గాల్లోనే టైర్ ఊడిపోయి.. ఇంజిన్‌లో లోపం.. ఇరాన్ బోయింగ్ 737 విమానంలో తీవ్ర భయాందోళన
ఇరాన్ దేశీయ విమానయాన రంగంలో మరోసారి సాంకేతిక లోపాలు కలకలం రేపాయి. గాల్లో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 విమానంలో ఒక్కసారిగా తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఇరాన్ దేశీయ విమానయాన రంగంలో మరోసారి సాంకేతిక లోపాలు కలకలం రేపాయి. గాల్లో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 విమానంలో ఒక్కసారిగా తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పైలట్ల సమయస్ఫూర్తితో విమానం సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సేపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మషాద్ విమానాశ్రయం నుంచి కెర్మాన్‌షాహ్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రన్‌వే వదిలి పైకి లేచిన వెంటనే విమానం చక్రాల్లో ఒకదానికి సంబంధించిన టైర్ ఊడిపోయింది. దీనికి తోడు, కొద్దిసేపటికే ఇంజిన్ నుంచి కూడా సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించారు.
భయాందోళనలో ప్రయాణికులు
టైర్ ఊడిపోవడం.. ఇంజిన్ సమస్యలు రావడంతో విమానం గాల్లో తీవ్రంగా కుదుపులకు గురైంది. ఒక్కసారిగా బలంగా ఊగిపోవడంతో ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. విమానంలో అలజడి రేగడంతో ఓవర్‌హెడ్ క్యాబిన్‌లలో ఉంచిన ప్రయాణికుల లగేజీ బ్యాగులు, ఇతర వస్తువులు కిందపడిపోయాయి. కొన్ని వస్తువులు నేరుగా ప్రయాణికులపై పడటంతో క్యాబిన్ అంతా తీవ్ర భయాందోళన వాతావరణం అలుముకుంది.
సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్
పరిస్థితి తీవ్రతను తక్షణమే గ్రహించిన పైలట్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ విమానాన్ని తిరిగి మషాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పైలట్ల అత్యంత చాకచక్యమైన ల్యాండింగ్ విధానం వల్ల విమానం మషాద్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోవడంతో విమానయాన అధికారులు, ప్రయాణికుల కుటుంబసభ్యులు హమ్మయ్యా అని నిట్టూర్చారు.
దర్యాప్తునకు ఆదేశాలు
ఈ ఘటనపై ఇరాన్ విమానయాన నియంత్రణ సంస్థ , సేపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాయి. అసలు టేకాఫ్ సమయంలోనే టైర్ ఎలా ఊడిపోయింది? ఆ తర్వాత ఇంజిన్‌లో తలెత్తిన లోపానికి విమాన కుదుపులకు ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉందా? అనే కోణాల్లో అధికారులు ల్యాండింగ్ దృశ్యాలను, బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తున్నారు. పూర్తి విచారణ నివేదిక వచ్చాకే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.