అంతర్జాతీయ జలాల్లో పాక్ బరితెగింపు.. భారత నౌకాదళాన్ని ఢీకొట్టిన పాక్ నేవి.. కేంద్రం సీరియస్

దౌత్యపరమైన సరిహద్దులనే కాక.. కనీస మానవత్వాన్ని, వృత్తిధర్మాన్ని విస్మరించి పాకిస్థాన్ ప్రదర్శించిన ఈ ప్రవర్తనపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందిస్తూ పాక్ రాయబారికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2026-09-16 12:30 GMT

ఉద్రిక్తతల నిప్పురవ్వలపై నడుస్తున్న భారత్-పాక్ సరిహద్దుల్లో అంతర్జాతీయ జలాల సాక్షిగా మరో ఘర్షణ చోటుచేసుకుంది. కంటికి రెప్పలా దేశ తీర సరిహద్దులను కాపాడుతున్న భారత నౌకాదళ నౌకపైకి పాకిస్థాన్ నేవీ నౌక ప్రమాదకర రీతిలో దూసుకొచ్చి ఢీకొట్టడం తీవ్ర కలకలం రేపింది. సముద్రంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మాతృభూమి రక్షణే ఊపిరిగా విధి నిర్వహణలో ఉన్న మన నావికుల ప్రాణాలను తెగించి ఆడేలా పాక్ ప్రదర్శించిన ఈ బాధ్యతారాహిత్యం.. బరితెగింపు చర్యపై భారత్ రగిలిపోతోంది. దౌత్యపరమైన సరిహద్దులనే కాక.. కనీస మానవత్వాన్ని, వృత్తిధర్మాన్ని విస్మరించి పాకిస్థాన్ ప్రదర్శించిన ఈ ప్రవర్తనపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందిస్తూ పాక్ రాయబారికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

భారత్–పాకిస్థాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అరేబియా సముద్రంలో ఇరు దేశాల నౌకాదళాలకు సంబంధించిన ఓ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ జలాల్లో భారత నేవీకి చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొట్టింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ హైకమిషన్‌లోని ఛార్జ్ డి అఫైర్స్‌ను భారత విదేశాంగ శాఖ బుధవారం పిలిపించి బలమైన నిరసన తెలిపింది.

విదేశాంగ శాఖ ప్రకారం.. ఈ ఘటన సెప్టెంబర్ 15న ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చోటుచేసుకుంది. భారత నేవీ నౌక సాధారణ నిఘా విధుల్లో ఉండగా పాకిస్థాన్ నేవీకి చెందిన నౌక అధిక వేగంతో సమీపించి.. సురక్షితం కాని విధంగా మానీవర్ చేయడంతో ఢీకొన్నట్లు భారత వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనలో భారత నౌకకు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారాన్ని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.. సముద్రంలో సైనిక నౌకలు వ్యవహరించే సమయంలో అత్యంత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా పాకిస్థాన్ అధికారులకు తగిన సూచనలు చేయాలని ఢిల్లీలోని పాక్ దౌత్య ప్రతినిధికి సూచించింది.

1991 ఒప్పందం ప్రస్తావన

ఈ ఘటనకు సంబంధించి భారత్ 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన “మిలిటరీ విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికలపై ముందస్తు నోటీసు” ఒప్పందాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 10కు పాకిస్థాన్ నౌక ప్రవర్తన విరుద్ధంగా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరు దేశాల సైనిక కార్యకలాపాల విషయంలో పారదర్శకత, ముందస్తు సమాచారం, జాగ్రత్త వంటి అంశాలను ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది.

ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత ఛార్జ్ డి అఫైర్స్‌కు కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖ వద్ద ఈ అంశాన్ని అధికారికంగా లేవనెత్తాలని కేంద్రం సూచించింది. అంటే ఢిల్లీతో పాటు ఇస్లామాబాద్‌లోనూ దౌత్య మార్గాల్లో నిరసన నమోదు చేయాలని భారత్ నిర్ణయించింది.

గతంలోనూ ఇలాంటి ఘటన

భారత్–పాకిస్థాన్ నౌకాదళాల మధ్య సముద్రంలో ఢీకొన్న ఘటనలు గతంలోనూ నమోదయ్యాయి. 2011లో పాకిస్థాన్ నేవీకి చెందిన పీఎన్ఎస్ బాబర్, భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ గోదావరి మధ్య కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటన నేపథ్యంలో 1991 ఒప్పందంలోని నిబంధనలు, ఇరు దేశాల నౌకాదళాల మధ్య సముద్ర భద్రతా విధానాలు మరోసారి చర్చకు వచ్చాయి.

గత ఏడాది పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సున్నితంగా మారాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జలాల్లో జరిగిన తాజా నౌకా ఢీకొన్న ఘటనపై భారత్ దౌత్యపరంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News