ఎందుకీ ఎండీఆర్? ఎవరి కోసం ఈ వడ్డన?

యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం విధించిన 0.4 ఛార్జీల వ్యవహారం ఇప్పుడు అందరికి ఎన్నో ప్రశ్నల్ని తలెత్తేలా చేస్తుంది.

Update: 2026-09-16 04:14 GMT

యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం విధించిన 0.4 ఛార్జీల వ్యవహారం ఇప్పుడు అందరికి ఎన్నో ప్రశ్నల్ని తలెత్తేలా చేస్తుంది. ఇంతకాలం ఎవరికైనా ఏమైనా డబ్బులు చెల్లించాలంటే ఫోన్ తీసి.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటమో.. లేదంటే ఫోన్ నెంబర్ తో పే చేసేయటమే తప్పించి.. దీని వెనుకున్న లెక్కలు.. అంకెల గురించి పెద్దగా పట్టింది లేదు. ఎప్పుడైతే రూ.2 వేలకు మించిన చెల్లింపులు.. అది కూడా ఒక వ్యక్తి ఒక వ్యాపారికి చెల్లిస్తే.. దాని మీద 0.4 శాతం మొత్తాన్ని వ్యాపారి నుంచి కట్ చేసుకుంటాయన్న రూల్ వచ్చే నెల (అక్టోబరు) 15 నుంచి అమలవుతుందన్న మాట కేంద్ర ప్రభుత్వం చెప్పిందో.. ఆ క్షణం నుంచి పలు సందేహాలు మనసును తొలిచేస్తున్న పరిస్థితి.

ఇంతకూ అసలు ఈ వడ్డన ఎందుకు? ఇంతకాలం ఉచితంగానే సేవలు అందిస్తున్నప్పుడు.. తాజాగా ఈ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రధాన ప్రశ్న. ఇప్పుడు కూడా డబ్బులు చెల్లించే వారి నుంచి ఛార్జీ వసూలు చేయట్లేదని ప్రభుత్వం బల్లగుద్ది చెబుతున్నా.. సదరు వ్యాపార సంస్థ తమ మీద పడే భారాన్ని మీరే వేసుకోవాలని వినియోగదారుడిని అడిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ అంశమే సగటు జీవిని తాజా ఎండీఆర్ గురించి పదే పదే ఆలోచించేలా చేస్తోంది.

ఇంతకూ ఎండీఆర్ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మర్చంట్ డిస్కౌంట్ రేట్. ఇదెలా పని చేస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇదే. అదేమంటే.. ‘‘ఎండీఆర్ ద్వారా వసూలు అయ్యే మొత్తంలో కొంత మొత్తాన్ని యూపీఐ లావాదేవీల సేవలు అందిస్తున్న బ్యాంకులు.. యాప్ లకు పంచుతారు’’ అని చెబుతున్నారు. అదే సమయంలో కొంత మొత్తాన్ని దేశంలోని మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల ఊతానికి.. నూతన ఆవిష్కరణలకు.. సైబర్ సెక్యూరిటీ.. కస్టమర్ సర్వీస్ రంగాలకు ఉపయోగిస్తామని చెబుతున్నారు.

అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలు.. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్.. టైర్ 3 పట్టణాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు.. ఆర్థిక రాయితీలు ఇవ్వటానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. అదేమంటే..గతంలో యూపీఐ చెల్లింపులు ప్రోత్సహించటానికి ఎండీఆర్ ఛార్జీలను తొలగించిన కేంద్రం.. ఈ వ్యవస్థలను నిర్వహించటానికి అయ్యే ఖర్చులను బ్యాంకులు.. పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు కొంత మొత్తాన్ని ఇన్సింటివ్ లు ఇస్తూ వచ్చేది. ఒక అంచనా ప్రకారం గడిచిన మూడేళ్లలో కేంద్రం ఈ సంస్థలకు దాదాపు రూ.8వేల కోట్లకు పైనే చెల్లింపులు జరిపినట్లుగా చెబుతున్నారు.

మరోవైపు యూపీఐ చెల్లింపులు అంతకంతకు పెరుగుతున్నాయి. యూపీఐను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం ఆగస్టులో దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవీల సంఖ్య 2451 కోట్లు. వీటి విలువ రూ.29.82 వేల కోట్లకుపైనే ఉన్నట్లు చెబుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న లావాదేవీల సంఖ్య నేపథ్యంలో బ్యాంకులు.. సర్వీస్ ప్రొవైడర్లకు అయ్యే నిర్వహణ ఖర్చు భారం పెరుగుతోంది. ఆ లోటును కొంత మేర కేంద్రం భర్తీ చేస్తున్నా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే.. ఆ భారాన్ని తాను మోయకుండా పరోక్షంగా వ్యాపారులు మోసే (అంతిమంగా వినియోగదారుడే మోస్తాడు. అది వేరే సంగతి)లా ఎండీఆర్ వడ్డనకు శ్రీకారం చుట్టారు. అయితే.. తాజా వడ్డన పుణ్యమా అని దేశంలో మళ్లీ నగదుతో చెల్లింపులు జరిపే పరిస్థితి పెరుగుతుందా? అన్న ప్రశ్న వస్తోంది. అయితే.. దీనికి కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.

Tags:    

Similar News