దేశానికి ఎనిమిదవ ఉప ప్రధాని ఆయనేనా ?
ఉప ప్రధానులు ఎవరు అయినా అలా దారి తీసిన పరిస్థితులు నేపథ్యం చూస్తే కనుక రాజకీయ అనివార్యతలే ప్రధాన కారణంగా ఉన్నాయని చెప్పాలి.;
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్ళు నిండాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పడ్డాయి. ఇక ప్రధానులుగా అయిన వారి జాబితా చూస్తే మొత్తం 15 మంది అయ్యారు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ నుంచి చూసుకుంటే వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ వరకూ ఈ నంబర్ అన్న మాట. ఇక ఈ దేశంలో ఉప ప్రధానులు తీసుకుంటే ఇప్పటిదాకా కేవలం ఏడుగురు మాత్రమే అయ్యారు.
పూర్తి కాలం పని చేయలేదు :
ఇదిలా ఉంటే తొలి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలోనే అంటే 1947లోనే ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధ్యతలు నిర్వహించారు. ఇక చివరిగా చూస్తే ఎన్డీయే పాలనలో 2002లో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ ఉప ప్రధాని అయ్యారు. ఇప్పటికి పాతికేళ్ళుగా చూస్తే దేశానికి మళ్ళీ ఉప ప్రధానిగా మరొకరు ఎవరూ లేరన్నది వాస్తవం. వీరిలో ఎవరూ అయిదేళ్ళ పాటు పూర్తి కాలం పనిచేయలేదు అని చెప్పాల్సి ఉంది. దేశానికి రెండవ ఉప ప్రధానిగా మొరార్జీ దేశాయ్ అయ్యారు. అలాగే మూడవ ఉప ప్రధానిగా చరణ్ సింగ్, నాలుగవ ఉప ప్రధానిగా బాబూ జగ్జీవన్ రామ్ మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో అయ్యారు. చరణ్ సింగ్ మంత్రివర్గంలో యశ్వంతరావు చవాన్ అయిదవ ఉప ప్రధాని అయితే, అలాగే నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవీలాల్ ఆరవ ఉప ప్రధానిగా చేస్తే వాజ్ పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీగా ఏడవ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
రాజకీయ అనివార్యతలు :
ఉప ప్రధానులు ఎవరు అయినా అలా దారి తీసిన పరిస్థితులు నేపథ్యం చూస్తే కనుక రాజకీయ అనివార్యతలే ప్రధాన కారణంగా ఉన్నాయని చెప్పాలి. నెహ్రూ పటేల్ ప్రధాని పదవికి పోటీ పడితే సర్దుబాటులోనే పటేల్ ని ఉప ప్రధాని ఇచ్చారు. ఇక ఇందిరాగాంధీ ప్రధాని అయిన నేపథ్యంలో తన కంటే సీనియర్ కాంగ్రెస్ లో పోటీదారుగా ఉన్న మొరార్జీ దేశాయ్ కి ఉప ప్రధాని పదవి ఇచ్చారు అదే మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వానికి ప్రధాని అయినపుడు ఇద్దరు ఉప ప్రధానులను తీసుకోవాల్సిన రాజకీయ అవసరం ఏర్పడింది. అలాగే చరణ్ సింగ్ ఆరేడు నెలల స్వల్ప కాలం ప్రధాని పదవి నిర్వహిస్తే ఉప ప్రధానిగా యశ్వంతరావు చవాన్ ని తీసుకున్నారు. వీపీ సింగ్ ప్రధానిగా ఉంటే దేవీలాల్ ని సంతృప్తి పరచడానికి ఉప ప్రధాని ఆఫర్ ఇచ్చారు ఇక బీజేపీ అధికారంలో రావడానికి కారణం అయిన ఎల్కే అద్వానీకి ఉప ప్రధాని ఇవ్వడం జరిగింది.
ఊహాగానాలేనా :
ఇక ఈ దేశంలో 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఉప ప్రధానమంత్రి పదవి అన్నది లేదు. ఆ పదవి 2004 మే 23 నుండి ఖాళీగా ఉంది. ఇపుడు పెద్ద ఎత్తున ఉప ప్రధాని పదవి గురించి చర్చ వస్తోంది ఎందుకు అలా అంటీ బీహార్ సీఎం గా ఉంటూ రాజ్యసభకు వెళ్తున్న నితీష్ కుమార్ గురించి ఈ చర్చ మొదలైంది. అలాగే ఏపీ నుంచి చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల్లోకి వస్తే సముచిత స్థానం గా ఈ కీలక పదవి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలేనా నిజంగా అలా జరిగే అవకాశం ఉందా అంటే ప్రస్తుతానికి అయితే లేదు అనే చెప్పాలని అంటున్నారు.
కీలక నేతలే మరి :
ఇక మూడో సారి కేంద్రంలో నరేంద్ర మోడీ ఏర్పాటు వెనక ఏపీ నుంచి టీడీపీ బీహార్ నుంచి జేడీయూ ఎంపీల బలమే అత్యంత ప్రధానంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఎంపీలను మైనస్ చేస్తే కేంద్రంలో ఎన్డీయే మనుగడకు ఇబ్బంది వస్తుంది అన్నది గణితం చెప్పే లెక్కలు. కానీ రాజకీయ గణితంలో లెక్కలు చాలా మారుతాయి. ఈ రోజున బీజేపీకి కేంద్రంలో 240 ప్లస్ ఎంపీల మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి ముప్పయి సీట్లు తక్కువ పడవచ్చు. కానీ టీడీపీ జేడీయూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే వాతావరణం అయితే లేదు అన్నది అసలు విషయం. అవతల ఇండియా కూటమి అధికారాన్ని మార్చేసే విధంగా పవర్ ఫుల్ పొలిటికల్ గేం అయితే సాగడం లేదు, పైగా మోడీ అమిత్ షా ఇద్దరూ ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్నారు. దాంతో నంబర్ గేం లో ఎలా ఉన్నా తమకు అనుకూలం చేసుకునే నేర్పు బీజేపీ పెద్దలకు ఉందని అంటున్నారు. అందుకే ఇవన్నీ ఉత్త ప్రచారాలుగానే మిగిలిపోతున్నాయని అంటున్నారు. ఈ దేశానికి ఎనిమిదవ ఉప ప్రధాని రాబోతున్నారా అంటే ఇపుడున్న పరిస్థితుల్లో అయితే అది జరిగేది కాదు అనే అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.