పెళ్లి కావట్లేదా? ఆ గణనాథుడి మెహందీ ప్రసాదంతో ఏడాదిలోనే కళ్యాణ యోగం.. వైరల్ అవుతున్న రాజస్థాన్ ఆలయ విశేషాలు

రాజస్థాన్ రాజధాని జైపుర్‌లోని ప్రసిద్ధ 'మోతీ డూంగ్రీ గణేశ్ ఆలయం' ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-09-16 05:38 GMT

ఈ వినాయక చవితికి ‘సింగిల్స్’ కాస్త క్షేమంగానే ఉన్నారా? ఆఫీసుల్లో సెలవులు దొరక్కపోయినా పర్లేదు గానీ.. జైపుర్ విమానం టికెట్ దొరికితే చాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. మొన్నటివరకు ఉద్యోగాలు, ప్రమోషన్ల కోసం గుళ్లు చుట్టూ తిరిగిన కుర్రకారు.. ఇప్పుడు ఒకే ఒక్క గోరింటాకు చుక్క కోసం ఏకంగా జైపుర్ 'మోతీ డూంగ్రీ' ఆలయాన్ని ముట్టడించారు. మోకాళ్ళ లోతు నీళ్లలో కాకుండా మోకాళ్ళ లోతు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి.. “దేవుడా, ఉద్యోగం రాకపోయినా పర్లేదు గానీ ఈ ఏడాదికి ఒక పిల్లను సెట్ చేసి పుణ్యం కట్టుకో” అంటూ 3,500 కిలోల మెహందీ ప్రసాదాన్ని కేవలం మూడు గంటల్లో ఖాళీ చేసేశారు. మ్యాచ్ మేకింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు ఉతికి ఆరేసినా దొరకని 'కళ్యాణ యోగం'.. జైపుర్ గణపతి ఇచ్చే ప్రసాదంతో దొరికేస్తుందన్న నమ్మకంతో దేశంలోని సగం మంది 'పెళ్లి కాని ప్రసాదులు' ఇప్పుడు జైపుర్ క్యూలైన్లలోనే మకాం వేశారు.

రాజస్థాన్ రాజధాని జైపుర్‌లోని ప్రసిద్ధ 'మోతీ డూంగ్రీ గణేశ్ ఆలయం' ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయం భక్తులతో, ముఖ్యంగా వివాహం కావాల్సిన యువతీ యువకులతో కిటకిటలాడుతోంది. నెటిజన్లు సరదాగా 'పెళ్లి కాని ప్రసాదులు' అని పిలుచుకునే ఈ యువత అంతలా అక్కడ ఎగబడటానికి ఓ ఆసక్తికరమైన నమ్మకమే కారణం!

ఏడాదిలో పెళ్లి ఖాయమనే విశ్వాసం

మోతీ డూంగ్రీ గణపతి ఆలయంలో పూజల అనంతరం భక్తులకు ప్రత్యేకంగా 'మెహందీ'ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ ప్రసాద రూపంలో లభించే మెహందీని చేతులకు పెట్టుకుంటే, పెళ్లి కాని వారికి సరిగ్గా ఏడాది వ్యవధిలోనే వివాహం నిశ్చయమవుతుందని భక్తుల బలమైన విశ్వాసం. ఈ నమ్మకంతోనే రాజస్థాన్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, గుజరాత్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది యువతీ యువకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి జైపుర్‌కు క్యూ కడుతున్నారు.

3 గంటల్లో 3,500 కిలోల మెహందీ ఖాళీ!

ఆలయానికి వస్తున్న భక్తుల రద్దీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇటీవల జరిగిన ఒక సంఘటనే నిదర్శనం. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ఏకంగా 3,500 కిలోల మెహందీని సిద్ధం చేయగా, అది పంపిణీ ప్రారంభించిన కేవలం మూడు గంటల్లోనే పూర్తిగా ఖాళీ అయిపోయింది!

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు

మెహందీ ప్రసాదం కోసం రాత్రింబవళ్లు తేడా లేకుండా వేలాది మంది యువకులు క్యూ లైన్లలో నిలబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై తెగ వైరల్ అవుతున్నాయి. "త్వరలోనే గుడ్ న్యూస్ వింటారేమో!", "బ్యాచిలర్స్ అందరూ జైపుర్ విమానం ఎక్కేయండి" అంటూ నెటిజన్లు ఈ వీడియోలపై సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ మెహందీ ప్రసాదం వెనుక ఉన్న నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేకపోయినప్పటికీ, దశాబ్దాలుగా వస్తున్న ఆధ్యాత్మిక విశ్వాసమే భక్తులను ఈ స్థాయిలో ఆకట్టుకుంటోందని స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా, ఈ ఉత్సవ సీజన్‌లో మోతీ డూంగ్రీ ఆలయం పెళ్లికాని ప్రసాదుల కొంగు బంగారంగా మారి పండుగ వాతావరణాన్ని పంచుతోంది.

Tags:    

Similar News