జగన్ రాజకీయం చెయ్...సీనియర్లు కోరేది ఇదేనా ?

అదేంటి జగన్ రాజకీయాల్లోనే కదా ఉన్నది, మళ్లీ ఇదేమిటి అన్న సందేహం రావచ్చు. అయితే జగన్ రాజకీయాల్లో ఉన్నా కూడా పక్కా వ్యూహాలతో ఎత్తుగడలతో రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది అన్నదే సీనియర్ల మాట.

Update: 2026-09-16 09:30 GMT

అదేంటి జగన్ రాజకీయాల్లోనే కదా ఉన్నది, మళ్లీ ఇదేమిటి అన్న సందేహం రావచ్చు. అయితే జగన్ రాజకీయాల్లో ఉన్నా కూడా పక్కా వ్యూహాలతో ఎత్తుగడలతో రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది అన్నదే సీనియర్ల మాట. వైసీపీ విషయం తీసుకుంటే జగన్ అధినేతగా ఉన్నారు. ఇక పార్టీ దైనందిన వ్యవహారాలు చూసేందుకు పార్టీ నుంచి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి లాంటి వారు చెప్పే కోటరీ ఒకటి ఉందని అంటున్నారు. అన్ని విషయాలను సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి వారే చూసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక జిల్లాల విషయానికి వచ్చేసరికి రీజనల్ కో ఆర్డినేటర్లను మూడేసి జిల్లాలకు నియమించారు. వారు అక్కడి విషయాలను పర్యవేక్షిస్తారు. ఇలా కొందరు సీనియర్ నేతల చేతిలో పార్టీని పెట్టేసినట్లుగా ఉందని అంటున్నారు. అక్కడ వారు ఏమి చెబితే అదే జరుగుతోందని అంటున్నారు. దాంతో జగన్ మీద వైసీపీ మీద అభిమానం ఉన్న వారు కూడా వైసీపీలో కొనసాగే పరిస్థితులు లేకుండా పోతున్నాయని అంటున్నారు.

నేరుగా అనుసంధానం :

అధినాయకుడు పార్టీ నాయకులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అలాగే పార్టీలో ఎక్కడ ఏమి జరుగుతుంది అన్నది కూడా ఆయన గమనిస్తూ ఉండాలని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాయకుడి చెవికి చేరాలి. అయితే వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఎన్నో అంచెలను వైసీపీలో ఏర్పాటు చేశారు. వాటిని దాటుకుని జగన్ ని చేరడం కష్టం అవుతోంది అని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు కూడా జగన్ అపాయింట్మెంట్ చాలా మంది పెద్దలకే దొరకడం కష్టంగా మారింది అని చెబుతారు. ఇప్పుడు ఓడిన తరువాత కూడా అంతే అన్నట్లుగా ఉందని గుర్తు చేస్తున్నారు.

పార్టీని నమ్ముకుని :

ఒక రాజకీయ పార్టీని ఎవరైనా స్థాపించవచ్చు. అయితే ఆ పార్టీని నమ్ముకుని ఎంతో మంది చేరుతారు. వారి ఆకాంక్షలు అన్నీ కూడా పార్టీ అధినాయకత్వం పార్టీ నడిపే తీరుని బట్టే నెరవేరే అవకాశం ఉంది. అందరి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఆమోదయోగ్యమైన తీరులో పార్టీని నడిపితేనే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. పార్టీ తీరుని మార్చుకునేందుకు నిరంతరం సమీక్షలు కూడా అవసరం అని అంటున్నారు. ఇదిలా ఉంటే వర్గ పోరు ప్రతీ జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఉంది. దాంతో వైసీపీ బలంగా ఉన్న చోట కూడా వీక్ అయిపోతోంది అని అంటున్నారు.

అధినాయకత్వం జోక్యంతో :

శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ధర్మాన సోదరులే జిల్లా పార్టీ మీద మొత్తం పెత్తనం చేస్తున్నారు అని తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ ఆరోపిస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదని ఆయన అంటున్నారు. ఇలా రెండు కీలక వర్గాలు రెండు సామాజిక వర్గాల మధ్య వైసీపీ జిల్లాలో చీలిపోయి అవస్థలు పడుతోంది. వైసీపీ అధినాయకత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నారు.విజయనగరం జిల్లాలో కూడా అసంతృప్తి తారస్థాయికి చేరిన మీదటనే చిన్న శ్రీను పార్టీని వీడారని గుర్తు చేస్తున్నారు. ఇపుడు శ్రీకాకుళంతో పాటు అనేక జిల్లాలలో ఇదే రకమైన వాతావరణం ఉందని అంటున్నారు.

రాజకీయమే చేయాలి :

రాజకీయం అనేది ఒక క్రీడ. ఇక్కడ ఎవరికి నచ్చినట్లుగా వారు ఆడడానికి లేదు. ఈ ఆటకు సిద్ధపడితే ప్రత్యర్ధి వ్యూహాలను ఎత్తులను గమనించి దానికి తగినట్లుగా పై ఎత్తులు వేయాలి. అంతే స్థాయిలో రాజకీయం చేయాలి. అలా కాదు అని మడి కట్టుకుని కూర్చుంటే రాజకీయం ఎప్పటికీ పండదని అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని కూడా జగన్ విషయంలో మాట్లాడుతూ ఆయన రాజకీయ నాయకుడు కారు అనేశారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టుకుని నడుపుతున్నారని చెప్పారు. అలా అనుకుంటే వైసీపీ రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్ధి వేసే ఎత్తులకు చిత్తు అవుతూనే ఉంటుంది అన్నది కూడా సీనియర్ల మాటగా ఉంది. జగన్ తీరు మారాలని అంటున్నారు. ముల్లుని ముల్లుతోనే కోయాలి అన్నట్లుగా ఏపీలో రాజకీయానికి తగిన విధంగా వైసీపీ కూడా ధీటుగా స్పందించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News