కులం, బంధుత్వం.. ఉత్తరాంధ్ర వైసీపీకి శాపాలు!
ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బొత్స, ధర్మాన పెద్దరికమే ఎక్కువ. అటువంటి నేతలు కులం, బంధుప్రీతికి దాసోహం అయిపోతున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తుండటం తీవ్ర సంచలనం సృష్టిస్తోందని అంటున్నారు.
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కులం, బంధుగణం బలంగా ఉండాలని చెబుతుంటారు. కానీ, ఉత్తరాంధ్రలో విపక్షం వైసీపీకి ఆ రెండు అంశాలే శాపాలుగా మారాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నెలకొంటున్న పరిస్థితులు గమనిస్తే విపక్షం వైసీపీలో నేతల బంధుప్రీతి, కుల రాజకీయాలు పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఉందని అంటున్నారు. ఈ ప్రాంతంలో కీలక నాయకులుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులపై ఆ పార్టీకి చెందిన నాయకులు చేస్తున్న విమర్శలు వైసీపీలో అంతర్గత వ్యవహారాలను బయటపెట్టాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బొత్స, ధర్మాన పెద్దరికమే ఎక్కువ. అటువంటి నేతలు కులం, బంధుప్రీతికి దాసోహం అయిపోతున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తుండటం తీవ్ర సంచలనం సృష్టిస్తోందని అంటున్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో చెలరేగిన వివాదంతో విజయనగరం జిల్లాలో పార్టీ ఒక్కసారిగా కుదుపునకు గురైందని అంటున్నారు. ఈ వ్యవహారంపై చర్చ కొనసాగుతుండగానే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు, వైసీపీ యువ నాయకుడు చిరంజీవి నాగ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెబుతున్నారు. ధర్మాన సోదరులు కుల రాజకీయాలు చేస్తున్నారంటూ తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ చేసిన ఆరోపణలు వైసీపీలో విస్తృత చర్చకు దారితీశాయని అంటున్నారు. తమ్మినేని అరెస్టు కాకపోవడానికి బంధుప్రీతి కారణమంటూ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయంపై రచ్చకు దారితీశాయని చెబుతున్నారు.
ఇటు బొత్స, అటు ధర్మాన ఒకేసారి పార్టీ నేతల నుంచి అంతర్గత తిరుగుబాటు ఎదుర్కొంటుండటం పరిస్థితిని వేడెక్కిస్తోందని చెబుతున్నారు. బొత్స నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం వైసీపీ వర్గాలను షాక్‌కు గురిచేసిందని అంటున్నారు. తన కుమార్తె జడ్పీ చైర్ పర్సన్‌గా పోటీ చేస్తుందన్న బొత్స ప్రకటనతో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అసంతృప్తికి లోనయ్యారని, అందుకే పార్టీని వదిలి వెళ్లిపోయారని చెబుతున్నారు. కుమార్తెపై బొత్స చూపిన మమకారంతో జిల్లాలో పార్టీ పురోగతిపై ఒక్కసారిగా దెబ్బ పడిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారని అంటున్నారు. పైకి అంతా బొత్స అడుగుజాడల్లో పనిచేస్తున్నామని చెబుతున్నప్పటికీ, బొత్స కుటుంబ ప్రీతి, కులాభిమానంతో తమకు అవకాశాలు దక్కడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్యం చేస్తున్నారు. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్.కోటకు చెందిన ఎమ్మెల్సీ రఘురాజు దంపతులు రాజీనామా చేయగా, తాజాగా బొత్స మేనల్లుడు చిన్న శ్రీను సైతం గుడ్‌బై చెప్పారని అంటున్నారు.
అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోనూ పరిస్థితులు తయారయ్యాయని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ జిల్లాలో ధర్మాన సోదరుల నాయకత్వాన్ని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు జీర్ణించుకోలేకపోతున్నారని తాజా సంఘటనలు ఉదహరిస్తున్నాయని అంటున్నారు. అందుకే తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ బహిరంగంగా విమర్శలు చేశారని చెబుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సైతం ధర్మాన సోదరులపై ఇటువంటి ఆరోపణలు చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధుప్రీతి వల్లే భూ ఆక్రమణల కేసులో తమ్మినేని అరెస్టు కాలేదంటూ పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేసిన ఆరోపణలు కూడా వైసీపీలో పరిస్థితులను తెలియజేస్తున్నాయని చెబుతున్నారు. కులం, బంధుప్రీతి వంటి అంశాలకే ఆ పార్టీ నేతలు పరిమితమైపోతున్నారని, దీంతో నానాటికి పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ జోక్యం చేసుకోని పక్షంలో మున్ముందు మరింత మూల్యం చెల్లించుకోకతప్పని పరిస్థితి తలెత్తుతోందని కేడర్ నుంచి ఆందోళన వ్యక్తమవుతోందని అంటున్నారు.