లండన్ వీధుల్లో తమిళుల రథోత్సవం.. వైరల్ వీడియోపై డిబేట్!

దక్షిణ లండన్‌లోని లూయిషమ్ ప్రాంతంలో ఉన్న లండన్ శివన్ కోవిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక తమిళ రథోత్సవం (తిరువింజహా) దృశ్యాలే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

Update: 2026-09-16 09:45 GMT

లండన్‌లోని వీధుల్లో భక్తులు నిర్వహించిన ఓ మతపరమైన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణ లండన్‌లోని లూయిషమ్ ప్రాంతంలో ఉన్న లండన్ శివన్ కోవిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక తమిళ రథోత్సవం (తిరువింజహా) దృశ్యాలే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

ఈ ఉత్సవంలో తమిళ హిందూ కమ్యూనిటీకి చెందిన భక్తులు శివుడు, గణేశుడి ప్రతిమలతో అలంకరించిన రథాలను వీధుల్లో ఊరేగించారు. సంప్రదాయ పూజలు, భక్తి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా కొందరు భక్తులు అంగప్రదక్షిణం వంటి మొక్కుబడి ఆచారాలను పాటిస్తూ రోడ్డుపై కొంత దూరం లేదా కార్యక్రమం జరిగే మార్గంలో దొర్లుతూ కనిపించారు. మహిళలు కూడా చీరలు ధరించి నడవడం, మోకాళ్లపై కూర్చోవడం, సాష్టాంగ నమస్కారం చేయడం వంటి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కార్యక్రమం సందర్భంగా వాలంటీర్లు హై-విజిబిలిటీ జాకెట్లు ధరించి జనసందోహాన్ని క్రమబద్ధీకరించడం, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం, అవసరమైన చోట ఫస్ట్ ఎయిడ్ సహాయం అందించడం వంటి బాధ్యతలు చేపట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.

అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలకు కారణమయ్యాయి. విదేశాల్లో నివసిస్తున్నప్పుడు తమ మతపరమైన, సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించడం ఒక వైపు ఉంటే.. మరోవైపు ప్రజా ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు స్థానిక చట్టాలు, ట్రాఫిక్, భద్రతా నిబంధనలు, ఇతర ప్రజల సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటూ తమ సంప్రదాయాలు పాటించడం.. పర్మిషన్ తీసుకొని విదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ వీడియోను కేవలం అసాధారణమైన దృశ్యంగా చూడకుండా, తమిళ హిందూ కమ్యూనిటీకి చెందిన ఒక సంప్రదాయ వార్షిక రథోత్సవం సందర్భంలో చూడాలని పలువురు సూచిస్తున్నారు.

మొత్తంగా వైరల్ అవుతున్న వీడియో వెనుక ఉన్న సందర్భం లండన్‌లో నిర్వహించిన వార్షిక తమిళ రథోత్సవం కాగా.. అందులో కనిపిస్తున్న భక్తి ఆచారాలపై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.



Tags:    

Similar News