మంచు మురిపెంలో.. మరణ ఆస్వాదన!!
మామూలు పర్వతాలు ఎక్కేవారు చాలా మంది ఉంటారు. కానీ, మంచు పర్వతాలను అది కూడా.. అతి తీవ్రమైన శీతల పవనాలు వీచే పర్వతాలను అధిరోహించేవారు చాలా వరకు తక్కువ మంది ఉంటారు.
మామూలు పర్వతాలు ఎక్కేవారు చాలా మంది ఉంటారు. కానీ, మంచు పర్వతాలను అది కూడా.. అతి తీవ్రమైన శీతల పవనాలు వీచే పర్వతాలను అధిరోహించేవారు చాలా వరకు తక్కువ మంది ఉంటారు. అయితే.. ఇలాంటివారిలో 43 ఏళ్ల నిర్మల్ పూర్జా ఒకరు. నేపాల్‌కు చెందిన ఈ యువ పర్వతారోహకుడికి సాధారణ పర్వతాలు కాదు.. మంచు పర్వతాలు అధిరోహించడం అంటే మహా పిచ్చి.. ఆ పిచ్చే ఆయన ప్రాణాలు తీసింది. అత్యంత కఠినమైన మంచు పర్వతంగా పేరొందిన పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని `బ్రాడ్ పీక్` పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో హిమపాతం కారణంగా ఆయన మృతి చెందారు.
జీవితంలో ఫస్ట్ రావాలని..
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశయం ఉంటుంది. నిర్మల్ పూర్జాకు కూడా ఒక ఆశయం ఉంది. అదే.. ఎవరూ అధిరించేందుకు, సాహసం చేసేందుకు కూడా ముందుకు రాని పర్వతాలనుఅధిరోహించి రికార్డు సృష్టించాలని!. ఇలానే ఇప్పటి వరకు ఆయన ఎన్నో సాహస యాత్రలు చేశారు. 2021 గడ్డకట్టే శీతాకాలంలో అత్యంత క్లిష్టమైన కే2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈ సాహస యాత్రల్లో పూర్జా ఒక్కరే కాదు.. తనకో బృందాన్ని కూడా రెడీ చేసుకున్నారు. వారిని కూడా మంచు పర్వతాలు అధిరోహించేలా ప్రోత్సహిస్తారు. ఇలా.. ఆయన జీవితం పర్వతాలకు.. మంచుకే పరిమితం అయిపోయింది.
ఒక్కసారే ఇంటికి..
నేపాల్‌కు చెందిన పూర్జాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడకు వెళ్తే.. అక్కడ అభిమానులు అల్లుకు పోతారు. నిజానికి సినిమా హీరోలకు కూడా అంత మంది జనం ఉండరని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. పూర్జా అవివా హితుడు. పర్వతాలే తన దోస్తులని చెప్పే నిర్మల్.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్తారు. అది కూడా తన మాతృమూర్తి పుట్టిన రోజును పురస్కరించుకుని ఇంటికి వెళ్లి వచ్చేస్తారు. ఆయన ఎక్కువగా పర్వతాలు.. అధిరోహకులు, సంఘాలు వీటితోనే కాలక్షేపం చేస్తారు. ఇక, ఆదాయం అంటారా.. పర్వతారోహకులకు ఇచ్చే ప్రోత్సహకాలు.. నగదు బహుమతులు కోకొల్లలు. మరో మాట ఏంటంటే.. ఈయనకు నేపాల్ ప్రకటనల్లో మంచి పేరుంది. దీంతో ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సంపాయిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ప్రఖ్యాత ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్.. పూర్జా జీవితంపై ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. కొన్ని సిరీస్‌ల రూపంలో విడుదల చేసిన దీనికి భారీ ఫాలోయింగ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 8 వేల మీటర్ల ఎత్తైన 14 పర్వతాలను ఏడు నెలల్లోపే అధిరోహించి 2019లో చరిత్ర సృష్టించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ‘14 పీక్స్: నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’(14 పర్వతాలు: ఏదీ అసాధ్యం కాదు) టైటిల్‌తో వచ్చిన డాక్యుమెంటరీ అపూర్వ స్పందనను సొంతం చేసుకుంది. కాగా.. పూర్జా మృత దేహం తీసుకురావడం కష్టమని అధికారులు తెలిపారు. దాదాపు 7 వేల మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతంలో కూరుకుపోయారని చెప్పుకొచ్చారు. ఈయన వెంట వెళ్లిన బృందంలోని సభ్యులు కూడా గల్లంతయ్యారు.