మేయర్ చుట్టూ మహా రాజకీయం !

విజయనగరం మేయర్ చుట్టూ మహా రాజకీయం సాగుతోంది. వైసీపీ నుంచి కీలక నేత చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి.

Update: 2026-09-16 03:50 GMT

విజయనగరం మేయర్ చుట్టూ మహా రాజకీయం సాగుతోంది. వైసీపీ నుంచి కీలక నేత చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఢీ అంటే ఢీ అన్నట్లుగా కనిపించిన జిల్లా రాజకీయంలో త్రాస్ ఇపుడు కూటమి వైపు మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. చిన్న శ్రీనుకు జిల్లావ్యాప్తంగా ఉన్న రాజకీయ పట్టు పరిచయాలు కూటమికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల ముందు తగిలిన ఈ షాక్ మామూలుగా లేదని అంటున్నారు. బిగ్ షాట్ గా ఉన్న చిన్న శ్రీను వైసీపీకి దూరం కావడంతో సామాజిక రాజకీయ సమీకరణలలో వైసీపీకి తేడా కొడుతుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

మేయర్ సీటు కోసం :

ఇక విజయనగరం కార్పోరేషన్ లో వార్డుల సంఖ్య పునర్ విభజన తరువాత 50 నుంచి 62 దాకా పెరిగాయి. అంటే మరో పన్నెండు సీట్లు అన్న మాట. 2021లో తొలిసారి కార్పోరేషన్ గా విజయనగరం మారింది. అప్పట్లో ఒకటి రెండు తప్పించి మొత్తానికి మొత్తం వైసీపీ వార్డులు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మరో డజన్ వార్డులు పెరిగాయి. దాంతో కొత్తగా వచ్చిన సీట్లలో ఎవరి పట్టు ఏమిటి అన్నది కూడా చూడాల్సి ఉంది. అదే సమయంలో మేయర్ సీటుకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వైసీపీ టీడీపీ కూటముల నుంచి అభ్యర్థులు అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఇక చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో ఆయన కుమార్తె సహస్ర సిరి పోటీ చేస్తుందని కూడా ప్రచారం సాగుతోంది.

రిజర్వేషన్ లెక్కతో :

ఇక విజయనగరం కార్పోరేషన్ 2021లో బీసీగా మారింది. ఈసారి ఓసీ కేటరిగిరీలో ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. అలాగే మహిళకు గతంలో కేటాయించారు. ఈసారి జనరల్ చేస్తారా అనంది మరో చర్చగా ఉంది. ఈ రెండూ లెక్క తేలితే అభ్యర్ధులలో ఎవరు అసలు రేసులో ఉంటారు అన్నది చూడాలని అంటున్నారు. ఇప్పటి వరకూ చూస్తే చిన్న శ్రీను కుమార్తెతో పాటుగా గతంలో మునిసిపల్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా పనిచేసిన వారు సీనియర్ నేతలు అంతా మేయర్ పీఠం కోసం టీడీపీలో రేసులో ఉన్నారు. జనసేన కూడా విశాఖ మేయర్ పీఠం టీడీపీ తీసుకుంటే విజయనగరం పీఠం తమకు ఇవ్వాలని కోరుతోంది. బీజేపీకి కూడా ఆశలు ఉన్నాయని అంటున్నారు. అయితే అంగ బలం అర్ధం బలంతో పాటు అధిష్టాన వర్గం ఎవరి పేరుని ప్రకటిస్తుందో వారికే సీటు అన్నది ఉంది అంటున్నారు.

కోలగట్లతోనే అంతా :

ఇక విజయనగరం ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి పట్టణంలో తనకంటూ పట్టుని కలిగి ఉన్న మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ నుంచి భారం మోయాల్సి ఉందని అంటున్నారు. నిజానికి ఆయన కుమార్తె మేయర్ కావాల్సింది. 2021లో అంతా ఓకే అనుకున్న సమయంలో వైసీపీలోనే స్వామి ప్రత్యర్ధులు చక్రం తిప్పి బీసీ మహిళగా రిజర్వేషన్ చేయించారు అని ప్రచారం సాగింది. దాంతో డిప్యూటీ మేయర్ తోనే కోలగట్ల కుమార్తె శ్రావణి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం ఓసీ అయితే కోలగట్ల కుమార్తె పోటీకి మళ్లీ దిగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కోలగట్ల కాకపోతే అంతటి శక్తి సామర్ధ్యాలు ఎవరికి ఉన్నాయన్నది కూడా వైసీపీలో చర్చ సాగుతోంది. ఇక బీసీలు అధికంగా ఉన్నందువల్ల వారి నుంచి అభ్యర్థిని వైసీపీ పరిశీలించే చాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ కూటమికి ఎన్నికల కంటే ముందే చిన్న శ్రీను రూపంలో ఒక బలమైన నాయకుడు జత కలవడంతో వైసీపీ శిబిరంలో ఒకింత ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News