయన పాటల ద్వారా తలచుకుని తరిస్తున్నారు.

Tags:    

Similar News