సిక్కోలు ఊసు : ధర్మాన వద్దనుకుంటున్నారా ?

ఇక వైసీపీ ఓడాక తాను స్వయంగా ఒక యువ నేత చేతిలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలు అయ్యాక ధర్మాన ప్రసాదరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు అని అంటున్నారు.;

Update: 2026-03-08 01:30 GMT

వైసీపీలో సీనియర్ మోస్ట్ నేత ధర్మాన ప్రసాదరావు అన్న సంగతి తెలిసిందే. ఆయన 1981 ప్రాంతంలోనే యుక్త వయసులోనే సర్పంచ్ గా గెలిచి తన రాజకీయ జీవితాన్ని మొదలెట్టారు. ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల రాజకీయం ఆయనది, 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండేళ్ళు తిరగకుండానే నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా తొలిసారి అవకాశం అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేసి భేష్ అనిపించుకున్నారు 1994 తెలుగుదేశం వేవ్ లో ఓడినా 1999, 2004, 2009 లలో వరుసగా గెలిచి తన సత్తా చాటారు, ఇక వైఎస్సార్ కి ఇష్టుడిగా ఉంటూ కీలకమైన శాఖలను నిర్వహించారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో సైతం ధర్మాన పనిచేశారు. ఇలా శ్రీకాకుళం జిల్లా నుంచి సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం అయింది.

వైసీపీలో చేరినా కూడా :

ఇక ధర్మాన అన్న క్రిష్ణదాస్ వైసీపీలో 2011లోనే చేరిపోయినా ప్రసాదరావు మాత్రం 2014 దాకా కాంగ్రెస్ లో కొనసాగారు. ఆయన ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. ఆయనకు పార్టీ 2014, 2019, 2024లలో మూడు సార్లు టికెట్ ఇస్తే 2019లో విజయం సాధించారు. విస్తరణలో రెవిన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి చేపట్టినప్పుడే ఆయన రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు. ఎల్లకాలం తామే పదవులు అనుభవించాలని కోరిక లేదని కొత్త వారు రావాలని కోరుకున్నారు. 2024లో తన కుమారుడిని పోటీ చేయించాలని ఆయన ఆలోచించారు అని వినిపించింది. కానీ అధినాయకత్వం సూచనలతో ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది అని అంటారు.

సైలెంట్ గానే ఉంటూ :

ఇక వైసీపీ ఓడాక తాను స్వయంగా ఒక యువ నేత చేతిలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలు అయ్యాక ధర్మాన ప్రసాదరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు అని అంటున్నారు. అపుడపుడు మాత్రమే ఆయన మీడియా ముందుకు వచ్చేవారు. ఒక దశలో ఆయన పార్టీలో ఉన్నారా కొనసాగుతారా అన్న చర్చకు కూడా తెర లేచింది ఇటీవల కాలంలో అయితే ఆయన కూటం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. గట్టిగానే ఎటాక్ చేస్తున్నారు. అన్నీ అమరావతిలోనేనా ఉత్తరాంధ్రా లాంటి వెనకబాటు ప్రాంతానికి న్యాయం చేయరా అని కూడా నిలదీస్తున్నారు.

పార్టీ పదవులలో :

ఇక వైసీపీ అనేక మందికి పార్టీ పదవులు అప్పగిస్తోంది. అలాగే పార్టీలో అత్యున్నత రాజకీయ వేదిక అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా అనేక మందికి స్థానం కల్పిస్తోంది. కానీ ధర్మాన ప్రసాదరావుకు మాత్రం ఎక్కడా అవకాశం లభించలేదు, దానికి కారణాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. గతంలో అయితే ఆయన కొంత సైలెంట్ గా ఉన్నారు కాబట్టి పార్టీ ఆ వైపు చూడలేదు అనుకోవచ్చు, ఇటీవల కాలంలో ఆయన దూకుడు పెంచారు కదా అన్న మాట వినిపిస్తోంది. కానీ ధర్మానకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడం లేదు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

నో చెప్పేస్తున్నారా :

పార్టీ ఇటీవల కాలంలో రీజనల్ కో ఆర్డినేటర్ల పదవులు భర్తీ చేసింది. అందులో విశాఖ విజయనగరం జిల్లా నాయకులకు ప్రాధాన్యత దక్కింది. బొత్స సత్యనారాయణ, అలాగే విశాఖ నుంచి బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమరనాధ్ లకు పదవులు లభించాయి. మరి సీనియర్ నేతగా ఉన్న ధర్మాన పేరు ఎందుకు ప్రస్తావనకు రావడం లేదని అంటున్నారు. ధర్మాన తానే కోరి నో చెప్పేశారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. ఆ మధ్యన అయితే ఆయన సేవలను పార్టీ కేంద్ర కార్యాలయం స్థాయిలో వాడుకుంటారు అని కూడా ప్రచారం సాగింది. అయితే ఆయనకు మాత్రం పార్టీ పరంగా ఏ పదవులూ ఎందుకు రావడం లేదన్న సందేహాలు అయితే ఆయన అనుచరులలో కలుగుతున్నాయి. అయితే ధర్మాన జిల్లాకు మరీ ముఖ్యంగా తన సొంత నియోజకవర్గానికే పరిమితం అయి రాజకీయాలు చేయడానికే నిర్ణయించుకున్నారు అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఉత్తరాంధ్రాలో జిల్లాలలో మంచి సబ్జెక్ట్ కలిగి ధీటైన రాజకీయ వ్యూహాలు రచించగల ధర్మాన సేవలను పార్టీ ఏ విధంగా వాడుకుంటుందో.

Tags:    

Similar News