రాజకీయాలకు ఈ కార్పొరేట్ ఇంటర్వ్యూలు ఏంది రాహుల్ సారూ?

రాజకీయాలను రాజకీయాలుగా చూసే వరకు ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాలు అన్నవి ప్రజల భావోద్వేగాలకు సంబంధించినవి.

Update: 2026-09-16 03:57 GMT

రాజకీయాలను రాజకీయాలుగా చూసే వరకు ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాలు అన్నవి ప్రజల భావోద్వేగాలకు సంబంధించినవి. వాటిని ఎప్పుడు.. ఎలాంటి సందర్భంలో ఎవరు స్ప్రశిస్తారు? అన్న దాని మీదనే విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయాలు ఎప్పటికి మ్యాథ్స్ కావు. అలా అని లెక్కలు లేకుండా రాజకీయాలు నడపటం అంత తేలికైన పని కాదు. కానీ.. రాజకీయాల్ని లెక్కలతో బంధించి.. దానికో ఫార్ములా సిద్ధం చేసి.. అలా నడుచుకోవాలన్న ఆలోచన తప్పు. ఈ విషయాన్ని వృద్ధ కాంగ్రెస్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. గడిచిన తొమ్మిది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ.. ప్రియాంక వాద్రాలు చేస్తున్న ఇంటర్వ్యూల మారధాన్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

అఖిల భారత కాంగ్రెస్ కమిటి (సింఫుల్ గా చెప్పాలంటే ఏఐసీసీ)ని ప్రక్షాళించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పాత నీరు స్థానే కొత్త నీరును తీసుకురావాలని తపిస్తోంది. అదే.. తమ పార్టీ తీరుతెన్నులను పూర్తిగా మార్చేస్తుందని భావిస్తోంది. ఇందుకు సంప్రదాయపద్దతులు.. రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన మార్గాల్ని వదిలేసి.. రాహుల్, ప్రియాంకలు కార్పొరేట్ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నెల 7నుంచి కొత్త కార్యదర్శుల పదవుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూ కమిటీలో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ ముగ్గురు కలిసి గడిచిన తొమ్మిది రోజులుగా బ్యాచుల వారీగా మొత్తం130 మంది ఆశావాహులను పిలిచి ప్రశ్నించారు. వారిచ్చిన సమాధానాలను నోట్ చేసుకున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి ఏం చేస్తారన్న దానికి సంబంధించి పలు ప్రశ్నలు వేసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా వారి బయోడేటాను.. పార్టీలో వారు ఇప్పటివరకు చేసిన పనులు.. నిర్వహించిన బాధ్యతలు.. తదితర అంశాల్ని సేకరించినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఏఐసీసీలో 64 మంది కార్యదర్శులు ఉన్నారు. వారికి వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. వీరందరితోనే భేటీ కావటంతో పాటు.. వీరి పని తీరును రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాలు కలిసి సమీక్షించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడున్న వారిలో సగం మందికి స్థానచలనం కల్పించి.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇంటర్వ్యూలకు హాజరైన నేతలతో మీడియా ప్రతినిధులు మాట్లాడినప్పుడు.. ఇంటర్వ్యూలో భాగంగా తమను ఏమేం ప్రశ్నల్నిఅడిగారో కూడా చెప్పేయటం కనిపిస్తుంది.

ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా విజయాలు సాధించని రాష్ట్రాలు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు మీరైతే ఏం చేస్తారు? అని ప్రశ్నించినట్లుగా చెప్పారు. ఫలానా రాష్ట్రానికి పంపితే.. విధులు ఎలా నిర్వహిస్తారు? అక్కడున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారని ప్రశ్నించినట్లుగా వారు చెప్పారు. అంటే.. కార్యదర్శులు ట్రబుల్ షూటర్ లుగా వాడటం బాగానే ఉన్నా.. ఇంతటి కీలకమైన వారి ఎంపిక ఇంటర్వ్యూలతో ఎంతవరకు సరైనది? అన్నది అసలు ప్రశ్న.

నిజానికి పార్టీకి అవసరమైన వారు ఎవరు? ఎవరి సామర్థ్యం ఏమిటి? వారికున్న విశేష లక్షణాలు ఏమిటన్న విషయాల్ని ఇంటర్వ్యూలతో తేల్చేయగలుగుతారా? అన్నది మరో ప్రశ్న. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ ఈ రోజున తమ పార్టీకి అవసరమైన ట్రబుల్ షూటర్ల ఎంపిక కోసం తొమ్మిది రోజులుగా ఇంటర్వ్యూలు నిర్వహించటం చూస్తే.. కాంగ్రెస్ అధినాయకత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News