మీడియా రాజకీయం.. చేతులు మారుతున్న చానళ్లు!!
ఈ నెలలో రెండు టీవీ చానళ్లు రెండు పార్టీల నిర్వహణలోకి వెళ్లాయనే ప్రచారం పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మీడియా చానళ్ల పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా రాజకీయాలకు అతీతంగా నిలవాల్సిన పత్రికారంగం ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లో బంధీగా మారిపోతోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఇందుకు తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ఉదహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా చానళ్లు, పత్రికలు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పనిచేయాల్సిన అనివార్యత ఎదురవుతోందని అంటున్నారు. ఈ నెలలో రెండు టీవీ చానళ్లు రెండు పార్టీల నిర్వహణలోకి వెళ్లాయనే ప్రచారం పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీడియా రంగం రాజకీయాలతో మమేకమైపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాల్సిన పత్రికా రంగంపై కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల ఆధిపత్యమే ఎక్కువ అవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉందని అంటున్నారు. రాజకీయ పార్టీలకు ఆలోచనలకు తగినట్లు మీడియా పనిచేయని పక్షంలో ఆ రంగంలో నిలదొక్కుకోవడం కష్టంగా మారిన పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు. దీంతో రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్లు మీడియా చానళ్లు సైతం రంగులు మార్చుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగులో ప్రముఖ టీవీ చానల్ గ్రూపు ఇటీవల ఏపీలో అధికార పక్షానికి అనుబంధంగా పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఆ మీడియా చానల్ ఎడిటోరియల్ టీములో ఇటీవల అనూహ్య మార్పులు జరిగినట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల వరకు ఈ చానల్ విపక్షం తరఫున పనిచేసిందని అధికార పార్టీ నేతలు ఆరోపించేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలోని ప్రముఖ నేతకు అత్యంత సన్నిహితుడైన ఒక సీనియర్ జర్నలిస్టు ఆ మీడియా గ్రూపులో చేరడంతో చానల్ నిర్వహణ అధికారపక్షం గుప్పెట్లోకి వచ్చినట్లు అయిందనే ప్రచారానికి బలం చేకూర్చిందని చెబుతున్నారు. ఇదే సమయంలో విపక్షానికి అనుబంధంగా మరో చానల్ ఒప్పందం కుదర్చుకుందనే ప్రచారం మీడియా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసినట్లు చెబుతున్నారు.
తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఒక చానల్ హఠాత్తుగా ఏపీలో విపక్షం భావజాలానికి తగినట్లు పనిచేయడంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఒక ముఖ్య నేత సన్నిహితులకు చెందిన ఆ చానల్ గతంలో ఏపీలో విపక్షానికి వ్యతిరేకిగా ముద్ర వేసుకుందని అంటున్నారు. ఏపీలో అధికారపక్షానికి అనుబంధంగా, తెలంగాణలో అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడేలా ఆ చానల్ ప్రసారాలు ఉండేవని చెబుతున్నారు. కానీ, ఇటీవల ఏమైందో కానీ సదరు చానల్ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తూ హల్ చల్ చేస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో విపక్ష నేత మీడియా సమావేశాలకు ఇన్నాళ్లు అనుమతి లేక బయటే ఉండిపోయిన సదరు టీవీ చానల్ ప్రతినిధులు ఇటీవల ప్యాలెస్ లో జరిగే సమావేశాల్లో ప్రత్యక్షమవడంతో ఆ మీడియా గ్రూప్ ఆలోచన మారిందనే ప్రచారానికి ఊతమిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రచారం ఉధృతంగా సాగుతుండగానే సదరు మీడియా గ్రూపులో వైసీపీకి అనుబంధంగా ఉన్న కొందరు పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టారని సోషల్ మీడియా కోడైకూస్తోంది. దీంతో ఒకే నెలలో ఏపీకి చెందిన రెండు పార్టీలు రెండు చానళ్లపై ఆధిపత్యాన్ని దక్కించుకున్నాయనే ప్రచారం నిజం చేశాయని అంటున్నారు.