మహారాష్ట్రలో మంటలు రేపుతున్న ఎఫ్ డి ఎ !
మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ గా తుకారాం ముందే బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు మంటలు రేపుతున్నాయి.
మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ గా తుకారాం ముందే బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు మంటలు రేపుతున్నాయి. ఆహార భద్రత, పరిశుభ్రత, కల్తీ మరియు నకిలీ అనధికారిక మందులు, ఆయుర్వేద తయారీ యూనిట్లు, మెడికల్ సంబంధిత ఉత్పత్తుల ధరలు వంటి అంశాలలో ఆయన కఠినమైన చర్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
తుకారాం ముందే బాధ్యతలు తీసుకున్న తరువాత హోటళ్లు, రెస్టారెంట్ల మీద తనిఖీలు నిర్వహించారు. గత జూన్ నుండి ఆగస్టు వరకు మూడు నెలలలో ఏకంగా 12,083 తనిఖీలు నిర్వహించారు. 875 మందిని అరెస్ట్ చేశారు. 655 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా, 603 లైసెన్సులను సస్పెండం చేసి, 5269 నోటీసులు ఇచ్చి, రూ.67.20 కోట్ల విలువైన సరుకులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
రెస్టారెంట్ల తనిఖీల్లో బొద్దింకలు, ఎలుకలు, పాడైన ఆహారం, అపరిశుభ్ర వంటగదులు, తగినంత నీరు, డ్రైనేజ్ సౌకర్యాలు లేకపోవడం, నియంత్రణ లోపాలు, అనధికార నిల్వలను గుర్తించారు. వీటిలో కేఫ్ మొండెగార్, ఇస్కాన్ గోవిందాస్, నూర్ మొహమ్మది, షాలిమార్, కె.రస్టమ్ ఐస్ క్రీమ్ పార్లర్, పార్శీ డైరీ ఫామ్, జెప్టో క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లు ఉండడం సంచలనం రేపింది.
ఆయితే ఆయన తాజాగా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రైవేటు ఆసుపత్రులలో వినియోగించే వైద్య సామగ్రికి సంబంధించి వాస్తవ ధరలకు, ఎమ్మార్పీ ధరల మధ్య అసాధారణ తేడాలు కనిపించాయి. కొన్ని వాటి ధరల్లో ఏకంగా 2,841 శాతం హెచ్చు కనిపించడం ఆశ్చర్య పరిచింది.
సాధారణంగా ఆసుపత్రులలో వినియోగించే ఐవీ సెట్లు, సిరంజిలు, నెబులైజర్లు, ఆక్సిజన్ మాస్క్ లు, కాథడర్స్ వంటి వాటిలో కొనుగోలు చేసిన ధరలు, దాని మీద ముద్రించిన ఎమ్మార్పీ ధరలలో అంతులేని వ్యత్యాసం కనిపించింది. ఐవీ సెట్ రూ.11.05 కొనుగోలు చేస్తుండగా, దాని మీద రూ.325, క్యాథెటర్ రూ.29.41కి కొనుగోలు చేస్తుండగా రూ.310, సిరంజి రూ.6.75 కు కొనుగోలు చేస్తుండగా రూ.57.20, నెబులైజర్, ఆక్సిజన్ మాస్క్ రూ.40 ఉండగా రూ.715 వరకు, ఐవీ క్యానులా రూ.22.50 ఉండగా రూ.424 ఎమ్మార్పీ ధరలు ఉండడం కలకలం రేపుతున్నది.
ఇవన్నీ చికిత్సలో భాగంగా రోగులకు ఆసుపత్రుల బిల్లులలో వస్తాయి. చికిత్స సమయంలో వారికి నిజమైన ధరలు తెలియవు. అందుకే వారు పోల్చుకోవడం, ప్రశ్నించడం చేయలేకపోతున్నారని అంటున్నారు. అయితే ప్రాఫిటబిలిటీ, మౌళిక సదుపాయాలు, సాంకేతికత, రోగి రక్షణ నేపథ్యంలో రోగి నమ్మకం దెబ్బతినకూడదు అని ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు వాదిస్తుండగా, ఆల్ ఇండియా మెడికల్ డివైస్ ఇండస్ట్రీ మాత్రం దీనిని స్వాగతిస్తున్నది.