ఇది రాకేష్ రెడ్డి హెచ్చరిక !

నేను రాజీనామా చేయాలని అనుకుంటున్నా’ అంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Update: 2026-09-16 09:30 GMT

కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ జిల్లా అనాధగా మారింది. అన్యాయానికి గురవుతుంది. నిజమాబాద్ జిల్లాకు నిధులు కేటాయించడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చిన్నచూపు చూస్తుంది. సీఎం నియోజకవర్గం కొడంగల్, సీతక్క నియోజకవర్గం ములుగు, ఇతర మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తారా ? నాకు పది నిమిషాలు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వండి. నేను రాజీనామా చేయాలని అనుకుంటున్నా’ అంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారో, నిజామాబాద్ జిల్లాకు ఎన్ని ఇచ్చారో పూర్తి లెక్కలతో వచ్చాను. నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం, జిల్లా అభివృద్ధి విషయాలపై సభలో అన్ని వివరాలు వెల్లడించిన తరువాత తాను రాజీనామా మీద నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించాడు.

తెలంగాణ శాసనసభ సమావేశాల చివరి రోజున రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచినట్లు అనిపించినా, ఆయన వ్యాఖ్యలను సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఎల్ నినో ప్రభావం, 22ఎ నిషేధిత భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలక ప్రకటన చేస్తాడని అంటున్నారు.

పైడి రాకేష్ రెడ్డి గతంలోనూ శాసనసభ వేదికగా మరియు బయట కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజాం సాగర్ కాల్వలకు, సాగునీళ్లకు రూ.1500 నుండి రూ.2 వేల కోట్లు కేటాయించాలని, పాలమూరు రంగారెడ్డికి నిధులు కేటాయిస్తూ ఉత్తర తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని గత జనవరి శాసనసభ సమావేశాల్లో విమర్శలు చేశారు. మంత్రులు నవ్వుతున్నారని, వారిని 20 సార్లు కలిసినా పనులు జరగడం లేదని అన్నారు.

‘నాకు 2 లక్షల జీతం. ఇద్దరు గన్ మెన్లు. కానీ శాసనసభకు ఎందుకు వచ్చానో అర్ధం కావడం లేదు. బస్టాండ్లు, హాస్టళ్లు కూలిపోతున్నాయి అని రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పెత్తనం చేయడాన్ని కూడా ప్రశ్నించారు. కొడంగల్, ఆర్మూర్ రెండూ సమానమే. రేవంత్ రెడ్డి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఎలా సహకరిస్తాడని ప్రశ్నించారు. తాజాగా రాజీనామా చేస్తాననడం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News