రావాలి అవంతి అంటున్న వైసీపీ !
నాకొద్దీ పార్టీ అని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పటికి రెండేళ్ళ క్రితం వైసీపీని వీడిపోయారు.
నాకొద్దీ పార్టీ అని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పటికి రెండేళ్ళ క్రితం వైసీపీని వీడిపోయారు. చిత్రంగా ఇపుడు వైసీపీకి ఆయనే అవసరం అవుతున్నారు అని అంటున్నారు. భీమునిపట్నం వైసీపీ ఇంచార్జిగా ఉన్న చిన్న శ్రీను టీడీపీలో చేరిపోయారు. ఆయన పార్టీని వీడి పది రోజులకు దగ్గర పడుతున్నా భీమిలీ వైసీపీ ఇంచార్జిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక ఆ పార్టీ సతమతం అవుతోంది. వైసీపీకి భీమిలీ ఇపుడు అతి పెద్ద పరీక్ష పెడుతోంది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిని, అలాగే నెల్లిమర్ల వైసీపీ ఇంచార్జిని వెంటనే నియమించిన వైసీపీ అధినాయకత్వం భీమిలీ విషయంలో మాత్రం ఏమీ పాలుపోక ఆగిపోయిందా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే భీమిలీ టీడీపీకి కంచుకోట. అక్కడ వైసీపీని నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే అర్ధబలం అంగబలం ఉన్న నేతల కోసం పార్టీ చూస్తోంది.
వైసీపీ సర్వేలో ఆయనే :
ఇదిలా ఉంటే భీమిలీ నియోజకవర్గానికి కొత్త వైసీపీ ఇంచార్జిగా ఎవరిని నియమించాలి అన్న దాని మీద పార్టీ అంతర్గత సర్వే నిర్వహిస్తే మెజారిటీ క్యాడర్ తో పాటు నాయకులు అంతా అవంతికి జై కొట్టారని తెలుస్తోంది. అవంతి 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా ఆయన ఉన్నారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు అంగబలం అర్ధ బలానికి లోటు లేదు. ఇక 2009లో ప్రజా రాజ్యం నుంచి ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలా ఆయనకంటూ సొంత బలం అనుచర గణం ఉంది. అందువల్ల ఆయనకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే భీమిలీలో కూటమిని ధీటుగా ఎదుర్కొంటారు అని అంటున్నారు. ఇది భీమిలీ మెజారిటీ వైసీపీ నేతల మాటగా ఉంది.
ఇంతకీ ఆయన వస్తారా :
అయితే ఇదంతా ఒంటి చేతి చప్పుడు మాదిరిగానే ఉంది అంటున్నారు. వైసీపీ తన సర్వేలు తాను చేస్తోంది. అందులో అవంతి పేరు కూడా జోడించింది. అందరూ అవంతి కావాలని కోరుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఇంతకీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి తిరిగి చేరుతారా అన్నదే పెద్ద చర్చగా ఉంది. ఆయన 2024 డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పట్లో ఆయన ఆలోచనలు కూటమిలో చేరాలని. అందుకే వైసీపీ మేయర్ ని దించడానికి కార్పోరేటర్ గా ఉన్న తన కుమార్తె చేత కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయించి టీడీపీ కూటమికి జీవీఎంసీ దక్కేలా చేశారు. అయితే టీడీపీలో ఆయన రాకను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకించడంతో ఆగింది అని అంటున్నారు.
తగిన మూల్యం చెల్లిస్తోంది :
జనసేనలో ఆయనను చేర్చుకోవడానికి కూడా స్థానికంగా అంగీకారం లేదని చెబుతున్నారు. ఈ కారణాల వల్లనే ఆయన ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు అని అంటున్నారు. డీలిమిటేషన్ మీద అవంతి ఆశలు పెట్టుకున్నారు. సీట్లు పెరిగితే కనుక కూటమి పార్టీలలో చేరి మళ్ళీ పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో అవంతి వైసీపీలో చేరుతారు అన్నది ఎంతవరకూ జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఒకవేళ మనసు మార్చుకుని అవంతి వైసీపీలో చేరితే మాత్రం వైసీపీకి గండం గట్టెక్కినట్లే అంటున్నారు. మొత్తానికి చూస్తే గతంలో వైసీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ ఎన్నికల వేళ వారిని అందరినీ దూరం చేసుకున్న పాపానికి ఇపుడు వైసీపీ తగిన మూల్యం చెల్లిస్తోంది అని అంటున్నారు.