మంత్రి పదవుల కోసం మతం మార్చుకున్నారు!! - విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు
వైసీపీలో ఎమ్మెల్యే, మంత్రి పదవులు పొందాలంటే జగన్ ను ఆకట్టుకునేందుకు మతం మార్చుకోవాల్సివచ్చేదని ఆరోపించడమే కాకుండా, ఇలా ఎంతోమంది మార్చుకున్నారో వైసీపీలో నెంబర్ వన్ చెప్పాలంటూ పోస్టు పెట్టారు.
విపక్షం వైసీపీని లక్ష్యంగా చేసుకుని మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. కొత్త రాజకీయ పార్టీ పెడతానని కొన్నిరోజులుగా చెబుతున్న విజయసాయిరెడ్డి సమయం, సందర్భం లేకుండా విపక్షంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతుండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. కొత్త పార్టీ ప్రారంభిస్తానని గతంలో ప్రకటించిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై మత మార్పిడి ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి తాజాగా రెండేళ్ల క్రితం నాటి ఒక వీడియోను షేర్ చేశారు. వైసీపీలో ఎమ్మెల్యే, మంత్రి పదవులు పొందాలంటే జగన్ ను ఆకట్టుకునేందుకు మతం మార్చుకోవాల్సివచ్చేదని ఆరోపించడమే కాకుండా, ఇలా ఎంతోమంది మార్చుకున్నారో వైసీపీలో నెంబర్ వన్ చెప్పాలంటూ పోస్టు పెట్టారు.
రెండేళ్ల క్రితం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రసంగించిన వీడియోను విజయసాయిరెడ్డి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ, సీనియర్ ఎమ్మెల్యే 2024 ఎన్నికల ముందు చేసిన ఈ ప్రసంగంపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం తెలియజేయాలి’’ అంటూ కోరారు. అంతేకాకుండా ‘‘గతంలో ఎంతమంది నాయకులు తమ ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం జగన్ గారిని ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్‌లో నంబర్ వన్ సమాధానం చెప్పాలని కోరుతున్నా.’’ అంటూ రాశారు.
ఉన్నట్టుండి విజయసాయిరెడ్డి చేసిన ఈ పోస్టు రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. సహజంగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలకు తగిన సమయం సందర్భం ఉంటుందని, కానీ ఇప్పుడు ఎలాంటి చర్చ లేని మత మార్పిడుల అంశాన్ని విజయసాయిరెడ్డి తెరపైకి తేవడం వెనుక ఆయన ఉద్దేశం ఏమైవుంటుందో అర్థం కావడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న విజయసాయిరెడ్డి విపక్షంలో ఉన్న వైసీపీ స్థానంలో ఎదగాలని భావించడంలో తప్పు లేదని, కానీ ఎప్పటిదో వీడియోను బయటకు తీసి ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం చెప్పాలంటూ నిలదీయడమే ఆశ్చర్యంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపణలు చేస్తున్న విజయసాయిరెడ్డి ఆ పార్టీని అధినేత జగన్మోహనరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహంతో ఇటువంటి పోస్టులు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పాత వీడియోలు బయటకు తీసి కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసుకుని వైరల్ చేయాలని చేయాలని భావించడం కరెక్టు కాదని అంటున్నారు. అదే సమయంలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. తన స్థానంలో పార్టీలో ఎదిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని చూసి ఓర్వలేకే విజయసాయిరెడ్డి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇదే సమయంలో విజయసాయిరెడ్డి విమర్శలను అధికార పార్టీ హైలెట్ చేస్తోందని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీకి చెందిన జోగి రమేష్ కుటుంబం మతం మార్చుకుందన్న విషయం వెలుగు చూడగా, మంత్రి పదవి కోసమే ఆయన మత మార్పిడి జరిగిందని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు రాస్తుండటం ద్వారా ఒక వ్యూహం ప్రకారం వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.